ఫోన్లో విజయశాంతికి బెదిరింపులు

ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం పరిచయం అయిన ఒక వ్యక్తినుండి ఇపుడు విజయశాంతి దంపతులకు ఫోన్లో బెదిరింపు మెసేజులు వస్తున్నాయి;

Update: 2025-04-12 08:02 GMT
Vijayasanthi

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ ఎంఎల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. ఎప్పుడో నాలుగేళ్ళ క్రితం పరిచయం అయిన ఒక వ్యక్తినుండి ఇపుడు విజయశాంతి దంపతులకు ఫోన్లో బెదిరింపు మెసేజులు వస్తున్నాయి. ఈ మేరకు ఎంఎల్సీ భర్త శ్రీనివాసప్రసాద్ ఫిర్యాదుచేయగా బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) కేసు నమోదుచేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే 4 ఏళ్ళ క్రితం చంద్రకిరణ్రెడ్డి అనే వ్యక్తి విజయశాంతిని కలిసాడు. సోషల్ మీడియాలో నటికి అనుకూలంగా కంటెంట్ క్రియేటర్ గా పనిచేస్తానని ప్రతిపాదించాడు. విజయశాంతి(Vijayasanthi) అంగీకరించటంతో సదరు చంద్రకిరణ్ సోషల్ మీడియాను హ్యాండిల్ చేసేవాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే సినీనటి బీజేపీ(BJP)లో ఉన్నపుడు.

తనకోసం చంద్రకిరణ్ పనిచేస్తు వ్యక్తిగతంగా తన వ్యాపారాన్ని పెంచుకున్నట్లు సినీనటి ఇపుడు ఆరోపిస్తున్నారు. తన సొంతలాభాల కోసం తమపేర్లను వాడుకున్నట్లు విజయశాంతి మండిపడుతున్నారు. చంద్రకిరణ్ పనితీరు నచ్చకపోవటంతో అతని సేవలను ఉపయోగించుకోవటం నిలిపేసినట్లు చెప్పారు. బీజేపీలో నుండి తాను బయటకు వచ్చేసిన తర్వాత ఒకరోజు చంద్రకిరణ్ దగ్గర నుండి మెసేజ్ వచ్చిందట. ఏమనంటే పెండింగులో ఉన్న పేమెంట్ చేయాలని. సోషల్ మీడియా హ్యాండ్లర్ కు తాము ఏమీ బకాయిలు లేమని చెప్పిన సినీనటి అదే విషయాన్ని రిప్లై ఇచ్చినట్లు చెప్పారు.

ఇంతకాలం ఏమీ మాట్లాడని చంద్రకిరణ్ నుండి ఈనెల 6వ తేదీన బెదిరిస్తు మెసేజ్ వచ్చిందన్నారు. తనబకాయిలు తీర్చకపోతే మీరు శత్రువులు అవుతారని మెసేజ్ లో ఉందట. అలాగే ఆమోదయోగ్యంకాని రీతిలో మరికొన్ని సందేశాలు కూడా ఉన్నట్లు శ్రీనివాసప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను బెదిరిస్తున్న చంద్రకిరణ్ పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని శ్రీనివాస్ కోరిక మేరకు పోలీసులు సదరు వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Tags:    

Similar News