తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

ఇక స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడదలే

Update: 2025-09-26 22:43 GMT

చాలా కాలంగా ఎదురుచూస్తున్న వెనకబడిన కులాలకు రిజర్వేషన్ల (BC Reservations)ను అమలులోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం GO MS  09 తెలుగు, ఇంగ్లీష్ లో విడుదల  చేసింది. చెన్నై లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ రాష్ట్రంలోరిజర్వేషన్లను 69 శాతానికి తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రకటించిన 24 గంటలలోపే ఉత్తర్వులు విడుదల అయ్యాయి.

డెడికేటెడ్‌ కమిషన్‌(Dedicated Commission)చేసిన సిఫార్సు మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేసి, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) ఇవ్వాలని ఇటీవల కేబినెట్​ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 30వ తేదీలోపు ఎన్నికలు జరగాలని హైకోర్టు గడువు సమీపిస్తున్నందున, రిజర్వేషన్లు అమలుచేయకుండా ఎన్నికలు జరపడానికి వీల్లేదని వెనకబడిన కులాల సంఘలుపట్టుపడుతున్నుందున 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది.



మంత్రి వాకిటి శ్రీహరి హర్షం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పై తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు.

“విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాల్లో వెనుకబడిన వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీబిడ్డ అని మరోసారి ఈ జీవో ద్వారా నిరూపించుకున్నారు. బీసీల రాజ్యాధికారానికి ఈ జీవో తొలి అడుగు,”అని వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు.

బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం దేశంలో ఎక్కడ చేయని విధంగా రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి,ప్లానింగ్ శాఖ ద్వారా శాస్త్రీయంగా కులగణన చేపట్టడం జరిగిందని, ఈ జీవో బీసీల పట్ల తమ సర్కారుకు,రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

విప్ ఆదిశ్రీనివాస్ కృతజ్ఞతలు

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ ధన్యవాదాలు తెలియజేశారు.

“బీసీల‌కు విద్యా, ఉద్యోగ‌, రాజ‌కీయాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తు అసెంబ్లీలో బిల్లును ఆమోదించి షెడ్యూల్ 9 లో చేర్చాలని కేంద్రానికి పంపినా ప‌ట్టించుకోలేదు. బిల్లు ఆమోదం కోసం జంత‌ర్ మంత‌ర్ లో ధ‌ర్నా చేశాము. 2018 పంచాయ‌తీరాజ్ చ‌ట్టాన్ని స‌వ‌రిస్తు చ‌ట్టం చేసినా గ‌వ‌ర్నర్ ఆమోదించ‌లేదు. అయినా సరే, బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని తమ ప్రభుత్వం జీవో జారీ చేసింది,” అని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

శనివారం కీలక సమావేశం

బీసి రిజర్వేషన్ల జీవో జారీచేయడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేపినట్లే. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్​ఈసీ) స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నది. కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు సంసిద్ధత తెలిపింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలను నిర్వహిస్తారు. అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు ఛైర్‌పర్సన్ల ఎలక్షన్లు నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది.


Tags:    

Similar News