తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల నిరసనలతో ప్రభుత్వం దిగొచ్చింది.

Update: 2024-07-19 09:20 GMT

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. అభ్యర్థుల నిరసనలతో ప్రభుత్వం దిగొచ్చింది. ఆగస్ట్‌ 7, 8 తేదీల్లో జరగాల్సిన పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలని త్వరలోనే ప్రకటించనుంది. గ్రూప్‌ - 2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 5.51 లక్షల అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరుద్యోగులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పోస్టులు పెంచి, ఎగ్జామ్స్ వాయిదా వెయ్యాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నేడు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. అయితే పోస్టులు పెంచుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

చర్చలు సఫలమైనట్లేనా?

గత కొన్నిరోజులుగా తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. గ్రూప్స్, డీఎస్సీ పోస్టులు పెంచడంతోపాటు ప్రిపరేషన్ కి ఎక్కువ సమయం లేనందున వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని కోరుతున్నారు. ఇటీవల యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు. కాగా, నిన్న బేగంపేట టూరిజం ప్లాజాలో కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులతో భేటీ అయ్యారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, బల్మూర్ వెంకట్ వారితో చర్చలు జరిపారు.

భేటీ అనంతరం ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు చెప్పిన సమస్యలు విన్నాము.. వారి సమస్యలని పరిష్కరించే విధంగా సీఎం దృష్టికి తీసుకుని వెళ్తాము అన్నారు. నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తాము.. ముఖ్యంగా డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షకి మధ్య తక్కువ వ్యవధి ఉంది.. ఇది కూడా ఉదేశపూర్వకంగా ఇచ్చిన డేట్స్ కాదు. గతంలో డీఎస్సీ పరీక్షలు మే -జూన్ నెలలో ఉండే .. అయితే అ రోజు యువకులు మరొకసారి డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని కోరారు. నిరుద్యోగుల కోరిక మేరకే అ రోజు టెట్ నిర్వహించాము.. అయితే అప్పటికే టీజిపీఎస్సీ పరీక్షలకు డేట్స్ ఇవ్వడంతో డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయి. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి.. నేను ఎంపీ వారి సమస్యను విన్నాము సీఏం దృష్టికి తీసుకెళ్తామని చెప్పాము.. గ్రూప్ 2 పరీక్షల పై ఇక సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తాము. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంటాము.. ఈసారి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము" అని బల్మూర్ వెంకట్ హామీ ఇచ్చారు. అభ్యర్థుల డిమాండ్స్ పై సానుకూలంగా స్పందించిన సర్కార్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News