ఈ మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కు మెమోరీ లాస్ అయినట్లుంది
డీజీపీ సూచనల ప్రకారం అప్పట్లోనే పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ప్రవీణ్ ఫిర్యాదు చేశారు.;
ఇపుడంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేతగా ఉన్నారు కాని ఒకపుడు గురుకులాల సంక్షేమాన్ని పర్యవేక్షించిన అధికారి. అంతకుముందు ఐపీఎస్ హోదాలో ఎస్పీగా, ఓఎస్డీగా పనిచేశారు. ఐపీఎస్ అధికారిగా ఉంటూనే కేసీఆర్ ను రిక్వెస్టు చేసుకుని గురుకుల స్కూళ్ళ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి బీఎస్పీ(BSP) రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఎన్నికల్లో సిర్పూర్ నుండి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన దగ్గర నుండి కేసీఆర్(KCR) మీద చాలా ఆరోపణలు చేశారు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే తన మొబైల్ ఫోన్ ను కేసీఆర్ ప్రభుత్వం హ్యాక్ చేసి ట్యాపింగ్ చేయిస్తోందని.
ఆరోపణలతో ఆగకుండా కేంద్రఎన్నికలకమీషన్ కు, డీజీపీకి కూడా ఫిర్యాదుచేశారు. తన ఫోన్ ట్యాప్(Telephone Tapping) అవుతోందనేందుకు తన అనుమానాలు, తనదగ్గర ఉన్న ఆధారాలను కూడా ఎన్నికల కమీషన్ తో పాటు డీజీపీకి అందించారు. డీజీపీ సూచనల ప్రకారం అప్పట్లోనే పంజాగుట్ట పోలీసుస్టేషన్లో ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసి రిపోర్టుపంపమని డీజీపీని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశించింది. అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. రేవంత్(Revanth) సీఎంగా బాధ్యతలు తీసుకోగానే టెలిఫోన్ ట్యాపింగ్ పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను నియమించారు. సిట్ కు టెలిఫోన్ ఆపరేటర్ల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ట్యాపింగ్ విచారణ జోరందుకుంది.
సీన్ కట్ చేస్తే తాజాగా సిట్ విచారణకు హాజరైన ప్రవీణ్ అసలు కేసీఆర్ హయాంలో టెలిఫోన్ ట్యాపింగే జరగలేదన్నారు. ప్రవీణ్ చెప్పింది విన్నవాళ్ళకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. ట్యాపింగ్ జరిగిందని తాను ఎవరిపైనా ఫిర్యాదులు చేయలేదని అన్నారు. మరి అప్పట్లో ట్యాపింగ్ జరిగిందని ఎన్నికల కమీషన్, డీజీపీ, పంజగుట్ట పోలీసుస్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుగురించి అడిగితే మౌనమే సమాధానం అయ్యింది. ఇపుడు బీఆర్ఎస్ నేతగా ఉన్నారు కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని విచారణలో అంగీకరిస్తే కేసీఆర్ తుగులుకుంటారన్న విషయం ఐపీఎస్ ప్రవీణ్ కు తెలీకుండానే ఉంటుందా. అందుకనే చిలకపలుకుల్లాగ తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని మాత్రం పదేపదే చెబుతున్నారు. ఈమధ్య ఢిల్లీ(Delhi)లో రేవంత్ మీడియాతో మాట్లాడుతు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ మొదలుపెట్టిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అప్పుడు రేవంత్ చెప్పిందాన్ని ప్రవీణ్ ఏమీ ఖండించలేదు.
అప్పటికే విచారణకు హాజరవ్వాలని సిట్ అధికారుల నుండి రెండుసార్లు నోటీసులు అందినా ప్రవీణ్ రెస్పాండ్ కాలేదు. అయితే ఏమనుకున్నారో ఏమో మూడోసారి నోటీసుల అందిన తర్వాత విచారణకు హాజరయ్యారు. విచారణలో కేసీఆర్ తన ఫోన్ ట్యాప్ చేయించలేదని చెప్పిన ప్రవీణ్ ఉల్టాగా రేవంత్ ప్రభుత్వమే తన ఫోన్ను ట్యాప్ చేయిస్తోందని ఆరోపించారు. మంత్రులు, సెలబ్రిటీలు, బీఆర్ఎస్ నేతల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఇపుడు నానా గోలచేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రవీణ్ లో మెమోరీ లాస్ జబ్బేమన్నా ఉందా అనే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి.