ఎన్ కౌంటర్లో మావోయిస్టు మాస్టర్ మైండ్ నంబాల కేశవరావు మృతి

ఇంతకీ ఎవరీ నంబాల కేశవరావు.;

Update: 2025-05-21 08:47 GMT
Maoist top leader Nambala Kesava Rao

బుధవారం తెల్లవారి ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ అడవులు అబూజ్ మడ్ లో మొదలైన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు కోలుకోలేని అతిపెద్ద దెబ్బ తిగిలింది. ఎలాగంటే మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజ్ మరణించాడు. ఎదురుకాల్పుల్లో చనిపోయిన నంబాల నేపధ్యం చాలా పెద్దదనే చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట గ్రామంలో పుట్టాడు. స్కూలు, కాలేజీ శ్రీకాకుళంలోని చదివిన నంబాల ఇంజనీరింగ్ చదివేందుకు వరంగల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. 1974లో బీటెక్ తో పాటు ఎంటెక్ కూడా ఆర్ఈసీలోనే చదివాడు. ఎంటెక్ చదువుతున్నపుడు పీపుల్స్ వార్ గ్రూప్(పీడబ్ల్యూజీ) సిద్ధాంతాలకు ఆకర్షితుడై వెంటనే అందులో చేరాడు.

పీడబ్ల్యూజీ సభ్యుడిగా అనేక చోట్ల పనిచేసిన నంబాల 1990లో మిలిటరీ కమిషన్ సభ్యుడయ్యాడు. మిలిటరీ కమిషన్ సభ్యుడిగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పనిచేశాడు. టార్గెట్లపై దాడులుచేయటం, చంపేందుకు వ్యూహాలు రచించటంలో దిట్టగా పేరు రావటంతో మావోయిస్టు పార్టీలో కీలకవ్యక్తిగా ఎదిగాడు. దేశంలోని అనేకమంది ప్రముఖులు, పోలీసు బృందాలపై దాడుల్లో కీలకపాత్రపోషించాడు. 2003లో అలిపిరి దగ్గర చంద్రబాబునాయుడు(Chndrababu Naidu) ప్రయాణిస్తున్న కారును క్లెమోర్ మైన్ బాంబులతో పేల్చటంలో నంబాలే కీలక వ్యక్తి. అలాగే 76 మంది ఛత్తీస్ ఘడ్ సీఆర్ఫీఎఫ్ జవాన్లు చనిపోవటంలో కూడా నంబాలే మాస్టర్ మైండ్. 2010, ఏప్రిల్ లో దంతెవాడ(DanteWada CRPF killings) అడవుల్లో వెళుతున్న 85 మంది సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లపై చింతల్నార్ గ్రామం సమీపంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులతో దాడిచేశారు.

ఊహించనిరీతిలో జరిగిన కాల్పుల్లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. భద్రతాదళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. ఈదాడి జరిగింది నంబాల నేతృత్వంలోనే. అలాగే 2018లో విశాఖపట్నం జిల్లా అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎంఎల్ఏ సివేరి సోమాను ప్రజాకోర్టులో విచారించి చంపటంలో కూడా నంబాలే కీలకపాత్రదారి. 2018లో మావోయిస్టు కేంద్రకమిటి ప్రధాన కార్యదర్శిగా గణపతి తప్పుకున్నప్పటి నుండి నంబాలే ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇదేసమయంలో మావోయిస్టు మిలిటరీ కమిషన్ లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్(ఐఈడీ)తయారీ, పేలుళ్ళతో పాటు బాంబుల తయారీ, పేలేళ్ళతో పాటు అందులో అనేకమందికి నంబాల శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఛత్తీస్ ఘడ్ లోని మంత్రి మహేంద్రకర్మ(Minister Mahendra Karma) తో పాటు మరో ఇద్దరు మంత్రలను కాల్చిచంపటంలో కూడా నంబాలే కీలకపాత్రదారిగా పోలీసులు గుర్తించారు. అందుకనే మావోయిస్టు టాప్ లీడరైన నంబాలపై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) కోటిన్నర రివార్డును ప్రకటించింది.

దశాబ్దాలుగా అనేకమంది మంత్రులు, ప్రముఖులను మావోయిస్టులు కాల్చిచంపటంతో పాటు మరెన్నో దాడులు చేయటం వెనుక నంబాల వ్యూహాలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతటి కీలకవ్యక్తి బుధవారం తెల్లవారి జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోవటం మావోయిస్టు నాయకత్వానికి అతిపెద్ద దెబ్బనే చెప్పాలి. ఒకవైపు వందల సంఖ్యలో మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో చనిపోతున్నారు. ఇంకోవైపు ప్రాణభయంతో వందలసంఖ్యలో మవోయిస్టులకు పోలీసులకు లొంగిపోతున్నారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో తీవ్రగాయాలతో కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారు. కొత్త రిక్రూట్మెంట్ లేక, ఉన్న వాళ్ళు చనిపోతు, లొంగిపోతున్న కారణంగా మవోయిస్టులు అత్యంత బలహీనమైపోతున్నారు. ఈ సమయంలో కేంద్రకమిటి ప్రధానకార్యదర్శి నంబాల చనిపోవటం తీరని నష్టమనే చెప్పాలి.

Tags:    

Similar News