ఐఏఎస్‌లకు సీఎస్ సీరియస్ వార్నింగ్..
అనుచితంగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు.;
తెలంగాణ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలని చెప్పారు. అలా కాకుండా అనుచితంగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. ఈ హెచ్చరిక చేయడానికి ఐఏఎస్ అధికారి ఏ.శరత్ చేసిన పనే కారణం. అచ్చంపేటలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఏ.శరత్.. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా చివరిలో సీఎం రేవంత్ వెళ్లడానికి సిద్ధమవుతున్న క్రమంలో ఐఎస్ అధికారి శరత్.. సీఎం రేవంత్ కాళ్లు మొక్కారు. దానిని సీఎం రేవంత్ పట్టించుకోలేదు. ఆయన వెళ్లే హడావుడిలో ఉండటమే అందుకు కారణం. అయితే శరత్ చేసిన ఈ పని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
గతంలో కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించడానికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చినప్పుడల్లా కొందరు అధికారులు ఇలానే ప్రవర్తించారు. దీంతో దీనిపై తాజాగా సీఎస్ రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు అనుచిత ప్రవర్తన మానాలని సూచించారు. ఈ మేరకు ఆల్ ఇందియా సర్వీస్ అధికారులకు కీలక సూచనలు జారీ చేసింది. ‘‘ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలి. ఏఐఎస్ అధికారులు ఉన్నత ప్రవర్తన పాటించాలి. అధికారుల ప్రవర్తనతో ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. 1968 ఎఐఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. అధికారి ఎల్లప్పుడు పరిపూర్ణ నిజాయితీతో ఉండాలి. ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదు. అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పవు. ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలి’’ అని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో కొంతమంది అఖిల భారత సర్వీసు అధికారులు సామూహిక సమావేశాలు, సభల్లో సర్వీసు హోదాకు తగనటువంటి చర్యలు, హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఇలాంటి ప్రవర్తన ప్రజల్లో ఆ సర్వీసు అధికారుల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. మరియు సేవ యొక్క మాన్యతను దెబ్బతీస్తుంది. అఖిల భారత సేవల ప్రవర్తనా నియమావళి, 1968 లోని నిబంధన 3(1) ప్రకారం: ప్రతీ సర్వీసులో సభ్యుడు ఎల్లప్పుడూ సంపూర్ణ నిజాయితీ, విధిపట్ల నిబద్ధత కలిగి ఉండాలి. సర్వీసులో ఉన్న అధికారికి తగని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అఖిల భారత సేవల అధికారులు, అధికారికంగా మరియు ప్రజలతో సంబంధాల విషయంలోనూ, అత్యున్నత స్థాయి నైపుణ్యం, నిజాయితీ, నిబద్ధతను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. ఇది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అవసరమైన చర్య. కాబట్టి, ఇకపై ఏ అఖిల భారత సర్వీసు అధికారులు అయినా, సామూహిక సమావేశాలు, సభల్లో తగనటువంటి విధంగా ప్రవర్తించడం, హావభావాలు ప్రదర్శించడం వంటి చర్యల నుంచి నుంచి దూరంగా ఉండాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించినచో ఆ అధికారి తగిన చర్యలకు భాద్యుడు అవుతాడు. సచివాలయం కేంద్రంగా పనిచేసే అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలు ఈ మేరకు చర్యలు తీసుకుని, తమ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల ఈ ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సర్క్యులర్ ను జారీచేసింది.