Revanth and Chandrababu|ఏపీ మంత్రిపై తెలంగాణా ప్రభుత్వం నిఘా ?

లేఖ రాయటమే కాకుండా ఫోన్ చేసి డార్లింగ్ మంత్రిపైన ఫిర్యాదు కూడా చేశారు.;

Update: 2025-01-05 05:30 GMT
Revanth and Chandrababu

వినటానికి, చదవటానికే ఈ వార్త విచిత్రంగా ఉంది. ఏ రాష్ట్రంలోని మంత్రులపై ఆ రాష్ట్రంలో నిఘా ఉండటం చాలా సహజం. కాని ఒక రాష్ట్రమంత్రిపై మరో రాష్ట్రంలోని పోలీసులు నిఘా ఉంచటమే ఇక్కడ విచిత్రం. ఇంతకీ విషయం ఏమిటంటే ఏపీలోని ఒక మంత్రి వ్యవహారాలపైన తెలంగాణా ప్రభుత్వం నిఘా(Telangana police) ఉంచిందని సమాచారం. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు(Chandrababu)కు నూరుశాతం మద్దతుగా నిలిచే మీడియా సంస్ధ ప్రముఖంగా ప్రచురించింది. ఈ మీడియా యాజమాన్యమే చంద్రబాబుకు కళ్ళు, చెవులుగా వ్యవహరిస్తుంటుందనే ప్రచారం కూడా ఉంది. కాబట్టి టీడీపీ గురించి లేదా ప్రభుత్వంగురించి ఈ మీడియాలో వచ్చిందంటే దాదాపు నిజమనే అనుకోవాలి. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే సదరు ‘డార్లింగ్ మంత్రి’ వ్యవహారాలను తెలంగాణా నిఘాఅధికారులు సేకరించి రేవంత్ రెడ్డి(Revanth)కి అందించారు. దాంతో నిఘాసంస్ధల సమాచారాన్ని ప్రస్తావిస్తు చంద్రబాబుకు రేవంత్ ఒక లేఖ రాసినట్లు మీడియా చెప్పింది.

డార్లింగ్ మంత్రి హైదరాబాదులో చేస్తున్న వ్యవహారాలపై తెలంగాణా ప్రభుత్వం చంద్రబాబుకు లేఖలో ఫిర్యాదుచేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణా ప్రభుత్వం లేఖ రాసిందంటే ఎవరు రాయాలి ? ఒక ముఖ్యమంత్రికి మరో ముఖ్యమంత్రే లేఖ రాస్తారు. కాబట్టి చంద్రబాబుకు రేవంత్ నుండే లేఖ వెళ్ళినట్లు సమాచారం. లేఖ రాయటమే కాకుండా ఫోన్ చేసి డార్లింగ్ మంత్రిపైన ఫిర్యాదు కూడా చేశారు. ఇంతకీ ఆ మంత్రి హైదరాబాదు(Hyderabad)లో ఏమి చేస్తున్నారు ? ఏమి చేస్తున్నారంటే వారంలో మూడురోజులు హైదరాబాదులోని ఒక ప్రముఖ హోటల్లో బసచేస్తున్నారు. వారంలో రెండురోజులు ఏపీలోని తన నియోజకవర్గంలో పర్యటిస్తారు. మరో రెండురోజులు అమరావతిలో ఉంటారు. మిగిలిన మూడురోజులు హైదరాబాదులోనే ఉంటారు. శుక్రవారం సాయంత్రానికి హైదరాబాదు చేరుకుని ఏపీలోని వ్యవహారాలను హైదరాబాదులోని హోటల్లో సెటిల్ చేసుకుంటారు. ఏపీలోని వ్యవహారాలను సెటిల్ చేసుకోవటంతో ఆగలేదు. పనిలోపనిగా తెలంగాణాలోని భూవ్యవహారాల సెటిల్మెంట్లలో కూడా బాగా బిజీగా ఉంటారు. తెలంగాణా భూసెటిల్మెంట్లలో జోక్యం చేసుకుని, పంచాయితీలు చేస్తుండటంతోనే విషయం బయటకుపొక్కి పోలీసులకు చేరింది.

ఇదే విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వపెద్దల దృష్టికి తీసుకెళ్ళగానే సదరు డార్టింగ్ మంత్రివ్యవహారాలపై నిఘాఅధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. దాంతో హోటల్ గదిలో సదరుమంత్రి చేస్తున్న సెటిల్మెంట్లన్నీ బయటకు వచ్చాయట. దాంతో అన్నీసాక్ష్యాలను సేకరించి నిఘా ఉన్నతాధికారులు రేవంత్ ముందుంచారు. సాక్ష్యాధారాలను పరిశీలించి, ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాతే చంద్రబాబుకు రేవంత్ లేఖ రాయటమే కాకుండా ఫోన్లో కూడా మాట్లాడి ఫిర్యాదుచేశారు. రేవంత్ ఫిర్యాదుకారణంగా మంత్రి వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. నిజానికి అసలీ ఎంఎల్ఏని మంత్రిగాతీసుకునేటప్పటికే చాలా ఫిర్యాదులున్నాయి. అన్ని ఫిర్యాదులున్నా మంత్రివర్గంలోకి తీసుకున్నారంటే అన్నీ తెలిసే చంద్రబాబు తీసుకున్నట్లు అర్ధమైపోతోంది. కాకపోతే డార్లింగ్ మంత్రి విషయంలో ఇపుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే తన సెటిల్మెంట్లను ఏపీకి మాత్రమే పరిమితంచేయకుండా తెలంగాణాకు కూడా విస్తరించటంతోనే. ఏపీ మంత్రి హైదరాబాదులో యధేచ్చగా సెటిల్మెంట్లు చేస్తుంటే తెలంగాణా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుకదా.

మంత్రిపైన వచ్చిన పిర్యాదుల ఆధారంగా డైరెక్టుగా తెలంగాణా ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవచ్చు. కాని తర్వాత పర్యవసానాలు రాజకీయంగా గోలగోలైపోతుంది. పైగా ఏపీ ప్రభుత్వాన్ని అవమానించినట్లవుతుంది. చంద్రబాబు, రేవంత్ అత్యంత సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే ఏపీమంత్రి తెలంగాణా భూముల సెటిల్మెంట్లు చేయకుండా కట్టడిచేయాలని లేఖలో చంద్రబాబును రేవంత్ కోరింది. ఒక వేళ సదరు మంత్రిని కట్టడిచేయటంలో చంద్రబాబు ఫెయిలైతే అప్పుడు తెలంగాణా ప్రభుత్వమే డైరెక్టుగా రంగంలోకి దిగచ్చు. అప్పుడు తెలంగాణా ప్రభుత్వంపై ఎలాంటి నెగిటివిటి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబుకు రేవంత్ ముందుజాగ్రత్తగా లేఖ రాసింది. లేఖను చూసిన తర్వాత చంద్రబాబు కూడా సదరు డార్లింగ్ మంత్రిపై పూర్తిస్ధాయి నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదికలో రేవంత్ రాసిన లేఖలోని అంశాలన్నీ నిజమే అని నిర్ధారణ అయ్యింది. మరిపుడు ఆ మంత్రిపైన చంద్రబాబు ఏమి యాక్షన్ తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ చంద్రబాబుకే తలనొప్పిగా తయారైన సదరు డార్లింగ్ మంత్రి ఎవరబ్బా ?

Tags:    

Similar News