మంచిర్యాల జిల్లా జన్నారంలో మళ్లీ పులి కలకలం

సింగరాయపేట దొంగపెళ్లి రహదారి గట్టుపై కూర్చుని గాండ్రిస్తున్న పులి;

Update: 2025-09-12 07:33 GMT

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సింగరాయపేట-దొంగపెళ్లి రహదారిపై శుక్రవారం ఉదయం పులి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. రోడ్డు వెంట గట్టుపై తాపీగా కూర్చొని గాండ్రించడంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పులి సంచారం వార్త జన్నారంలో గుప్పు మనడంతో స్కూళ్లు, కాలేజిలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.పులిసంచారం గురించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.

విద్యార్ధులను బయట తిరగనీయకూడదని పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు సూచించాయి. మరోవైపు రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పులి సంచరిస్తున్న క్రమంలో ప్రజలు ఒంటరిగా బయట వెళ్లకూడదని, పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు గుంపులుగా వెళ్లాలని ఆటవీశాఖాధికారులు సూచించారు. పులి సంచారం గూర్చి డప్పు వేయించారు.రాత్రి వేళ ఒంటరిగా బయటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లనుంచి  బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు.

అడవులను నరికి వేయడం వల్లే..

మంచిర్యాల జిల్లా జన్నారంలో పులి సంచారం ఆ ప్రాంతవాసులను భయపెడుతోంది.

జన్నారం పరిసర ప్రాంతాల్లో పులి సంచారం వార్తతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంట్లోనుంచి ప్రజలు బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. జన్నారంలో పెద్దపులి వార్త దావానలంలా వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అడవులు నరికి వేస్తుండటంతో ఇటీవల తరచూ పెద్దపులులు, చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పశువుల పాకాల్లో కట్టేసిన మూగజీవాలు తెల్లారి లేచి చూసే సరికి మాయమవుతున్నాయి. మూగజీవాలను పులులు బలితీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మనుషులపై కూడా ఎగబడుతున్నాయి. ఏక్షణంలో ఎవరిపై పులి దాడి చేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కెమికల్‌ ఏరియా, కాల్‌టెక్స్‌ ప్రాంతాల్లో గతంలో కూడా పెద్దపులి సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News