వేములవాడ సాక్షిగా చెన్నమనేని సాగదీసిన కథ ఇది
ఎంఎల్ఏగా ఆయన అనర్హుడు అని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చేసిన న్యాయపోరాటంతో రమేష్ ఇంకా పాపులరైపోయాడు;
చెన్నమనేని రమేష్..తెలంగాణ రాజకీయాల్లో ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ప్రముఖ వామపక్ష నేత చెన్నమనేని రాజేశ్వరరావు కొడుకు. అలాగే రాజేశ్వరరావు తమ్ముడు, బీజేపీ ప్రముఖ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావుకు కొడుకు వరసవుతాడు. అంతేకాకుండా నాలుగుసార్లు వేములవాడ(Vemulawada Assembly segment) అసెంబ్లీ నుండి వరుసగా గెలిచిన ఎంఎల్ఏగా గుర్తింపున్నది. అయితే ఎంఎల్ఏగా గెలిచినప్పటికన్నా ఎంఎల్ఏగా ఆయన అనర్హుడు అని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ చేసిన న్యాయపోరాటంతో రమేష్ ఇంకా పాపులరైపోయాడు. ఇపుడు విషయం ఏమిటంటే రమేష్ భారత పౌరుడు కాదని కోర్టు తేల్చటమే కాకుండా వేములవాడ కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆదికి రు. 25 లక్షలు ఇప్పించింది. అంతడబ్బు ఎందుకు ఇప్పించిందంటే రమేష్(Chennamaneni Ramesh) కు భారత పౌరసత్వంలేదని, ఆయన జర్మనీ పౌరుడ(Germany Citizen)ని ఆరోపణలు చేయటమే కాకుండా అందుకు సాక్ష్యాలను కూడా చూపించి న్యాయపోరాటం చేసినందుకు అయిన ఖర్చులన్నింటినీ ఆదికి రమేష్ తోనే కోర్టు ఇప్పించింది.
ఇక్కడ విషయంఏమిటంటే రమేష్ కు భారతీయ పౌరసత్వంలేదన్న విషయం చాలాసంవత్సరాల క్రితమే తేలిపోయింది. అయినా కాని ‘వేలికేస్తే కాలికి..కాలికేస్తే వేలికి’ అనే నానుడిని చాలామంది వినే ఉంటారు. అదేపద్దతిలో హైకోర్టులో ఓడిపోతే సుప్రింకోర్టుకు..సుప్రింకోర్టులో ఓడిపోతే మళ్ళీ సుప్రింకోర్టులోని మరో బెంచుకు ఇలా రమేష్ తన వివాదాన్ని ఎటూ తేలనీయకుండా 15 ఏళ్ళపాటు సాగదీశారు. సింపుల్ గా తేలిపోయే కేసును కూడా 15 ఏళ్ళు లాగారంటే రమేష్ లాయర్ ఎంతటి గట్టోడో అర్ధమవుతోంది. భారత పౌరసత్వంలేని వాళ్ళు మనదేశం ఎన్నికల్లో పోటీచేయకూడదన్నది సింపుల్ నియమం. అయితే ఆ నియమాన్ని అడ్డదారిలో రమేష్ ఉల్లంఘించటమే కాకుండా నాలుగుసార్లు వేములవాడ నియోజకవర్గంలో గెలవటమే ఆశ్చర్యం.
ఈ వివాదం ఏమిటో తెలుసుకోవాంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. 1956, ఫిబ్రవరి 3వ తేదీన జన్మించిన చెన్నమనేని రమేష్ జర్మనీకి ఉన్నతచదువుల కోసం 1980ల్లో వెళ్ళాడు. జర్మనీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. తర్వాత బెర్లిన్ హాంబోల్డ్ యూనివర్సిటిలో 1987లో పీహెచ్డీ కూడా చేశారు. 1993లో జర్మన్ పౌరసత్వాన్ని పొందాడు. ఆ తర్వాత మరియా అనే జర్మనీ పౌరురాలిని వివాహం కూడా చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంటే రమేష్ జర్మనీ పౌరుడిగా అక్కడే సెటిల్ అయిపోయారని అర్ధమవుతోంది. తర్వాతెప్పుడో ఇండియాకు వచ్చినపుడు ఇక్కడ పౌరసత్వాన్ని వదులుకుని ఇండియన్ పాస్ పోర్టును సరెండర్ చేశాడు. అయితే 2008లో మళ్ళీ ఇండియాకు వచ్చి తనకు ఇండియన్ పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. తెరవెనుక ఏమి జరిగిందో తెలీదుకాని రమేష్ కు ఇండియన్ పౌరసత్వం వచ్చేసింది.
వెంటనే అంటే 2009లో టీడీపీ(TDP)లో చేరాడు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు. వైఎస్సార్ మరణించగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దాంతో రమేష్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి అప్పటి టీఆర్ఎస్(TRS) లో చేరాడు. 2010లో జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచాడు. ఆ తర్వాత 2014, 2018లో కూడా బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచాడు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ చేతిలో రమేష్ ఓడిపోయారు. 2009లోనే రమేష్ పై ఆది శ్రీనివాస్ కేంద్రహోంశాఖకు ఫిర్యాదుచేశారు. రమేష్ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వాన్ని పొందారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనఫిర్యాదుకు ఆది తగిన ఆధారాలను కూడా అందించారు. వివాదం విషయంలో కేంద్ర హోంశాఖ నోటీసులు జారీచేయగా రమేష్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి విచారణపై స్టే తెచ్చుకున్నాడు.
కోర్టు స్టే కారణంగా 2010 ఉపఎన్నికలోను తర్వాత 2014 ఎన్నికల్లో కూడా పోటీచేసి గెలిచాడు. రమేష్ పౌరసత్వంపై విచారణ చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ ప్రకటించింది. హోంశాఖ ఏర్పాటుచేసిన నిపుణుల కమిటి అందుబాటులో ఉన్న అన్నీ డాక్యుమెంట్లను పరిశీలించి ఇండియన్ పౌరసత్వాన్ని రమేష్ అక్రమపద్దతిలో పొందినట్లు 2017, మార్చి 10వ తేదీన తేల్చేసింది. అంటే ఆది ఫిర్యాదు నిజమే అని తేల్చేసింది. మామూలుగా అయితే ఇంకెవరైనా కేంద్రప్రభుత్వాన్ని మోసంచేశారని తేలితే వెంటనే కేసుపెట్టి జైల్లోకి తోస్తారు. కాని రమేష్ కు అలా జరగలేదు. కేంద్రహోంశాఖ రిపోర్టు ఆధారంగా రమేష్ పౌరసత్వం చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. అంతేకాకుండా రమేష్ పౌరసత్వంపై పోరాడిన ఆదికి కోర్టు ఖర్చుల కింద 25 లక్షలు, లీగల్ సర్వీసెస్ అథారిటికి మరో రు. 5 లక్షలు చెల్లించాలని తీర్పులో చెప్పింది. అయితే హైకోర్టు తీర్పును రమేష్ సుప్రింకోర్టులో చాలెంజ్ చేశారు.
అప్పటినుండి హైకోర్టు నుండి సుప్రింకోర్టుకు, సుప్రింకోర్టులో ఓడిపోయిన బెంచ్ నుండి మరో బెంచ్ కు ఇలా సంవత్సరాల తరబడి రమేష్ లాయర్ వివాదాన్ని నడిపాడు. ఇలా రకరకాల బెంచ్ ల చుట్టూ తిరిగిన కేసు మళ్ళీ హైకోర్టుకే చేరింది. విచారణల మీద విచారణలు జరిగిన తర్వాత చివరకు హైకోర్టు రమేష్ భారత పౌరుడు కాదని మరోసారి తీర్పిచ్చింది. చివరకు అన్నీ కోర్టులూ అయిపోయిన తర్వాత ఇక వెళ్ళటానికి కోర్టులేవీ లేకపోవటంతో వేరేదారిలేక రమేష్ తీర్పుకు తలొంచాడు. గతంలోనే హైకోర్టు ఆదేశించినట్లుగా మంగళవారం ఆది శ్రీనివాస్ కు రు. 25 లక్షల చెక్కును, లీగల్ సర్వీసెస్ అథారిటికి రు. 5 లక్షల చెక్కును అందించాడు. అంటే సింపుల్ గా తేలిపోవాల్సిన కేసును రమేష్ గట్టి లాయర్ ను పెట్టుకుని 15 ఏళ్ళు సాగదీశాడు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు ఖర్చులను కూడా చెల్లించేశాడు కాబట్టి వివాదం ఇక్కడితో సుఖాంతం అయిపోయిందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
తప్పుడు పత్రాలతో భారతీయ పౌరసత్వం పొందాడని రమేష్ మీద ఆది శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈనెల 17వ తేదీనే సీఐడీ రమేష్ మీద కేసు నమోదుచేసినా విషయం మాత్రం ఇపుడే బయటపడింది. సీఐడీ అధికారులు రమేష్ పై ఐపీసీ సెక్షన్లు 465, 468, 471లో పాటు ఇండియన్ పాస్ పోర్టు చట్టం 1967లోని సెక్షన్ 12, ది ఫారెనర్స్ యాక్ట్ 1946లోని సెక్షన్ 14, ది ఇండియన్ సిటిజన్ షిప్ యాక్ట్ 1955లోని సెక్షన్ 17 కింద కేసులు నమోదుచేసి నోటీసులు జారీచేశారు. బుధవారంలోగా తమ నోటీసులకు సమాధానాలు చెప్పాలని సీఐడీ నోటీసులో ఆదేశించింది. మరి ఈసారి రమేష్ ఏమిచేస్తారో చూడాల్సిందే.