ఢిల్లీ పెద్దలతో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం..
అన్ని విషయాలు కొలిక్కి వస్తాయన్న తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.;
తెలంగాణ కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారంతా సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. హస్తినాపురంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు వాటి అమలు, పెండింగ్‌లో ఉన్న హామీలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్.. అతి త్వరలోనే అన్ని విషయాలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పారు.
‘‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఖర్గే, రాహుల్ గాంధీ అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం, విద్య వ్యవహారాల గురించి రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు వల్ల ఎంతమంది ఎస్సీ,ఎస్టీ ,ఓబీసీ ,మైనారిటీ వర్గాలకు లాభం జరుగుతుంది ఎంతమందికి ప్రవేశాలు ఉంటాయనే దానిపై చర్చ జరిగింది. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం పై చర్చ జరిగింది. అన్ని విషయాలపై రాష్ట్ర నాయకత్వం నుంచి సమగ్ర సమాచారం తీసుకున్నారు. త్వరలోనే అన్ని అంశాలు కొలిక్కి వస్తాయని ఆశిస్తున్నాం. అభివృద్ధి సంక్షేమ అంశాలతో పాటు అన్ని విషయాలు సమగ్రంగా అధిష్టానానికి వివరించాం. అన్ని విషయాల పై త్వరలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది’’ అని ఆయన తెలిపారు. మహేష్ కుమార్ వ్యాఖ్యలతో ఉగాది నాటికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.