రాజీపడని నిష్కళంక నాయకుడు జైపాల్ రెడ్డి

నేడు జైపాల్ రెడ్డి 83వ జయంతి;

Update: 2025-01-16 02:39 GMT

-నందిరాజు రాధాకృష్ణ


ఐదు పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా, నాలుగు పర్యాయాలు శాసన సభ్యునిగా ఎన్నికైన ఘనుడు. వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణం, మాట్లాడే విధానం ప్రశంశనీయం. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీపడని నిష్కళంక నాయకుడిగా, వాగ్ధాటి, ముక్కుసూటితనానికి పేరుగాంచిన నాయకుడు జైపాల్ రెడ్డి. రాజకీయ ప్రయాణంలో విలువల విషయంలో ఎన్నడూ రాజీపడలేదు. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్‌లో ప్రజల ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తారు, 'ఉత్తమ పార్లమెంటేరియన్‌'గా గౌరవం గుర్తింపు పొందారు. విద్యార్థి దశ నుంచి జైపాల్‌రెడ్డి అవినీతిని ఎప్పుడూ ప్రోత్సహించలేదు,

తెలంగాణ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి ఒక శిఖరం. తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు భారత రాజకీయాల్లో అధ్యయనం, అవగాహన, వాక్పటిమల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త సూదిని జైపాల్ రెడ్డి. గాంధేయవాద పరంపరకు, సోషలిస్ట్ భావజాలానికి ఆయన దాదాపు చివరి ప్రతినిధి అనుకోవచ్చు. ఎమర్జెన్సీ ప్రకటనపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఎదిరించడానికి కూడా వెనుకాడలేదు. పోలియో కారణంగా జైపాల్ రెడ్డి పరిమిత శారీరక చలనశీలత ఆయన రాజకీయ ఎత్తులను సాధించడానికి అవరోధం కాలేకపోయింది.

1942 జనవరి 16న తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల్‌లో సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జన్మించిన జైపాల్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగించిన జైపాల్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లీష్‌ పట్టా తీసుకున్నారు. ఉస్మానియాలో విద్యార్ధి నాయకుడు. విద్యార్థి నాయకుడిగా ఉండగానే జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. జయపాల్ రెడ్డికి ప్రముఖ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు, చక్రవర్తుల రాఘవాచారి అత్యంత సన్నిహితులు

ఆయన తెలుగు, ఆంగ్ల భాషల్లో ఆయనుకున్న ప్రావీణ్యం అమోఘమైంది. అసాధారణమైన ఉపన్యాస నైపుణ్యం, ఉచ్చారణ ఆయన్ను యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాలకు, కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా చేసింది. సామాన్య ప్రజల కోసం చేసిన పోరాటంలో స్థిరంగా ఉన్నారు.. కొన్ని దశాబ్దాలు పార్లమెంటేరియన్‌గా ఉన్న జైపాల్ రెడ్డి వివిధ ప్రభుత్వాల్లో కీలక శాఖలను నిర్వహించారు. 1998లో ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. యునైటెడ్ ఫ్రంట్ కామన్ మినిమం ప్రోగ్రామ్‌ ఆయనే రూపొందించారు. భారతదేశ ప్రాధాన్యాల గురించిన ఆయన అవగాహన ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆ డాక్యుమెంట్ ఒక్కటి చాలు.

ఎమర్జెన్సీ విధింపు తరువాత కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జనతా పార్టీలో చేరి 1980లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇందిరా గాంధీపై పోటీకి దిగారు. తరువాత జనతా చీలిక సమూహం జనతాదళ్‌లో చేరారు. ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గట్టిగా శ్రమించారు. 2010 తొలినాళ్లలో ప్రత్యేక తెలంగాణా పోరాటంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆయన మార్గదర్శక శక్తి.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యూపీఏ-2 ప్రభుత్వాన్ని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఆశ చూపినా తిరస్కరించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జైపాల్ రెడ్డి మంచి వక్త. అపారమైన మేధస్సుతో అందరినీ ఆకట్టుకునే విశ్లేషణలు ఆయన సొంతం. ఆయన రాజకీయ తత్వవేత్త లేదంటే తాత్విక రాజకీయవేత్త. వ్యక్తి కన్నా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాధాన్యతనిచ్చే వారు.

1969 నుండి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. 1984లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-96; 1997-98 రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1991-1992లో ఎగువసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. 1999లో తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2004లో మిర్యాలగూడ, 2009లో చేవెళ్ల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. జైపాల్ రెడ్డి 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి ఓడిపోయి 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు. అనారోగ్య కారణంగా 77వ ఏట జైపాల్ రెడ్డి హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స పొందుతూ 2019, జూలై 28న కన్నుమూశారు.

ఐ కె గుజ్రాల్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా; మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో వివిధ శాఖలను ఆయన నిర్వహించారు. యు పి ఎ-2లో, ఆయన పట్టణాభివృద్ధి మంత్రి బధ్యతలు నిర్వర్తించారు. . తరువాత పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ చేపట్టారు. తదనంతరం రాజకీయ తుఫాను సృష్టించిన్ కారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలకుబదలీ అయ్యారు. అతను "Ten Ideologies: The Great Asymmetry Between Agrarianism and Industrialism" తో సహా కొన్ని పుస్తకాలు రాసారు.

ఆయన కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించలేదు. కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ప్రోత్సహించక పోగా సోదరులు, కుమారులను రాజకీయాలకు దూరంగా ఉంచారు, ఎన్నికల సమయంలో ప్రచారానికి మాత్రమే వారి పాత్ర పరిమితమయ్యింది. క్రమశిక్షణ, నిబద్ధతతో ఉండేవారు. పార్లమెంటులో ఆయన ప్రసంగాలు గమనిస్తే, ఏ అంశాన్నీ, ఆరోపణలే ప్రధానంగా చేసుకుని మాట్లాడక ప్రతి సమస్యకు తాత్విక పునాదులను అర్థం చేసుకుని లోతైన అవగాహనతో మాట్లాడడం ఆయన నైజం. ఆయన స్వరం వినిపిస్తే పార్లమెంటు నిశ్శబ్దంగా చెవులు రిక్కించేంది. లౌకిక స్ఫూర్తికి ఆయన నిఖార్సయిన నిదర్శనం.

(నందిరాజు రాధాకృష్ణ, వెటరన్ జర్నలిస్ట్, హైదరాబాద్)

Tags:    

Similar News