గల్బ్ మృతుల వారసులకు భారీ ఎక్స్‌గ్రేషియా
ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం 66 మందికి మొత్తం రూ.3.30కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి తెలిపారు.;
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు చేసిన మోసాలకు ఎందరో బలయ్యారు. అధిక జీతం వస్తుందని ఆశపడి వెళ్లి గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారు. అక్కడే ప్రాణాలు విడిచిన వారు కూడా ఉన్నారు. కాగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గల్ఫ్ దేశాలలో చిక్కుకుని మరణించిన వారికి ప్రభుత్వం భారీగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం 66 మందికి మొత్తం రూ.3.30కోట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, ఈ ఎక్స్‌గ్రేషియా నగదును బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎం సూచన మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆర్థిక, ప్రణాళిక) కె. రామక్రిష్ణా రావుతో సమన్వయము చేసి నిధులు విడుదల చేయించానని అనిల్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 28 మంది, జగిత్యాల 19, కామారెడ్డి 9, నిర్మల్ 7, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున 66 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయినవని వివరించారు. గతంలో 103 మందికి రూ.5 కోట్ల 15 లక్షలు విడుదల చేశారని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 169 మందికి రూ.8 కోట్ల 45 లక్షలు చెల్లింపు జరిగిందని అనిల్ వివరించారు.