‘ఢిల్లీ జంతర్ ధర్నా బిఆర్ ఎస్ ఎంపిలు ఎందుకు రాలేదు?’

నూరు మంది ఎంపిలు వచ్చి మద్దతు తెలిపారు, బిఆర్ ఎస్ వాళ్లే రాలేదు: రేవంత్;

Update: 2025-09-01 02:20 GMT

 ఢిల్లీలో చేయాల్సిన పనిని హైదరాబాద్ లో చేస్తే లాభం ఏమిటి? : కెటిఆర్


-జి. రాం మోహన్ 

హైదరాబాద్, ఆగస్టు 31: స్థానిక సంస్థల లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు ఉద్దేశించిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్ ను తెలంగాణ అసెంబ్లీ వాడి వేడి చర్చలు పరస్పర ఆరోపణల నడుమ ఆమోదించింది.

2018 లో రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్నిసవరిస్తూ నేటి బిల్లు రూపొందించారు. జూలైలో ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని పెంచటానికి ఆర్డినెన్సు జారీచేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలుకు తాము చేసిన ప్రయత్నాలను వివరించారు. “కోర్టు ఆదేశాల మేరకు ఒక డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా వుండటానికి రాష్ట్ర నుండి అధికారుల కమిటీని, మంత్రులను ఇతర రాష్ట్రాల పంపించి సమాచారాన్ని సేకరించాము. బీసీ ల వివరాలు సేకరించే బాధ్యతను రాష్ట్ర బీసీ కమిషన్ కు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టు ఆదేశాల మేరకు డెడికేషన్ కమిషన్ ను నియమించి మొత్తం ప్రక్రియ ను ఫిబ్రవరి 4, 2024 న మొదలుపెట్టి 365 రోజులలో ఫిబ్రవరి 4, 2025 కు పూర్తి చేశాం. రిపోర్టు మా చేతికి వచ్చిన తరువాత విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపాము. అయితే గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించడం తో 5 నెలలుగా ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరపాలని హై కోర్టు ఆదేశించటం తో 2018 లో 50 శాతానికి రిజర్వేషన్ల ను పరిమితం చేస్తూ చేసిన చట్టానికి సవరణ చేస్తున్నాము,” అని ఆయన బిల్లు నేపథ్యాన్ని సభకు వివరించారు. 


5 లేఖలు రాసి అపాయింట్‌మెంట్ కోరినా ప్రధాని అపాయింట్‌మెంట్ యివ్వలేదని అందుకే అఖిల పక్షాన్ని ఢిల్లీ కి తీసుకెళ్లలేదు అని ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబుగా చెప్పారు. అందుకే వారిపైన ఒత్తిడి తెచ్చేందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. దానికి వివిధ రాష్ట్రాల నుండి 100 మంది ఎంపీలు వచ్చి మద్దతు యిచ్చినా బిఆర్ఎస్ కు చెందిన 4 గురు రాజ్య సభ సభ్యులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడలేదు. యిప్పుడు కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్ ను అడ్డుకోవాలని చూస్తున్నారని గంగుల కమలాకర్ ను ఉద్దేశించి సిఎం ఆరోపించారు. “మేము మా ఈ ప్రయత్నాలకు గుర్తు గా ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని నిర్ణయించాం. బలహీన వర్గాల గురించిన జరుగుతున్నఈ చర్చకు కెసిఆర్ వచ్చి 100 ఏళ్లుగా ఎవరు చేయని పని మేము చేసినందుకు మమ్మల్ని అభినందించి ఉంటే ఆయన పెద్దరికం పెరిగి ఉండేది,” అని అన్నారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ బిల్లు ను అన్నీ పార్టీలు ఏకాభిప్రాయం తో ఆమోదించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బిఆర్ఎస్ ఎంఎల్ఏ గంగుల కమలాకర్ లు ఒకరినొకరు అవమానించుకుని ఇతరుల ముందు పలుచన కావొద్దని చెప్పారు. కమలాకర్ గారు పార్టీ అధ్యక్షుల దృష్టి తో కాకుండా సొంతంగా ఆలోచించాలని కోరారు. 


బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ 2018 లో కొత్త చట్టం చేసి రిజర్వేషన్ ల పైన 50 శాతం సీలింగ్ తెచ్చారనే వాదనను తిరస్కరించారు. “50 శాతం సీలింగ్ ను సుప్రీం కోర్టు నిర్ణయాల మేరకే అందులో నిర్దేశించాము. మోడి రాహుల్ గాంధీ అనుకుంటే ఈ బిల్ వెంటనే ఆమోదం పొందుతుంది. పార్లమెంటు లో జరగాల్సిన చర్చ అసెంబ్లీ లో చేసి ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీ బిల్లు మీద 5 నాల్కల ధోరణితో వుంది. దానిని సాధించేందుకు ఒకసారి రాజ్యాంగ సవరణ చేస్తామని, ఆర్డినెన్సు ద్వారా అని ఒక సారి, లేదా పార్టీ పరంగా యిస్తామని ఒకసారి, మళ్ళీ బిల్లు ద్వారా అని పదే పదే తమ వైఖరిని మారుస్తున్నారు. ఆర్డినెన్సు మీద సంతకం పెట్టని గవర్నర్ బిల్ మీద సంతకం పెడతారని ఎలా అనుకుంటున్నారు. కామ రెడ్డి తీర్మానం లో హామీ యిచ్చినట్టు గా రిజర్వేషన్లు అమలు కావాలంటే ఈ చట్టాన్ని 9 వ షెడ్యూల్ పెట్టాలి. యూపీఏ లో భాగంగా వుండగా మేము 2004 సంవత్సరం లో నే కేంద్రం లో కూడా ఓబీసి మంత్రిత్వ శాఖ వుండాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరాము. మేము 5 గురు బీసీలను రాజ్య సభ కు పంపాము. ఉన్న మూడు ప్రోటోకాల్ పదవుల లో రెండు బీసీ లకు కేటాయించాము. అందులో భాగంగా కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడిగా మధుసూధన చారిని, డిప్యూటీ గా బండ ప్రకాష్ లకు ఆ విధంగా తగిన గుర్తింపు యిచ్చాము,” అని గుర్తు చేశారు.

బిల్లు ను ఆమోదింప చేసుకోవటానికి డిక్లరేషన్ ఒకటే సరిపోదు డెడికేషన్ కావాలి. కేవలం స్థానిక సంస్థలలో లబ్ధి కోసం చేసే యిలాంటి ప్రయత్నం సరిపోదు. రాహుల్ ప్రధాని అయితే నే మేము డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పలేదు కదా. బిసి సబ్ ప్లాన్ పైన చట్టం చేసి అన్నీ రంగాలలో తగిన వాటా యివ్వాలి. చట్టం సరిగ్గా చేస్తే నే కోర్టులు జోక్యం చేసుకోవు, అని అన్నారు.

బిఆర్ఎస్ తరపున గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం తమిళ నాడు తరహాలో తగిన అధ్యయనం చేసి ముందుకు వెళ్లాలని చెప్పారు. “1982 ల 1985 మద్యన అంబ శంకర్ కమిషన్ 2.5 సంవత్సరాలు అధ్యయనం చేసి రిపోర్ట్ యిచ్చింది. లేదంటే బీహార్, మధ్య ప్రదేశ్ తరహా లో చేస్తే కోర్టు లు కొట్టిసే అవకాశం వుంది. రాష్ట్రం లో ఏర్పాటు చేసిన భూసాని కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టలేదు. డెడికేటెడ్ కమిషన్ ను ఆర్టికల్ 340 క్రింద కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ 1952 చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిoధి. అలా చేయనందుకు ఈ రిపోర్ట్ ను కోర్టు కొట్టివేసే అవకాశం వుంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు.

దీనికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ బిఆర్ఎస్ మొత్తం ప్రక్రియను యింకో పది సంవత్సరాలు ఆలస్యం చేయాలని చూస్తున్నట్టు గా వుందని ఆక్షేపించారు. “కోర్టు చెప్పిన ప్రకారమే మేము డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేశాం. సభ మొత్తం ఏకాభిప్రాయం తో బిల్ ను ఆమోదించాలని కోరుతున్నాము. తమిళనాడు పద్ధతిలో చేసినా సుప్రీం కోర్టు షెడ్యూల్ 9 లో పెట్టిన వాటిగురించి కూడా తాము జోక్యం చేసుకుంటామని చెప్పిన విషయం గుర్తు పెట్టుకోవాలి. అసెంబ్లీ సమావేశం లో లేనప్పుడు ఆర్డినెన్సు యిచ్చాము యిప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బిల్లు తెచ్చాము. గవర్నర్ అధికారాలపైన సుప్రీం కోర్టు లో వాదనలు త్వరలో ముగుస్తాయి. మేము ఒక పాజిటివ్ దృష్టితో ముందుకు వెళ్తున్నాము. సభ ఉద్దేశం చెప్పి గవర్నర్ ఆలోచన మార్చే ప్రయత్నం చేస్తాము. ఆయన సభ ఉద్దేశం చూస్తారు. ఏమైనా బలహీన వర్గాలకు మంచి చేయాలి అని చిత్తశుద్ధి వుండాలి,” అని ఆయన అన్నారు.

“బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు యివ్వడం కోసమే సర్వే చేశాము. సిఎం కు బంధువు అని ఎవరో కోర్టుకు పోతే దానిని పార్టీ కి ఆపాదించటం తప్పు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు మద్యన ఆరు నెలల గడువు మాత్రమే ఉండింది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తుంది అనే మేము రిజర్వేషన్ ల పైన వాగ్దానం చేశాము. బీజేపి లో కూడా మోడి బీసీ ప్రధాని అభ్యర్థి గా వున్నాడు కాబట్టి వారు కూడా సహకరించి ఆమోదిస్తారు అనుకున్నాము. జయలలిత గారు 69 శాతం కోటా సాధించినప్పుడు కేంద్రం లో మైనారిటీ ప్రభుత్వం వుంది,” అని అప్పటి పరిస్థితి ని గుర్తు చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క.

బీజేపి నాయకుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ చట్టం చేసే ముందు న్యాయ పరమైన చిక్కుల గురించి ఆలోచన చేయాలని పార్లమెంటు లో తాము ఎప్పుడు బీసీ బిల్ కు వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. బీసీ కోటా పేరుతో ముస్లిం లకు కూడా రిజర్వేషన్ యిస్తున్నారు అని బిల్లుపైన తమ పార్టీ కి వున్న అభ్యంతరాన్ని చెప్పారు. “కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు బీసీ లకు పదవులలో ఎందుకు వాటా యివ్వటం లేదు. అధికారుల యూనివర్సిటీ వీసీ నియామకాల్లో బీసీ లకు అన్యాయం జరుగుతోంది. మా మీద నెపం వేసి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మీ చేతిలో వున్నవి చేసి బీసీ పట్ల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి,” అని అన్నారు.

సభలో సభ్యులు డొంకతిరుగుడు గా మాట్లాడుతున్నారని సిపిఐ సభ్యుడు కూనమనేనీ సాంబశివరావు ఆక్షేపించారు. “బీజేపి సంపూర్ణ మద్దతు అంటూ బిల్లు ను షెడ్యూల్ 9 లో చేర్చేందుకు ఎందుకు కలిసి రావటం లేదు. తమిళనాడు లో జయలలిత పోరాటం చేయటం వలన నరసింహ రావు ప్రభుత్వం షెడ్యూల్ 9 లో చేర్చేందుకు ఆమోదించింది. బిల్లును అపుతున్నది కేంద్రమే కదా. యిది విప్లవాత్మక మైన మార్పు. మంత్రివర్గం లో ఎంత మంది బీసీ లు వున్నారు లాంటివి బిల్లు చట్టం అయితే మారుతాయి. బిల్లు ను ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ పైన ఒత్తిడి తేవాలి. బీసీ, ఎస్సి, ఎస్టీ ల లో చైతన్యం వచ్చింది. సాధారణ సీట్ ల లో కూడా బీసీ లు నిలబడుతున్నారు. ముస్లిం ల లో వెనుకబడిన కులాలు లేవా. బిల్లు లో వెనుకబాటుతనం ఆధారంగా యిచ్చిన రిజర్వేషన్లకు మతం రంగు పులమడం తప్పు,” అని బీజేపి సభ్యుడి అబిప్రాయాన్ని ఖండించారు.

Tags:    

Similar News