నిమజ్జనం సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తులు;
గణేష్ నిమజ్జనం సందర్బంగా హైద్రాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం వినాయకచవితి నేపథ్యంలో మూడో రోజు నుంచి నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిమజ్జనం సందర్బంగా హుస్సేన్ సాగర్ కు వచ్చే ప్రతిమలు క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ ఐదు వరకు ఈ ఆంక్షలు అమల్లోకి ఉంటాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్దరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు కోలా హలంగా జరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద విగ్రహాలలో ఒకటైన ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇక్కడ 69 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉండటంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
జంటనగరాల్లో 78 కృత్రిమనిమజ్జన కేంద్రాలను జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.మూడు ఫీట్ల విగ్రహాలను మాత్రమే ఈ నిమజ్జన కేంద్రాల్లో నిమజ్జనం చేసుకోవచ్చు. ప్రతీ నిమజ్జన కేంద్రం వద్ద ఓ ఇన్ చార్జి అధికారిని నియమించారు.