సినిమా పాటల్లో అశ్లీల దృశ్యాలపై తెలంగాణ మహిళా కమిషన్ కన్నెర్ర

సినిమా పాటల్లో అశ్లీల దృశ్యాల చిత్రీకరణపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.పాటల్లో మహిళలను అశ్లీలంగా చూపిస్తున్నారని కమిషన్ హెచ్చరిక జారీ చేసింది.;

Update: 2025-03-21 04:06 GMT
సినిమా పాటలో అశ్లీల దృశ్యాలు

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి.దీంతో ఈ అంశంపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించేలా లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద చెప్పారు.


మహిళా కమిషన్ హెచ్చరిక
సినిమా పాటల్లో అశ్లీల స్టెప్పులు, దృశ్యాల నేపథ్యంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు,సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ సూచించింది. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని కమిషన్ కోరింది. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద చెప్పారు.

మహిళల గౌరవాన్ని కాపాడండి
సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించాలని, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత అని కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద చెప్పారు. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయాలని కోరారు. ఈ విషయం పై మహిళా కమిషన్ నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సినిమాల్లో అశ్లీల నృత్య దశలను కించపరిచేలా ఉండటంపై తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరిక జారీ చేసింది


Tags:    

Similar News