లష్కర్ లో కిషన్ ను చుట్టుముట్టిన లోకల్ 'పాలెగాళ్లు'...

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్న సికిందరాబాద్ లో ఈ సారి లోక్ సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే, ఇక్కడ కిషన్ పై పోటీ పడుతున్న వాళ్లు పక్కాలోకల్స్.

Update: 2024-03-27 03:57 GMT
G. Kishan Reddy,Danam Nagender,T Padma Rao Goud

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డిపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (కాంగ్రెస్), టీ పద్మారావు (బీఆర్ఎస్) అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రితో సీనియర్ నేతలైన, ఒకప్పటి మిత్రులైన దానం నాగేందర్, టీ పద్మారావులు ఎన్నికల బరిలో దిగడంతో లష్కర్ బరిలో త్రిముఖ పోరు నెలకొంది. కమలం కంచుకోటగా పేరొందిన సికింద్రాబాద్ లో మళ్లీ కాషాయ జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటనలు సాగిస్తుండగా, ఈ సారి ఎలాగైనా లష్కర్ కోటను ‘హస్త’గతం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. దీనిలో భాగంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ కండువా కప్పి బరిలోకి దించింది. నియోజకవర్గంలో అయిదున్నర లక్షలకు పైగా ఉన్న ముస్లింమైనారిటీ ఓట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు పన్నుతోంది. మరో వైపు అయిదు అస్లెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల బలం ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుడు టీ పద్మారావును రంగంలోకి దించి ఓట్ల వేట సాగిస్తోంది. మొత్తంమీద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్న ఈ పార్లమెంట్ నియోజక వర్గం ‘కీ’లక నియోజకవర్గంగా మారింది. దీంతో ఈ లష్కర్ కోటలో ఎవరు పాగా వేస్తారు? సామాన్య ఓటర్ల మనోగతం ఏమిటి? అనే అంశాలపై ‘ఫెడరల్ తెలంగాణ’ సేకరించింది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.


‘‘ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీకే నా ఓటు...నీతి, నిజాయితీతో పనిచేసే మోదీ వల్ల దేశంలో అవినీతి, అక్రమాలు తగ్గాయి, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేశాడు...ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం పేరు ప్రతిష్ఠలు పెరిగాయి, అందుకే నా ఓటు మోదీకే’’ అని సికింద్రాబాద్ లోని మహంకాళీ ప్రాంతానికి చెందిన వాయిద్య పరికరాల షాపు యజమాని నందిగౌలి సంతోష్ కుమార్ చెప్పారు.

కాగా సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్టకు చెందిన షేక్ జాఫర్ అనే పండ్ల వ్యాపారి అభిప్రాయం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక దేశంలో మత కల్లోలాలు పెరగడం తప్ప ఏం చేశారని జాఫర్ ప్రశ్నించారు. మోదీ వచ్చాక సికింద్రాబాద్ నగరానికి ఏం చేశారని, అభివృద్ధి పనులు ఏవని, మతం పేరిట సమాజంలో కల్లోలం సృష్టించారని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నా ఓటు కాంగ్రెస్ పార్టీకే’’ అని జాఫర్ స్పష్టం చేశారు.

పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారి బొక్కసం నింపుకుంటారే తప్ప తమలాంటి మధ్యతరగతి వాళ్లకు ఒరిగేదేమి లేదని అందుకే తాను ఎవరికీ ఓటు వేయనని సనత్ నగర్ అసెంబ్లీ పరిధిలోని అంబేద్కర్ నగర్ ముురికివాడకు చెందిన ఆటోడ్రైవరు మలిన్ దే ప్రవీణ్ కుమార్ చెప్పారు. ‘‘నేను 30 ఏళ్ల నుంచి ఆటో నడుపుతున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి మా పొట్ట కొట్టింది, గతంలో మాకు మంచి కిరాయిలు దొరికేవి, మహిళలకు బస్సుల్లో ఉఛిత ప్రయాణం కల్పించడంతో మా ఆటోల్లో వచ్చే మహిళలు బస్సులు ఎక్కి పోతున్నారు, మేమెలా బతకాలి? ’’అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ‘‘బీజేపీ అభ్యర్థి లేదా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా మా ఆటోవాళ్లకు ఒరగేదేమి లేదు, అందుకే నేను ఎవరికీ ఓటు వేయను’’ అని ఆటోడ్రైవరు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని అయిపోయిందని కవాడిగూడ బస్తీకి చెందిన ఐస్ క్రీం పార్లర్ యజమాని శ్రీరాం చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో నిధులు లేక కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసే దాఖలాలు కనిపించడం లేదు, కేంద్రం నుంచి నిధులు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది...అందుకే నేను మోదీకే ఓటు వేస్తాను’’అని శ్రీరాం స్పష్టం చేశారు. ‘‘స్థానిక అభ్యర్థి అయిన కిషన్ రెడ్డిని చూడకుండా మోదీనే చూసే నేను బీజేపీకి ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నా’’అని శ్రీరాం వివరించారు.

గతంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారని, వారి వల్ల ఏమీ అభివృద్ధి జరగలేదని, అందుకే ఈ సారి ఎన్నికల్లో కొత్త అభ్యర్థికి ఓటు వేస్తానని అంబర్ పేట అసెంబ్లీ పరిధిలోని ఛేనంబర్ బస్తీకి చెందిన బ్యాంకు ఉద్యోగి ఎంగిల చైతన్య చెప్పారు. ‘‘అభివృద్ధి కోసం నేను కొత్త అభ్యర్థికి ఓటు వేస్తాను’’అని చైతన్య చెప్పారు.

గతంలో బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందినందున తన ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికే అని బోరబండ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని కొత్తపల్లి సరిత చెప్పారు. ‘‘ అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపర్చి,రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి, ఉచితంగా నల్లానీటి సౌకర్యం కల్పించారు, అందుకే అభ్యర్థి ఎవరైనా నేను బీఆర్ఎస్ పార్టీకే నా ఓటు’’ అని సరిత ప్రకటించారు.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి బుధవారం పర్యటించి సామాన్య ఓటర్ల అభిప్రాయాలను సేకరించారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారనే విషయంపై సేకరించిన అభిప్రాయాల్లో సామాన్య ఓటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు విభిన్నంగా, ఆసక్తికరంగా ఉన్నాయి.

లష్కర్ కోట ముఖచిత్రం
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి లష్కర్ అని కూడా పేరుంది. ఈ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గతంలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్, తెలంగాణ ప్రజాసమితి ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆ తర్వాత బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం 1957వసంవత్సరంలో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 18,93,647 మంది ఓటర్లు ఉన్నారు. 2019లో జి కిషన్ రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించి ఏకంగా కేంద్రమంత్రి అయ్యారు.

కమలం కంచుకోట
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కమలం పార్టీకి కంచుకోట. గత 2014,2019 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా బీజేపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి విజయబావుటా ఎగురవేశారు. 2014 వ సంవత్సరంలో బీజేపీకి చెందిన బండారు దత్తాత్రేయ ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు.అనంతరం కేంద్రంలో సహాయమంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం దత్తాత్రేయ గవర్నరుగా వెళ్లడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. దీంతో 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పక్షాన సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి జి కిషన్ రెడ్డి ఎంపీగా ఎన్నికై, ఏకంగా కేంద్రమంత్రి అయ్యారు. 1991వ సంవత్సరం వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ పార్లమంట్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. గతంలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ ప్రాభవం కొనసాగినా సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో ఆ పార్టీ ఎప్పుడూ విజయం సాధించలేదు.

అక్షరాస్యులు, అర్బన్ ఓటర్లే...
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అక్షరాస్యులే అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 73.34 శాతం మంది అక్షరాస్యులు. పూర్తి నగర ప్రాంతం కావడంతో ఈ నియోజకవర్గంలో అర్బన్ ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో ఎస్సీ ఓటర్లు 8.2 శాతం,ఎస్టీ ఓటర్లు 1.4 శాతం ఉన్నారు. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో మొత్తం అర్బన్ ఓటర్లు ఉండటంతో ఈ సారి ఎన్నికల్లో వారి తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ముస్లిం, మైనారిటీ ఓట్లపైనే కాంగ్రెస్ ఆశలు
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు 27.4 శాతం మంది ఉన్నారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ ఓట్లపై ఆశలు పెట్టుకుంది. బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డి హిందూ ఓట్లపై గురి పెట్టారు. అయిదున్నర లక్షలమందికి పైగా ముస్లిం ఓటర్లు, క్రిస్టియన్ ఓటర్లు 0.3శాతం ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జెబాబాగ్, సీతారాంబాగ్, ఆసిఫ్ నగర్, మాణికేశ్వరీనగర్,హుమాయున్ నగర్, విజయనగర్ కాలనీ, బౌద్ధనగర్, మైలారగడ్డ, ఆజాద్ చంద్రశేఖర్ నగర్, లాలాపేట, చిలకలగూడ, అడ్డగుట్ట, సీతాఫల్ మండీ, న్యూ అశోక్ నగర్, ఏసీగార్డ్స్, ఉప్పర్ బస్తీ, పార్శీగుట్ట, వెంకటేశ్వర టెంపుల్ లైన్, మెట్టుగూడ, రెడ్ హిల్స్, లాలాగూడ, కిషన్ నగర్, శాంతినగర్, శ్రీనివాసనగర్, అహ్మద్ నగర్, అఫ్జల్ సాగర్, మల్లేపల్లి ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉన్నారు.

బీఆర్ఎస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేల బలం
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. ముఠా గోపాల్ (ముషీరాబాద్), కాలేరు వెంకటేష్ (అంబర్ పేట), మాగంటి గోపినాథ్ (జూబ్లీహిల్స్), తలసాని శ్రీనివాసయాదవ్(సనత్ నగర్), టీ పద్మారావు (సికింద్రాబాద్) ల బలం ఉన్నా పార్లమెంట్ ఎన్నికల్లో వీరి ప్రభావం ఏమేర ఉంటుందో ఓటర్ల తీర్పు కోసం వేచి చూడాల్సిందే. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మజ్లిస్ ఎమ్మెల్యే ముహమ్మద్ మాజిద్ హుసేన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి మజ్లిస్ బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవతో మజ్లిస్ ఓటుబ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది.

అసెంబ్లీలో బీఆర్ఎస్, పార్లమెంట్ లో బీజేపీ...లష్కర్ ఓటర్ల విలక్షణ తీర్పు
గత సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతం బీజేపీ అభ్యర్థికే ఎక్కువగా వచ్చాయి. 2014వ సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధికంగా 43.7 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 18.3 శాతం ఓట్లతో రెండో స్థానానికే పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీకి కేవలం 14.3 శాతం ఓట్లే వచ్చాయి. 2019వ సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీజేపీకి అత్యధికంగా 42.5 శాతం ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 35.6 శాతం ఓట్లతో రెండోస్థానానికే పరిమితమైంది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 43.8శాతం ఓట్లు లభించి అగ్రస్థానంలో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతంతో విజయం సాధించినా,2023వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కేవలం 20.4శాతం ఓట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. అంటే అసెంబ్లీకి బీఆర్ఎస్, పార్లమెంటుకు బీజేపీకి ఓటర్లు పట్టం కడుతూ విలక్షణ తీర్పు చెప్పారు. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఫలితం వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 44.5 శాతం ఓట్లు రాగా బీజేపీకి 17.8 శాతం ఓట్లతో మూడోస్థానంలో నిలిచింది. అంటే అసెంబ్లీకి బీజేపీ తిరస్కరించి బీఆర్ఎస్ కు పట్టం కట్టిన ఓటర్లు పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీకి జై కొట్టారు.
కీలక నియోజకవర్గమైన లష్కర్ కోటలో నెలకొన్న త్రిముఖ పోరు ఆసక్తికరంగా ఉంది. ఈ ఎన్నికల్లో లష్కర్ కోటలో ఎవరు పాగా వేస్తారు అనేది ఓటర్ల తీర్పు కోసం జూన్ 4వతేదీ వరకు వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News