‘బనకచర్లపై చర్చ అక్కర్లేదు’
గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.;
‘బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదు. అది అనుచితమైన అంశమే’ అంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వాటర్ వార్‌కు ముగింపు పలకాలన్న ఉద్దేశంతో కేంద్రం.. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు చంద్రబాబు, రేవంత్ రెడ్డికి లేఖలు కూడా రాసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని, అందులో వీరు పాల్గొని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని కోరింది. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణ మధ్య అతిపెద్ద నీటి సమస్యగా కొనసాగుతున్న బనకచర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రానికి లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఆంధ్రప్రదేశ్‌ను బనకచర్ల కట్టకుండా నిలువరించాలన్న తెలంగాణ నేతలు.. ఇప్పుడు అవకాశం లభిస్తే.. ఎందుకు దాన్ని చేజార్చుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి.
అయితే బనకచర్లపై సీఎంల భేటీలో చర్చించడం కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై అపనమ్మకం కలిగే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం తన లేఖ పేర్కొంది. ఈ లేఖలో కాంగ్రెస్ సర్కార్ అనేక అంశాలను ప్రస్తావించింది. బనకచర్లకు ఎటువంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొంది. అందువల్లే గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌పై చర్చించడం అనుచితమని తెలిపింది. వీటితో పాటుగా పలు ప్రతిపాదనలు కూడా చేసింది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణా నదిపై ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్‌లకు అనుమతులు, పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తమ అజెండ్లా పాయింట్లుగా పేర్కొంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదాలను పరిష్కరించడం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ బుధవారం (జులై 16) భేటీ నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు కూడా రాసింది. ఈ సమావేశం ఢిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుంది. ఇందులో బనకచర్ల అంశంతోపాటు రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర ఎజెండా పాయింట్లు ఏమైనాఉంటే వెంటనే పంపాలని జలశక్తిశాఖ కోరింది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 11న సమావేశం నిర్వహించాలని నిర్ణయించి ముఖ్యమంత్రుల సమయం కోరినా, సానుకూల స్పందన రాకపోవడంతో 16వ తేదీకి వాయిదావేశారు. ఈ తేదీన హాజరుకావడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించినట్లు తెలిసింది.
వివాదం కొలిక్కి వచ్చేనా..?
సీఎంల భేటీ ముందు రెండు రాష్ట్రాల అజెండాలను పరిశీలిస్తే ఆంధ్ర, తెలంగాణ మధ్య జల వివాదాలు కొలిక్కి వచ్చేలా లేవు. ఈ సమావేశంలో బనకచర్లపై చర్చజరగాలని.. ఏపీ సింగిల్ అజెండా ఇస్తే.. తెలంగాణ మాత్రం దానిపైనే చర్చ అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో రేపు జరిగే సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం కానీ, మంత్రి కానీ హాజరయ్యే అవకాశాలు అత్యల్పమని, ఏవరైనా అధికారి ఆ సమావేశంలో పాల్గొనవ వచ్చని విశ్లేషకులు అంటున్నారు. అసలు సమస్యగా ఉన్న బనకచర్లపై చర్చించడానికి సుముఖంగా లేని సమయంలో ఆ సమస్య ఎలా కొలిక్కి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. బనకచర్లపై చర్చించడానికి తెలంగాణ ఎందుకు విముఖత చూపుతుందో కనీసం రాష్ట్ర ప్రజలకయినా వివరించాలని వారు కోరుతున్నారు.