‘గాల్లో దీపంలో మారిన రైతుల దుస్థితి’.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు చురకలు

తెలంగాణ రైతులు ఎదర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే తెలంగాణ రైతులకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-11-03 10:51 GMT

తెలంగాణ రైతులు ఎదర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాల వల్లే తెలంగాణ రైతులకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ తీరా అధికారం వచ్చాక రైతులను నట్టేట ముంచేసిందని, బోనస్ కాదు కదా గిట్టుబాటు ధర కూడా ఇప్పించలేదని, కొన్ని జిల్లాల్లో అయితే అసలు కొనుగోలే మొదలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకో న్యాయం.. ప్రత్యర్థులకో న్యాయంగా కాంగ్రెస్ ధోరణి ఉందని ఉందని విమర్శించారు.

ప్రస్తుతం తడిసిన వడ్లను కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం నిరాకరిస్తోందని, అదే కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ హయాంలో తమ ప్రభుత్వం తడిసిన వడ్లను కూడా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అలా.. అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంక్షేమం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు బంధు ఎందుకు ఇవవడం లేదని, వడ్లకు బోనస్ ఎందుకు ఇప్పించడం లేదని నిలదీశారు. కల్లాల దగ్గర వడ్ల కొనుగోల్లు కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కానీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్.

ప్రభుత్వ ఏర్పాట్లు చేయాలి..

అన్ని జిల్లాల్లో కూడా వడ్లు కొనుగోలు చేయడం కోసం కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన ప్రారంభించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ‘‘రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ఈ ప్రభుత్వం పాలనలో రైతుల పరిస్థితి గాల్లో దీపంలా మారింది. వడ్ల కోసం రైతులకు సంచులు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. దీనిని బట్టే ఈ ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఈ ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని విమర్శించారు.

‘‘రేవంత్ సర్కార్‌కు రైతులు మద్దతు, వాళ్లు వేసే ఓట్లు కావాలి. కానీ రైతులు పండించే వడ్లకు మాత్రం కనీస మద్దతు దర కూడా కల్పించదీ ప్రభుత్వం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీ ప్రభుత్వం వచ్చి ఏడాది కావొస్తున్నా పేపర్లకు పరిమితం అయింది. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న బస్తాలు నాణ్యత లేకపోవడంతో క్వింటాకు రూ.వెయ్యి వరకు ప్రతి రైతు నష్టపోతున్నారు’’ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News