ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్..
మూడేళ్లకోసారి కూడా కాలేజీలను పరిశీలించి.. ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారా..?;
తెలంగాణలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని భావిస్తున్నాయి. అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సదరు విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. వారి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఇంజినీరింగ్ కాలేజీలకు బారీ షాక్ ఇచ్చింది. వారి పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. కళాశాలల ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై టీఏఎఫ్ఆర్‌సీ నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంలో కమిటీ ఆరువారాల్లో నిర్ణయం తీసుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. కాగా ఫీజుల పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అంతిమమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది కూడా ఫీజుల పెంపు అంశంపై ఏదో ఒక తంతు నడుస్తోందని అసహనం వ్యక్తం చేసింది.
ప్రతి సంవత్సరం ఇదే తంతా..?
ప్రతి ఏడాది కూడా ఫీజుల పెంపుకు కళాశాలలను ప్రతిపాదనలు చేయడం. కౌన్సిలింగ్ పూర్తయి అడ్మిషన్‌లు చేపట్టేదాకా ఈ విషయంపై టీఏఎఫ్‌ఆర్‌సీ ఎటువంటి సిఫార్సులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం పరిపాటి అయిపోయిందంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
మూడేళ్లకోసారి చేతకావట్లేదా..!
గత బ్లాక్ పీరియడ్ ఫీజులే 2025-2026 విద్యాసంవత్సరానికి కూడా వర్తిస్తాయాని పేర్కొంటూ విడుదల చేసిన జీవో26ను విడుదల చేశారు. కాగా ఈ జీవోను ఛాలెంజ్ చేస్తూగురునానక్, గోకరాజు రంగరాజు కాలేజీలతో పాటు మరో 11 కళాశాలలు గురువారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌లు దాఖలు చేశాయి. ఈ పటిషన్‌ను విచారించిన జస్టిస్ కే లక్ష్మన్ బెంచ్.. మూడు సంవత్సరాలకొకసారి కాలేజీలను పరిశీలించి ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదన్నారు. డిసెంబర్‌లో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు ఎందుకు టువంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ జాప్యానికి కారణమేంటని ప్రశ్నించారు. 15 మంది సభ్యులు ఉన్న కమిటీ ఏం చేసిందని, టీఏఎఫ్‌ఆర్‌సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని న్యాయస్థానం అడిగింది. అదే విధంగా కౌన్సిలిం్ పూర్తయిన తర్వాత కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేయడం ఏంటని కాలేజీలను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
నిర్ణయం అందుకే ఆలస్యం..
టీఏఎఫ్‌ఆర్‌సీ తరఫున సీనియర్ న్యాయవాది పీ శ్రీరఘురాం వాదనలు వినిపించారు. కాలేజీలు 5,000 పేజీలతో ప్రతిపాదనలు సమర్పించాయని, వీటిని పరిశీలించడానికి సమయం పడుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే గత బ్లాక్ పీరియడ్‌లో వసూలు చేసిన ఫీజులనే ఈ ఏడాదికీ సిఫారసు చేయడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం తరఫున రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కాలేజీల్లో కొన్ని గత ఏడాది కంటే సుమారు 70 నుంచి 90 శాతం పెంపు అడుగుతున్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే కళాశాలల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ గత డిసెంబరులో ప్రతిపాదనలు సమర్పించామని, మార్చిలో కమిటీ సమావేశమైందని, అందులో తమ ప్రతిపాదనలు ఆమోదించిందని, దీనికి రిజిస్టర్‌లో నమోదు చేసిన వివరాలే నిదర్శనమని అన్నారు.