గోషామహల్‌లో ఉపఎన్నిక రాదు..
తాను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకే నష్టమంటున్న రాజాసింగ్;
గోషామహల్‌లో ఉపఎన్నికపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాదని తేల్చి చెప్పారు. తనను ఇప్పటికి కూడా బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వేరే ఏ పార్టీలో ఇమడలేనని, ఏదైనా పార్టీలో తాను చేరినా ఆ పార్టీకి నష్టమేనని అన్నారు. బీజేపీలో తనకు మిత్రులు, శత్రువులు ఇద్దరూ ఉన్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోని వాళ్లే కొందరు తనపై ఢిల్లీకి ఫిర్యాదు చేశారని, సోషల్ మీడియా వేదికగా తాను లీకులు ఇస్తున్నానని ఫిర్యాదు చేశారని రాజాసింగ్ చెప్పారు. ఈ సందర్భంగానే తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. ఇప్పటికయినా.. రాజాసింగ్ రా.. అని బీజేపీ పిలిస్తే వెంటనే వెనక్కి వెళ్లి బీజేపీలో చేరిపోతానని ప్రకటించారు.
కొన్ని తప్పులు చేశాను..
‘‘నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు. కొన్ని తప్పులు జరిగాయి. సోషల్ మీడియా ఇంకొన్ని తప్పుడు ప్రచారాలు చేసింది. నాకు అమిత్ షా, ప్రధాని మోదీ ఫోన్ చేశారని ప్రచారం చేసింది సోషల్ మీడియానే. పార్టీలో మిత్రులు, శత్రువుల ఉంటారు. మీడియాకు రాజా సింగ్ లీకులు ఇస్తున్నారని కొందరు సొంత పార్టీ నేతలే నాపైన హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. నాపై ఫిర్యాదులను పెన్‌డ్రైవ్‌లో పంపారు. ఆ ఫిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతోనే హైకమాండ్ నా రాజీనామాను అంగీకరించింది’’ అని తెలిపారు.
పార్టీకి అన్ని విషయాలు చెప్తా..
‘‘గోషామహల్‌లో ఉపఎన్నిక రాదు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశా.. ఎమ్మెల్యే పదవికి కాదు. చాలా మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అక్కడ రాని ఉపఎన్నికల గోషామహల్‌లో ఎలా వస్తుంది. బీఆర్ఎస్ నేతలు పాత బట్టలను ఇస్త్రీ చేసుకుని వేసుకుని తిరుగుతున్నారు. పార్టీ పెద్దలు పిలిస్తే ఢిల్లీకి వెళ్లి మాట్లాడతా. అన్ని విషయాలు వివరిస్తా. చాలా మంది పార్టీని ఎందుకు విడిచి వెళ్లారు. ఇతర పార్టీల నుంచి కమలం పార్టీలో చేరిన వారు అవమానాలు ఎందుకు భరిస్తున్నారు. ఇలాంటివన్నీ చెప్తా. ఇవాళ కాకుండా రేపయినా నన్ను పిలుస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
నా వెనక ఎవరూ లేరు..
‘‘నేను బీజేపీ పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధిష్టానం నుంచి పిలుపు వస్తుందని భావిస్తున్నా. నేను వేరే పార్టీలో ఉండలేను. బీజేపీ అనేది నాకు ఒక పార్టీ కాదు. నా ఇల్లు. నా వెనక ఎవరూ లేరు. గతంలో 14 నెలలు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాను. పార్టీలో నా శత్రువులు ఉన్నారు. ఇతర పార్టీల్లో కూడా ఉన్నారు. నేను ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీకి నష్టమే. నియోజకవర్గం, ప్రజలు.. ఈ రెండే నా ముందున్న అంశాలు. నాలాంటి వాళ్లు వస్తారు పోతారు.. బీజేపీ మాత్రం అలానే ఉండాలి. తెలంగాణలో ఉన్న కొందరికి ఇవాళో రేపో బుద్ధి వచ్చితీరుతుంది. అతి త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది’’ అని అన్నారు రాజాసింగ్.