Telangana | నాలుగు సంక్షేమ పథకాలకు సీఎం రేవంత్ ప్రాధాన్యం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సర్కారు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.సీఎం రేవంత్ రెడ్డి నాలుగు పథకాల అమలును సమీక్షించారు.;
By : The Federal
Update: 2025-01-24 09:14 GMT
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం జనవరి 26వతేదీన శుభవార్త వెల్లడించనుంది.రైతులకు రైతు భరోసా,వ్యవసాయ భూమిలేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కార్డుల్లేని అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అయింది. నాలుగు సంక్షేమ పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చి ఒకేరోజు ప్రారంభించనున్నారు.
- దావోస్ పర్యటనను ముగించుకొని శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో సమావేశమై ఈ నాలుగు కీలక సంక్షేమ పథకాల గురించి సమీక్షించారు.
- రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని నిర్ణయించారు.
రైతు భరోసా రూ.12వేలు
తెలంగాణలో సాగులో ఉన్న భూములకు గాను రైతు భరోసా పథకం కింద ఒక్కో ఎకరానికి రూ.12వేలను అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రబీ సీజను కోసం రూ.6వేలను పంపిణీ చేయనున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో రైతు బంధు పథకం కింద ఎకరానికి రూ.10వేలు ఇచ్చారు. దీన్ని మరో రెండువేల రూపాయలు పెంచి రైతులకు కాంగ్రెస్ సర్కారు అందించనుంది. ఖరీఫ్, రబీ సీజన్లకు రెండు విడతలుగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో వేస్తారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
రాష్ట్రంలో వ్యవసాయ భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అందించనున్నారు. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా లబ్దిదారులకు అందిస్తారు.గ్రామాల్లోని కూలీలను ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఇందిరమ్మ గృహాలు
ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులు తమ సొంత ప్లాట్లలో ఇళ్లను నిర్మించుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు.ఇళ్ల నిర్మాణ పురోగతికి అనుగుణంగా, ఒక్కొక్క లబ్ధిదారుడికి రూ.లక్ష చొప్పున ఐదు విడతలుగా నిధులు పంపిణీ చేయనున్నారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ మోడల్ ఇళ్లను నిర్మించుకునేందుకు ఈ ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఇప్పటికే ప్రభుత్వం సర్వే కూడా జరిపింది.
కొత్త రేషన్ కార్డుల జారీ
రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని అర్హులందరికీ రిపబ్లిక్ డే కానుకగా కొత్త రేషన్ కార్డులు అందించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. దీనిలో భాగంగా కులగణన సర్వే నివేదికల ఆధారంగా కొత్త కార్డులను జారీ చేయనున్నారు. దీంతో పాటు గ్రామ సభల్లోనూ రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకుంటున్నారు.
సంక్షేమ పథకాలపై సర్కారుకు చిత్తశుద్ధి ఏది? : తన్నీరు హరీష్ రావు
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు కలిచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఈనెల 26వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, మరోవైపు గ్రామ సభల్లో విడుదల చేసిన జాబితా ఫైనల్ చేయలేదని చెప్పడం హాస్యాస్పదమని హరీష్ రావు అన్నారు. ‘‘మీ సేవలో దరఖాస్తులు చేసుకున్నరు.ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు.కుల గణనలో వివరాలు తీసుకున్నరు. ఇప్పుడు గ్రామ సభల పేరిట మరో కొత్త డ్రామా చేస్తున్నరు. మల్లా దరఖాస్తులు తీసుకుంటున్నరు’’అని హరీష్ రావు విమర్శించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలు పేదలకు అందించాలనే చిత్తశుద్ది ఉంటే, గ్రామ సభల పేరిట ఎందుకు ఇంత డ్రామా? అని ఆయన ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా, మల్లాపూర్ మండలం, మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం బాధాకరం.
— Harish Rao Thanneeru (@BRSHarish) January 24, 2025
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని ములుగు జిల్లా, బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటం మనస్సు… pic.twitter.com/EWAlHHPQ0l