తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఊబకాయుల సంఖ్య, ఆర్థిక సర్వేలో వెల్లడి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతోందని సోమవారం పార్లమెంటులో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన ఆర్థిక సర్వేలో వెల్లడించారు.
By : Saleem Shaik
Update: 2024-07-22 13:35 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒబేసిటీ సమస్య పెరగటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో2023-24 వ సంవత్సరంలో ఊబకాయుల సంఖ్య పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సోమవారం వెల్లడించింది. తెలంగాణలోని పురుషుల్లో స్థూలకాయుల శాతం 24.2 శాతం నుంచి 32.3 శాతానికి పెరిగిందని తాజా సర్వే తెలిపింది. తెలంగాణ మహిళల్లో స్థూలకాయుల శాతం 28.6 శాతం నుంచి 30.1 శాతానికి పెరిగారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థూలకాయుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని ఆర్థిక సర్వే ఉటంకించింది. పురుషుల్లో 31.1 శాతం మంది, స్త్రీలలో 36.3 శాతం ఉందని వెల్లడైంది. జీవనశైలిలో మార్పుల వల్ల ఊబకాయుల సంఖ్య పెరుగుతుందని సర్వే వివరించింది.
వీకెండ్ కల్చర్ వల్లనే పెరిగిన ఒబేసిటీ : ఆర్థిక విశ్లేషకులు పాపారావు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ కల్చర్ వల్లనే ఊబకాయుల సంఖ్య పెరుగుతుందని ఆర్థిక విశ్లేషకులు పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఐటీ, బీపీఓ జాబ్ లు, వైట్ కాలర్ జాబుల వల్ల ఊబకాయం పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాల ప్యాకెట్ తెచ్చుకునేందుకు కూడా బైక్ పై వెళుతున్నారని ఆయన చెప్పారు. విదేశీయులు సైక్లింగ్ చేస్తుంటే మనం కార్లు, బైకులపై తిరుగుతున్నామని, మనకు నడక తగ్గిందని పాపారావు పేర్కొన్నారు.
వ్యాయామం తగ్గినందువల్లే ఒబేసిటీ సమస్య : డాక్టర్ రామమోహన్ రావు
నేడు పిల్లల నుంచి పెద్దల దాకా వ్యాయామం చేయడం తగ్గిందని, దీనివల్లనే ఊబకాయుల సంఖ్య పెరుగుతుందని హైదరాబాద్ నగరంలోని ఆశ్రిత హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామమోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వ్యాయామం తగ్గడంతోపాటు జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబేసిటీ సమస్య పెరుగుతుందని డాక్టర్ చెప్పారు.
ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల...
దేశంలో స్థూలకాయుల సంఖ్య పెరగడంపై తాజా ఆర్థిక సర్వేలో ఆందోళన వ్యక్తం అయింది. అధిక చక్కెర, కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తినడం వల్ల 54 శాతం మంది అనారోగ్యానికి గురవుతున్నారని సర్వేలో తేలింది. వ్యాయామం చేయడం తగ్గడంతోపాటు అధిక చక్కెర, కొవ్వు ఉన్న ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల దేశంలో ఊబకాయుల సంఖ్య పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికను ఆర్థిక సర్వే ఉటంకించింది.
ఒబేసిటీలో మూడో స్థానంలో భారత్
ప్రపంచ దేశాల్లో ఒబేసిటీలో భారతదేశం మూడో స్థానంలో ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ విడుదల చేసిన నివేదికను తేటతెల్లం చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఒబేసిటీలో ప్రపంచంలోనే వియత్నాం మొదటి స్థానంలో, నమీబియా రెండో స్థానంలో నిలచింది. స్థూలకాయం తీవ్ర సమస్యగా మారిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దల్లోనే ఒబేసిటీ సమస్య ఎక్కువగా ఉందని తేలింది.
నగరాల్లోనే స్థూలకాయుల సంఖ్య అధికం
దేశంలోని గ్రామాలతో పోలిస్తే నగర జనాభాలో ఎక్కువ మంది ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారని ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో 19.3 శాతం మంది ఊబకాయులు ఉండగా, నగరాల్లో వీరి శాతం 29.8కి పెరిగింది. 18 నుంచి 65 సంవత్సరాల వయసు కల పురుషుల్లో ఊబకాయుల శాతం 18.9 నుంచి 22.9 శాతానికి పెరిగింది. మహిళల్లోనూ ఊబకాయుల సంఖ్య 20.6 నుంచి 24 శాతానికి పెరిగిందని ఆర్థిక సర్వే లెక్కలే చెబుతున్నాయి.