చిన్నారి మృతికేసు..సొంత పిన్నే...

కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హర్షిత మరణంకేసు ట్విస్టులు మీద ట్విస్టులు తిరుగుతున్నది;

Update: 2025-07-06 11:40 GMT
Harshita murder case

కోరుట్ల పట్టణం ఆదర్శనగర్ చిన్నారి హర్షిత మరణంకేసు ట్విస్టులు మీద ట్విస్టులు తిరుగుతున్నది. పాప మరణంలో సొంత పిన్ని పాత్రపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే హర్షిత శనివారం రాత్రినుండి కనబడటంలేదని పాప తల్లి నవీన పోలీసులకు ఫిర్యాదుచేసింది. తల్లి, దండ్రులతో పాటు పోలీసులు ఎంత వెతికినా ఎక్కడా కనబడలేదు. చివరకు తమింటికి దూరంగా ఉండే ఒక ఇంటి బాత్ రూములో ఒక చిన్నపాప విగతజీవిగా ఉందనే సమాచారం పోలీసులకు అందింది. దాంతో హర్షిత తల్లి, దండ్రులను తీసుకుని పోలీసులు సమాచారం అందిన ఇంటి బాత్ రూములో చూశారు. అక్కడే తాము వెతుకుతున్న హర్షిత నేలపైన విగతజీవిగా పడుంది.

మెడకోయటంతో చిన్నారి చనిపోయినట్లు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టమ్ జరిగితే కాని పూర్తి వివరాలు తెలియవు. చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ విషయం ఇలాగంటే శనివారం సాయంత్రం పాప స్కూలు నుండి వచ్చింది. సుమారు 5 గంటల ప్రాంతంలో తమ ఇంటికి సమీపంలోనే ‘పెద్దపులుల’ ఆట జరుగుతోందని తెలిసి చూసేందుకు కొంతమంది పిల్లలతో కలిసి వెళ్ళింది. కొంతసేపటి తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసింది. కాసేపు నానమ్మతో కబుర్లుచెప్పిన హర్షిత మళ్ళీ 7 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగిరాలేదు.

పాప కనిపించకపోవటంతో తల్లి నవీన అన్నీచోట్లా వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు గాలిస్తుండగానే వచ్చిన సమాచారంతో ఒక ఇంట్లోని బాత్ రూములో హర్షిత విగతజీవిగా కనిపించింది. మెడను కోసేసినట్లుగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పాప డెడ్ బాడీ దొరికిన ఇల్లు విజయ్ అనే వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా విజయ్ భార్య అతనికి దూరంగా ఉంటోంది. అందుకనే తన అన్నదమ్ముల పిల్లలతో కలిసి విజయ్ ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి వివరాలను సేకరించిన పోలీసులు విజయ్ తో ఫోన్లో మాట్లాడారు. తాను వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉన్నట్లు చెప్పాడు. విజయ్ ఎక్కడో ఉన్న నర్సంపేటలో ఉండగా పిల్ల శవం అతని అతని ఇంటి బాత్ రూములోకి ఎలా చేరిందన్న విషయం అర్ధంకావటంలేదు. ఇంట్లోని మిగిలిన వాళ్ళు కూడా తమ బాత్ రూములోకి పిల్ల డెడ్ బాడీ ఎలాగ వచ్చిందో తెలీదన్నారు.

ఇదే సమయంలో నవీన ఇంటి వివరాలను సేకరించినపుడు వాళ్ళింట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. పాప పిన్ని మమత పైన అనుమానాలు పెరుగుతున్నాయి. కుటుంబకలహాలే పాప హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడే రెండు ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. అవేమిటంటే మొదటిది చిన్నారి హత్యకు దారితీసిన కుటుంబకలహాలు ఏమిటి ? ఇందులో పాప పిన్ని మమత పాత్ర ఏమిటి. ఇక రెండో ప్రశ్న ఏమిటంటే విజయ్ ఇంటి బాత్ రూముకు పాప డెబ్ బాడీ ఎలా చేరింది ? అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News