టార్గెట్ కేసీయార్ ?

ఘోష్ కమిషన్ విచారణ కాలపరిమితిని ఆగష్టు 31వరకు, నరసింహారెడ్డి కమిషన్ విచారణ కాలపరిమితిని జూలై 31వ వరకు పెంచింది.

Update: 2024-06-30 06:03 GMT
kcr

రెండు విచారణ కమిషన్ల కాలపరిమితిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొడిగించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్, విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. రెండు కమిషన్ల విచారణ కాలపరిమితి ఆదివారంతో ముగిసిపోయింది. అందుకనే ఘోష్ కమిషన్ విచారణ కాలపరిమితిని ఆగష్టు 31వరకు, నరసింహారెడ్డి కమిషన్ విచారణ కాలపరిమితిని జూలై 31వ వరకు పెంచింది.

పై రెండు కమిషన్ల విచారణ కాలపరిమితిని ప్రభుత్వం పెంచటంపై బీఆర్ఎస్ నేతలు మండిపోతున్నారు. రెండింటిలో కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ తీరుపై కేసీయార్ నిప్పులు చెరుగుతున్నారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమంటు హైకోర్టులో పిటీషన్ కూడా వేశారు. కమిషన్ విచారణను అడ్డుకోవాలని, అసలు కమిషన్ ఏర్పాటునే రద్దుచేయాలంటు కోర్టును ఆశ్రయించారు. అయితే కేసీయార్ వాదనను కోర్టు అంగీకరించలేదు. పైగా విచారణ ఎందుకు చేయకూడదంటు కేసీయార్ తరపు లాయర్ను సూటిగా ప్రశ్నించింది. రెండువైపుల లాయర్ల వాదనలను విన్నకోర్టు తీర్పును రిజర్వుచేసింది. బహుశా సోమవారం లేదా మంగళవారం తీర్పు రావచ్చని అనుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయిన పరిస్ధితుల్లో తెలంగాణాలోని విద్యుత్ సమస్యలను అధిగమించేందుకే తాను ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, ఎలక్ట్రిసిటి రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం ప్రకారమే ధరలు నిర్ణయించి కొనుగోలు చేసినట్లు కేసీయార్ ఒక లేఖలో చెప్పారు. అయితే కేసీయార్ వాదనను అప్పటి ఉన్నతాధికారులు, విద్యుత్ రంగం నిపుణులు కొట్టిపారేస్తున్నారు.

కేసీయార్ నిర్ణయం వల్లే ప్రభుత్వంపై రు. 600 కోట్ల అదనపు భారం పడిందని గట్టిగా చెబుతున్నారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు వల్ల ప్రభుత్వానికి చాలా సమస్యలు వస్తాయని చెప్పినా కేసీయార్ వినలేదని నిపుణులు, ఉన్నతాధికారులు కమిషన్ కు చెప్పారు. కేసీయార్ నిర్ణయాలు ఏ విధంగా తప్పోకూడా ఉదాహరణలతో సహా కమిషన్ కు వివరించారు. కేసీయార్ను విచారించేందుకు కమిషన్ రెండుసార్లు నోటీసులిస్తే రెండుసార్లూ స్పందించలేదు. కాబట్టి కేసీయార్ను విచారణకు రప్పించటంలో కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందనే విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఉన్నతాధికారులుగా తామున్నప్పటికీ తమ సిఫారసులను కాదని మొత్తం నిర్ణయాలన్నింటినీ కేసాయరే ఏకపక్షంగా తీసుకుని అమలు చేసినట్లు ఉన్నతాధికారులు కమిషన్ కు ఇప్పటికే వాగ్మూలాలు ఇచ్చారు. దాంతో కేసీయార్ ఏదోరోజు కమిషన్ విచారణకు హాజరుకాక తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే విషయమై కేసీయార్లో కూడా టెన్షన్ పెరిగిపోతున్నట్లే ఉంది.

ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారెజీలు బ్రహ్మపదార్ధాలుగా తయారయ్యాయి. వీటిని ఉపయోగించుకునేందుకు లేదు అలాగని వదిలేసేందుకు లేదు. ఈ బ్యారేజీల్లో నీటిని నిల్వ ఉంచితే బ్యారేజీల నిర్మాణాలకే ప్రమాధం. అలాగని నీటిని నిల్వఉంచకపోతే సుమారు లక్ష కోట్లరూపాయలు ఖర్చుచేసి నిర్మించిన బ్యారేజీలు ఎందుకు ? అనే ప్రశ్న వస్తోంది. ఈ బ్యారేజీల నిర్మాణంలో కూడా కేసీయార్ ఏకపక్ష నిర్ణయాలే తీసుకున్నారని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఇరిగేషన్ నిపుణులు ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు వాగ్మూలాలు ఇచ్చారు. బ్యారేజీల నాసిరకం నిర్మాణాల బాధ్యతంతా కేసీయార్ ది మాత్రమే అని ఉన్నతాధికారులు, నిపుణులు పదేపదే చెబుతున్నారు. మేడిగడ్డలో బ్యారేజి నిర్మించివద్దని తాము స్పష్టంగా నివేదికలో చెప్పినా కేసీయార్ వినిపించుకోలేదని రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ల కమిటి కూడా కమిషన్ ముందు సాక్ష్యమిచ్చింది.

ఏ రూపంలో చూసుకున్నా రెండు కమిషన్ల విచారణలో కేసీయార్ తగులుకోకతప్పదనే అందరికీ అర్ధమవుతోంది. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో తీసుకున్న నిర్ణయాలను కేసీయార్ ఎంత సమర్ధించుకుంటున్నా వాటిల్లోని డొల్లతనం అర్ధమైపోతోంది. తన భవిష్యత్తు ఎలాగ ఉండబోతోందనే విషయంలో కేసీయార్ కు క్లారిటి ఉండటంతోనే ఎదురుదాడులు చేస్తు కోర్టుల్లో కేసులు వేసినట్లుగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి కాలవ్యవధి ముగిసేలోగా కమిషన్లు కేసీయార్ విషయంలో ఏమి నిర్ణయం తీసుకుంటాయో చూడాల్సిందే.

Tags:    

Similar News