రేవంత్‌కు రామచందర్ రావ్ మద్దతు

రేవంత్‌కు నోబెల్ ప్రైజ్, ఆస్కార్ అవార్డు కాదు.. గోబెల్ ప్రైజ్, భాస్కర్ అవార్డులు ఇవ్వాలంటూ చురకలు.;

Update: 2025-07-25 13:45 GMT

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే మరోవైపు ఆయనపై సెటైర్లు వేశారు. ఉపరాష్ట్రపతి పదవికి బండారు దత్తాత్రేయను సిఫార్సు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు మద్దతు పలికారు. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో జరిగిన కార్యక్రమంలో రేవంత్ చేసిన అవార్డు వ్యాఖ్యలపై చురకలంటించారు. రేవంత్‌కు ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డ్ కాదని భాస్కర్ అవార్డు అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగానే ప్రధాని నరేంద్ర మోదీ కులంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. కనీస విషయ జ్ఞానం లేకుండా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం విచారకరమని అన్నారు.

రాహుల్ గాంధీ కులం ఏంటి?

ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం కావడానికి ముందు నుంచే ఆయన కులం బీసీగా ఉందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఎన్నో కులాలు బీసీల్లో కలిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగానే రాహుల్ గాంధీ కులంపై రామచందర్ రావు ప్రశ్నించారు. ఆయన తల్లిదండ్రులు వేరు వేరు కులాలకు చెందిన వారని, అలాంటప్పుడు రాహుల్ గాంధీ కులం ఏంటి? అని ప్రశ్నించారు. రేవంత్.. ముందు ఆ విషయం తెలుసుకుని ఆ తర్వాత మోదీ కులంపై మాట్లాడాలని సూచించారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సరికాదని హెచ్చరించారు.

సీఎంగా పొన్నంకో,  భట్టికో అవకాశం ఇవ్వండి..!

‘‘సీఎం పదవికి రేవంత్ రెడ్డి అనర్హుడు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.. ఈ పదవిని పొన్నం ప్రభాకర్‌కు గానీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గానీ సీఎంగా ప్రకటిస్తే మేమూ ఆనందిస్తాం. వాళ్లలో నిజమైన నాయకత్వ లక్షణాలు ఉండటమే అందుకు కారణం’’ అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దత్తాత్రేయ అర్హుడు..

అనంతరం ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ నేత బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్‌పై కూడా రామచందర్ రావు స్పందించారు. ఈ విషయంలో రేవంత్ నిర్ణయంతో ఏకీభవిస్తామన్నారు. ‘‘సీఎం రేవంత్‌ గారు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వాలని కోరడం ఓ మంచి అభిప్రాయం. దత్తాత్రేయ గారు ఆ పదవికి అర్హుడు. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలన్న సీఎం అభిప్రాయాన్ని మేమూ స్వాగతిస్తున్నాం" అని అన్నారు.

భట్టి వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తా..!

రోహిత్ వేముల ఆత్మహత్యకు రామచందర్ రావు కారణమని, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన నియామకాన్ని బీజేపీ పునరోలించాలన్న భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై రామచందర్ రావు మరోసారి స్పందించారు. భట్టి వ్యాఖ్యలపై తాను కోర్టుకు వెళ్తానని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రామచందర్ రావు నోటీసులు ఇచ్చారు. తనకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రూ.25కోట్ల పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. కాగా ఆ నోటీసులను తాను భయపెట్టడానికి పంపలేదని స్పష్టం చేశారు. పాపం భట్టి.. తాను పంపిన నోటీసులను పూర్తి చదవలేదని భావిస్తున్నట్లు చెప్పారు.

హైడ్రా ఒక ఫెల్యూర్ వ్యవస్థ

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా అనేది ఒక ఫెల్యూర్ వ్యవస్థ. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఉంచాలా వద్దా అనే అంశంపై ఆలోచిస్తాం. హైడ్రాకు పేదవాడి ఇల్లు కూల్చినప్పుడు కనిపించని మానవత్వం ఫాతిమా కాలేజీ దగ్గర గుర్తు వచ్చిందా..?’’ అని అన్నారు. అనంతరం రాజాసింగ్ అంశం గురించి మాట్లాడుతూ.. అది కేంద్ర చూసుకుంటుందని, హైకమాండ్ పరిధిలోని అంశంపై మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశారని.. ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు

పోస్టుల భర్తీలో ఒత్తిడి వద్దు..

అనంతరం పార్టీలోని కమిటీ పోస్టుల భర్తీపై కూడా రామచందర్ రావు స్పందించారు. వీటి భర్తీ విషయంలో తనపై ఒత్తిడి తీసుకురావద్దన్నారు. కమిటీలో మొత్తం ఖాళీ ఉన్న పోస్టులే 20 అని తెలిపారు. 8 ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 7 కార్యదర్శులు, ఒక కోశాధికారి పోస్టు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్.. కుటుంబ పార్టీ కాబట్టి అందులో జంబో సైజు కమిటీ ఉంటుందని, బీజేపీ అలా కాదని అన్నారు. ఐదేళ్లుగా తనకు పార్టీలో ఎటువంటి పదవి లేదని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవిని హైకమాండ్ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ అధిష్టానం కష్టపడి పనిచేసిన వారెవరినీ మర్చిపోదని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తుందని అన్నారు.

అతి త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం గుర్తు వికసించేలా ప్రతి ఒక్కరూ శ్రమించాలని కోరారు. నాయకులు కూడా హైకమాండ్ ఆదేశించిన విధంగా అధిక సంఖ్యలో పర్యటనలు చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

Tags:    

Similar News