అజహర్ కు మంత్రిపదవిపై ఉత్కంఠ..జరుగుతుందా ?
చీఫ్ ఎలక్టోరల్ ఆపీసర్ బీ సుదర్శనరెడ్డి అజహర్ మంత్రిగా ప్రమాణస్వీకారంచేయటంపై మార్గదర్శనం కోసం కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాశారు.
ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రిపదవి వ్యవహారంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు అజహర్ ను క్యాబినెట్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేశారు. అజహర్ తో ప్రమాణస్వీకారం చేయించటానికి రాజభవన్ లో గవర్నర్ కార్యాలయం అన్నీ ఏర్పాట్లుచేసింది. ఈ నేపధ్యంలో చీఫ్ ఎలక్టోరల్ ఆపీసర్ బీ సుదర్శనరెడ్డి అజహర్ మంత్రిగా ప్రమాణస్వీకారంచేయటంపై మార్గదర్శనం కోసం కేంద్ర ఎన్నికల కమీషనర్ కు లేఖ రాశారు.
అజహర్ కు మంత్రిపదవి విషయం బుధవారం నుండి విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే గురువారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమాణస్వీకారంపై అధికారికంగా ప్రకటించింది. దాంతో రాజ్ భవన్ లో ఏర్పాట్లు చకచకజరిగిపోయాయి. అయితే గురువారం సాయంత్రం అజహర్ ను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించటంపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కేంద్ర చీఫ్ కమీషనర్ కు లేఖరాశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతున్నపుడు అజహర్ తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించే విషయమై సరైన డైరెక్షన్ ఇవ్వాలని లేఖలో రిక్వెస్టు చేశారు. దాంతో కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ ఏ విధంగా స్పందిస్తారనే విషయమై కాంగ్రెస్ వర్గాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
గతంలో గోవాలో మనోహర్ పారికర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉపఎన్నిక సమయంలో మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నిస్తే కేంద్ర ఎన్నికల చీఫ్ కమీషనర్ జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని రద్దుచేయించారు. మరిక్కడ ఏమిచేస్తారో చూడాలి. ఉపఎన్నిక సమయంలో అజహర్ తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించటం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించటమే అని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల కమీషనర్ స్పందించారు.