రేవంత్ ప్రభుత్వంలో పెరిగిపోతున్న 42% టెన్షన్
మాధవరెడ్డి పిటీషన్ను పరిశీలించిన హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కేసును విచారించబోతోంది
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించటాన్ని వ్యతిరేకిస్తు దాఖలైన పిటీషన్ను హైకోర్టు(Telangana High court) విచారణకు స్వీకరించింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి ఈ కేసు దాఖలుచేశారు. మాధవరెడ్డి పిటీషన్ను పరిశీలించిన హైకోర్టు జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కేసును విచారించబోతోంది. మాధవరెడ్డి నాలుగురోజుల క్రితం పిటీషన్ వేస్తే దాన్ని కోర్టు కొట్టేసింది. ఎందుకంటే అప్పటికి రేవంత్(Revanth) ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC reservations) కల్పిస్తు జీవో జారీచేయలేదు.
ఊహాజనితంగా దాఖలుచేసే పిటీషన్లను విచారణకు స్వీకరించేదిలేదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయితే కేసును డిస్మిస్ చేసిన రెండురోజులతర్వాత అంటే శుక్రవారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు జారీచేస్తు ప్రత్యేకంగా జీవో జారీచేసింది. ప్రభుత్వం జీవో జారీచేయగానే శనివారం మాధవరెడ్డి రెండోసారి పిటీషన్ దాఖలుచేశారు. పిటీషన్ను పరిశీలించిన ద్విసభ్య ధర్మాసనం ఈసారి విచారణకు స్వీకరించింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించటం రాజ్యాంగవిరుద్ధమని పిటీషనర్ తన పిటీషన్లో ఆరోపించారు. మొత్తం రిజర్వేషన్లు 50శాతంకు మించకూడదని గతంలో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పును ఇఫుడు రేవంత్ సర్కార్ తుంగలోతొక్కిందని పిటీషనర్ ఆరోపించారు.
రేవంత్ సర్కార్ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని తీసుకున్న నిర్ణయం, జారీచేసిన జీవోకు చట్టబద్దత లేదని అందరికీ తెలుసు. సుప్రింకోర్టు తీర్పుకు విరుద్ధంగా రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, జారీచేసిన జీవో న్యాయసమీక్షకు నిలబడదని అందరికీ తెలుసు. నిర్ణయం తీసుకున్న రేవంత్ ప్రభుత్వానికి కూడా ఈ విషయం బాగా తెలుసు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయసమీక్షకు నిలబడదని తెలిసినా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఏమిచెబుతుందనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది.