అంతా సిద్ధం.. ఇక ఓట్లేయడమే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు హైదరాబాద్‌ పోలీసులు రెడీ అయ్యారు.

Reporter :  Amaraiah Akula
Update: 2023-11-29 17:34 GMT

TS ASSEMBLY POLL POLICE

అంతా సిద్దం.. ఇక ఓట్లేయడమే!

అధికార యంత్రాంగం అప్రమత్తం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు హైదరాబాద్‌ పోలీసులు రెడీ అయ్యారు. తెలంగాణతో పాటు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాలపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే పోలీసులు పాతబస్తీని తమ అధీనంలోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలతో పాటు సిటీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

12 వేల మంది పోలీసులతో బందోబస్తు

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఈనెల 30న జరగనున్న పోలింగ్‌కు బందోబస్తు చేపట్టేందుకు రెడీ అయ్యారు. గత ఎన్నిక కంటే ఈసారి రెట్టింపు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. ఎన్నికల నిఘా కోసం అధునాతన సాంకేతికతో వెబ్‌కాస్టింగ్, పోలింగ్‌ స్టేషన్ల పర్యవేక్షణ చేయనున్నారు. ఎన్నికల కోసం ఒక్కో కమిషనరేట్‌కు 20 కంపెనీల చొప్పున కేంద్ర బలగాలు వచ్చాయి. వారితో కలిసి రాచకొండలో, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 12 వేల మంది చొప్పున పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 30 కంపెనీల కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు సుమారు 35 వేల మంది బందోబస్తులో ఉంటారు.

190 కంపెనీల కేంద్ర బలగాలు

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భద్రత కోసం 190 కంపెనీల కేంద్ర బలగాలు ఇప్పటికే విధుల్లో ఉండగా.. మరో 74 కంపెనీల బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. తెలంగాణకు చెందిన 45 వేల మంది పోలీసులు, 3 వేల మంది ఎక్సైజ్ పోలీసులు, 50 వేల TSSP సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన 23 వేల 500 మంది హోంగార్డులు తెలంగాణకు చేరుకున్నారు.

మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు..

మరోవైపు పోలింగ్ కేంద్రం నెంబర్‌ను గూగుల్ సెర్చ్ చేయగానే అక్కడ ఓటింగ్ శాతం, ప్రస్తుత పరిస్థితి సహా అన్ని వివరాలు తెలిసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైక్రో అబ్జర్వర్స్, వెబ్‌ కాస్టింగ్, సీసీటీవీ కెమెరాల నిఘా, ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కమిషనరేట్‌కు మూడు చొప్పున మొబైల్‌ వ్యాన్లను అందుబాటులో ఉంచారు. నగరంలోని కీలకమైన పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ యంత్రాలను రవాణా చేసే వాహనాలు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 391 రూట్ మొబైల్స్

ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌ వద్ద 391 రూట్ మొబైల్స్‌, ముగ్గురు సాయుధ సిబ్బందితో పాటు ఒక కానిస్టేబుల్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే డయల్‌ 100 కాల్స్‌పై వెంటనే స్పందించేందుకు 129 పెట్రోలింగ్‌ వాహనాలు, 220 బ్లూ కోల్ట్స్‌, 122 ఇతర వాహనాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా 45 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 45 స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలతో 28 మంది ఏసీపీలు, ఏడుగురు డీసీపీ ర్యాంకు అధికారులతో కూడిన స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ విధులు నిర్వర్తిస్తున్నాయి. 9 టాస్క్‌ఫోర్స్ బృందాలు, 9 ప్రత్యేక బలగాల బృందాలు, 71 మంది ఇన్‌స్పెక్టర్లతో పాటు 125 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వహించనున్నారు. కేంద్ర బలగాలతో కలిసి నగరవ్యాప్తంగా ఫ్లాగ్‌ మార్చ్‌లు నిర్వహిస్తూ ప్రజలకు ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. పోలింగ్‌, కౌంటింగ్‌ రోజుల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉండనున్న నేపథ్యంలో ప్రజలు ఒకచోట గుమికూడవద్దని.. ఓట్లు వేసిన వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.

పాత బస్తీపై డేగకన్ను..

ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే తీవ్రమైన చర్య తీసుకుంటామంటున్నారు పోలీసులు. హైదరాబాద్ సీపీ సందీప్‌ శాండిల్య పోలీసు అధికారుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్ల కదిలికలపై ఫోకస్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5 వేల మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా పాతబస్తీలోని 7 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. గత ఎన్నికలో పాతబస్తీలో స్వల్ప ఉద్రిక్త ఘటనలు జరిగాయి. దీంతో ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతబస్తీపై డేగ కన్నుతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News