ఇండియా రావడానికి వెనకాడుతున్న తెలుగువాళ్లు!

అమెరికాలోని తెలుగు వాళ్లను వేధిస్తున్న సందేహాలివి. మరోపక్క, పెద్దఐటీ కంపెనీలు ఏవీ రిస్క్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాయి. దీంతో ముందుగా చేసుకున్న విమాన టికెట్లు రద్దవుతున్నాయి.;

By :  A.Amaraiah
Update: 2025-04-14 12:18 GMT
అమెరికాలో వలస విధానాలు ఎన్నికల రాజకీయాలకు సాధనంగా మారిపోతున్నాయి. ట్రంప్ పాలకవర్గం ప్రవేశపెట్టిన కఠినమైన వీసా నిబంధనలు, పౌరసత్వంపై మార్పుల ప్రతిపాదనలు ఎలాంటి సాంకేతిక ఆధారిత నిర్ణయాలు కావు. ఇవి “అమెరికన్ జాబ్-సెక్యూరిటీ” పేరిట వలసదారులపై చేస్తున్న యుద్ధం మాత్రమే.

ఎఫ్-1, హెచ్-1బీ వీసాల విషయంలో భారతీయులు మెజారిటీ. తెలుగు ప్రజల నైపుణ్యాలపై ఐటీ రంగం ఆధారపడుతున్నా రాజకీయ స్వార్థం కోసం వీరే లక్ష్యంగా మారుతున్నారు.
వలసదారులను “ఇతరులుగా” చిత్రీకరించి, దేశ భద్రత పేరుతో నిబంధనలు కఠినతరం చేయడం ఓ మౌలిక హక్కుల సమస్యగా మారుతోంది.వీసాల నిరాకరణలు, వీసా స్టాంపింగ్ ఆలస్యం, పౌరసత్వ అనిశ్చితి.. ఇవన్నీ మానసికంగా సతమతం చేసే అంశాలుగా తయారవుతున్నాయి. మనుషులు సమిధలుగా మారుతున్నారు.
సుధీర్ (పేరు మార్చాం) అమెరికా వెళ్లి 10 ఏళ్లు అయింది. ఎమ్మెస్సీ పూర్తి చేసి న్యూయార్క్ లో ఓ పేరున్న కంపెనీలో హెచ్ 1 బీ వీసా మీద చేస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కి రావడానికి టికెట్ బుక్ చేసుకున్నారు. మే 6న వచ్చి 3 వారాలుండి నెలాఖరుకి వెనక్కి వెళ్లాలనేది ప్లాన్. ఇంతలో ప్రముఖ ఐటీ సంస్థల హెచ్చరికలతో వెనక్కి తగ్గాడు. టికెట్ రద్దు చేసుకున్నాడు.
దశాబ్ద కాలం తర్వాత వయసు మీరిన తల్లిదండ్రులను చూసి పోవాలన్న కల నెరవేరలేదు. ఇండియా వచ్చిన తర్వాత తిరిగి పోయేటపుడు వీసా సమస్యలు రావొచ్చనే భయాందోళనతోనే తన ఇండియా పర్యటనను రద్దు చేసుకున్నాడు...
వీసా భద్రతపై పెరిగిన అనిశ్చితి...
మేఘన (పేరు మార్చాం), నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థిని, చికాగోలో ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల కిందట అమెరికా వెళ్లింది. సోదరుని పెళ్లికి రావాలన్న ఆమె నిర్ణయాన్ని కూడా వీసా భద్రతపై ఉన్న అనుమానాలు బలవంతంగా మార్చేశాయి. స్నేహితుల సూచనతో టికెట్లు రద్దు చేసుకున్నారు.
రమేష్-సునీత దంపతులు, అమెరికాలోనే ఐటీ ఉద్యోగులు. స్వగ్రామం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఢిల్లీ ఎంబసీలో వారికి షాక్ తగిలింది. వీసాలు చెల్లుబాటు కావని “Administrative Processing” అనే అస్పష్టమైన స్టేటస్ వచ్చింది. ఇప్పుడు వారి తిరుగు ప్రయాణం నీలాకాశంలో వేలాడుతోంది.
ఇమిగ్రేషన్ విధానాల్లో ఉత్కంఠ..
కోవిడ్ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. 2023-24 నాటికి అమెరికాలోని 3,31,602 మంది భారతీయ విద్యార్థుల్లో సగం కన్నా ఎక్కువ మంది తెలుగువారే. దాదాపు 1.6 లక్షల మంది. వీరిలో ఎక్కువమంది STEM కోర్సులను ఎంచుకున్నవారే.
అయితే, F1 వీసా గడువు ముగిసే దశలో ఉన్న ఈ విద్యార్థులకు ఇప్పుడు ఇండియా వెళ్లడమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. కొత్త వీసా స్టాంపింగ్, OPT సమస్యలు, SEVIS స్టేటస్‌లను ఖచ్చితంగా పాటించాల్సిన ఒత్తిడి విద్యార్థులను మానసికంగా తొలిచేస్తోంది.
రాహుల్ (పేరు మార్చాం) అనే విద్యార్థి మాస్టర్స్ పూర్తయ్యాక CPT ట్రైనింగ్ సమయంలో ఇండియా వచ్చి, తిరిగి వెళ్లే ప్రయత్నంలో న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ లోనే ఆగిపోవాల్సివచ్చింది. వీసా రిజెక్ట్ అయింది. ఇలాంటివి తక్కువ సంఖ్యలో లేవు. వందల్లో ఈ తరహా ఘటనలు నమోదవుతున్నాయి.
గందరగోళం మధ్య బతుకు పోరాటం
రమ్య (పేరు మార్చాం) టెక్సాస్‌లో ఉన్న ఒక IT ఉద్యోగిని. హెచ్-1బీ వీసా గడువు ముగియబోతుండటంతో ఆమెకు వీసా పొడిగింపుకు ఇండియాకి రావాల్సిన అవసరం. కానీ, తిరిగి వెళ్లే అవకాశం లేకపోతుందన్న భయం ఆమె టూర్‌ను నిలిపేసింది. కుటుంబం, ఉద్యోగ భద్రత అనే రెండింటి మధ్య ఆమె జీవితం ఊగిసలాడుతోంది.

ఇలాంటి అనిశ్చితిని ప్రముఖ కంపెనీల హెచ్చరికలు మరింత పెంచుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు తమ హెచ్-1బీ ఉద్యోగులకు రహస్యంగా సూచిస్తున్న విషయమేమంటే...
“Don’t travel unless absolutely necessary.”
“Avoid visa stamping abroad.”
“There’s no clarity on approvals.”
అమెరికాలో పెరుగుతున్న అవిశ్వాసం..
విజయవాడకు చెందిన రమేష్ (పేరు మార్చాం) వర్జీనియాలో పనిచేస్తున్నారు. “ఇటీవలి కాలంలో రోడ్డుపై ఆపి డాక్యుమెంట్లు చూపించమంటున్నారు. వీసా, పాస్‌పోర్టు వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని డాక్యుమెంట్లు చూపినా అనుమానంగా చూస్తున్నారు,” అని ఫెడరల్ ప్రతినిధితో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితులు ఉద్యోగ భద్రతపైనా ప్రభావం చూపుతున్నాయి. వీసా రీ-స్టాంపింగ్ ఆలస్యం అవడం వల్ల కంపెనీకి రిపోర్ట్ చేయలేకపోవడం, రిమోట్ వర్క్ మంజూరు కాకపోవడం – ఇవి ఉద్యోగి ఉద్యోగం కోల్పోయే పరిస్థితికి దారితీస్తున్నాయి.
Google, Amazon, Microsoft హెచ్చరికలు ఎందుకు?
ప్రముఖ కంపెనీలు Google, Amazon, Microsoft తమ హెచ్-1బీ ఉద్యోగులకు రహస్యంగా కొన్ని సూచనలు పంపుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ 1 వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు దేశం విడిచి వెళ్లొద్దని, తిరిగి ప్రవేశించడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని US టెక్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అమెరికాలో H-1B వీసా పొందిన వారి మెజారిటీగా ఉన్న భారతీయ సాంకేతిక నిపుణులు ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వలస విధానాల నేపథ్యంలో అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఇద్దరు హెచ్-1బీ ఇమిగ్రెంట్స్ ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమి చెప్పారంటే–
“We cancelled our India trip because we’re unsure we’ll be let back in.”
“What if our child is born stateless? Neither Indian nor American?”
దీన్నిబట్టి అమెరికాలోని ఉద్యోగులు తమ స్వదేశానికి రావడానికి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది.
అందుకే వాయిదా వేసుకున్నా...
ఫలితంగానే "H-1B వీసా హోల్డర్లు కూడా తమ ఇండియా ట్రిప్‌ను రద్దు చేసుకుంటున్నా" అని టెక్సాస్ రాజధాని ఆస్టిల్ ఉంటున్న కరీంనగర్ జిల్లా వాసి రవీంద్ర (పేరు మార్చాం) తెలిపారు. తిరిగి అమెరికా వెళ్లే అవకాశం లేకపోతుందన్న భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జన్మ హక్కు పౌరసత్వంపై ట్రంప్ ప్రభుత్వం మార్పులు తేనుందన్న అనుమానంతో కూడా సొంతూళ్లకు రావడానికి జంకుతున్నారు.
వందలాది టికెట్లు రద్దు...
ఈ పరిస్థితుల కారణంగా ఒక్క టెక్సాస్ రాష్ట్రం నుంచే ఇండియాకి వివిధ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుక్ అయిన వందలాది ముందస్తు టికెట్లు రద్దు అవుతున్నట్టు పేరు రాయడానికి ఇష్టపడని ఓ ట్రావెల్ ఏజెంట్ చెప్పారు.
మరోపక్క ఈ అభద్రత అమెరికాలో ఉంటున్న వారిని ఎంతగా భయపెడుతుందో కాలిఫోర్నియాలో ఉంటున్న ఓ విద్యార్థి వివరించారు.
ఎందుకు భయపడుతున్నారంటే...
ట్రంప్ అధికారంలోకి వచ్చిన 5 నెలల కాలంలోనే వీసాల రద్దు రేటు పెరిగింది. H-1Bపై అమెరికా దేశాధ్యక్షుడు సానుకూలంగా మాట్లాడినప్పటికీ వలసలపై ప్రభుత్వ వైఖరి ఆందోళన కలిగిస్తోంది. స్కిల్డ్ వీసాల రద్దు రేటు 15% దాకా పెరిగింది. రాబోయే కాలంలో అది ఇంకా పెరగవచ్చునని ఇమిగ్రేషన్ లా కంపెనీలు కూడా హెచ్చరిస్తున్నాయి. అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వడంపై విచారణలు సాగుతున్నాయి. ఇది వలసదారుల్లో మరింత భయం రేకెత్తిస్తోంది.

ఇటీవల ప్రవేశపెట్టిన సరికొత్త బిల్లులతో USCIS అధికారులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా శోధిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని తిరిగి స్వదేశాలకు పంపిస్తున్నారు. విదేశాలకు వెళ్లిన తరువాత తిరిగి అమెరికా వచ్చేటప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించకపోవచ్చన్న భయం ఉద్యోగుల్లో ఉంది. దీంతో ఇండియాకి వెళ్లాలని విమాన టికెట్లు బుక్ చేసుకున్నవారిలో చాలా మంది వాటిని రద్దు చేసుకుంటున్నారు. దీనికి ట్విట్టర్, రెడ్డిట్, లింక్డిన్ వంటి సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది తెలుగు విద్యార్థులు షేర్ చేసుకుంటున్న తమ అనుభవాలే ఇందుకు సాక్ష్యం. "Don’t book your trip without checking with your immigration lawyer"
"My visa got stuck in admin processing. It’s been 4 months!"
ఉద్యోగ భద్రతపై ప్రభావం..
వీసా అనుమతులు ఆలస్యం అయితే కంపెనీకి రిపోర్ట్ చేయలేరు, రిమోట్‌గా కూడా పని చేయలేరు. ఈ పరిస్థితుల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించే అవకాశాలు కూడా పెరిగాయి.
ఒకసారి భారత్‌కి వెళ్లి తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడితే గ్రీన్ కార్డ్ ప్రక్రియ పూర్తిగా రద్దు కావొచ్చు అనే భయం కూడా వెంటాడుతోంది.
ఈ భయానికి ముగింపు ఎప్పుడు?
ఇది ఇంతటితో ఆగదు. పిల్లల పౌరసత్వ భద్రత, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ నిలిపివేస్తారనే బెరుకు, ఉద్యోగాలు పోతాయేమోననే భయం – ఇవన్నీ కలిపి తెలుగు విద్యార్థులు, ఉద్యోగుల మానసిక స్థితిని దెబ్బతీస్తాయి.
వీసా, ఇమ్మిగ్రేషన్, పౌరసత్వ వ్యవస్థల పట్ల నమ్మకం కోల్పోతున్న వలసదారుల్ని ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న వెంటాడుతోంది. "ఇండియాకు వెళితే... తిరిగి వస్తామా?" అనేదే ఆ ప్రశ్న. తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదిది. ఒక సమూహంగా, ప్రభుత్వాలుగా, మానవతా విలువల్లో భాగంగా – వీరి భద్రతపై సరైన చర్చ ఇప్పుడు అత్యవసరం.
వలసదారులు భయపడే పరిస్థితిని మామూలు సమస్యగా చూడకూడదు. విద్యార్థులు, ఉద్యోగులు మాత్రమే కాదు – ఈ శ్రేణిలో భవిష్యత్ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, సామాజిక మార్పును తీసుకొచ్చే నాయకులు ఉంటారు. వాళ్ల భద్రత, జీవిత గమ్యం రాజకీయ ప్రత్యుత్తరాలకు బలైపోకూడదు.
ఇది వీసాల కథ కాదు. ఇది కలల కథ. దాన్ని నిలబెట్టుకోవాలి అని అమెరికా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    

Similar News