పూణే యూనివర్శిటీ స్కాం కేసులో నిందితుడు అరెస్ట్
తెలంగాణకు చెందిన వ్యక్తి సూత్రధారి, పాత్రధారి అని తేల్చేసిన పోలీసులు
పూణెకు చెందిన ప్రయివేటు యూనివర్శిటీ నుంచి 2. 46 కోట్ల రూపాయలను కాజేసిన కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సైబర్ మోసం జులై 25 నుంచి ఆగస్టు ఏడు మధ్య జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం సావిత్రిభాయ్ ఫూలే పూణె యూనివర్శిటీకి చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌నంటూ పరిచయం చేసుకున్నాడు.కోట్లాదిరూపాయల విలువ చేసే ప్రాజెక్టులను ఇస్తానని నమ్మబలికాడు. 28 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను ఇస్తానని దశలవారిగా అడ్వాన్స్ తీసుకున్నాడు. అలా చెప్పి తొలుత 56 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న సదరు వ్యక్తి ప్రాజెక్టుల పేరుతో 2.46 కోట్ల రూపాయలను కాజేసాడు. ప్రాజెక్టులు ఇవ్వకుండానే మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో పూణె యూనివర్శిటీ అధికారులకు అనుమానమొచ్చింది. ప్రాజెక్టు పేరు చెప్పి కోట్లాదిరూపాయలు వసూలు చేసిన సదరు వ్యక్తి యూనివర్శిటీకి రాకుండానే యుపిఐ చెల్లింపులు, బ్యాంకులకు నగదు బదిలీ చేయించుకోవడం గమనార్హం. యూనివర్శిటీ అధికారులు ఐఐటి ప్రొఫెసర్ ను సంప్రదిస్తే తాను ఏ ప్రాజెక్టులతో ఒప్పందం చేయలేదని స్పష్టం చేయడంతో యూనివర్శిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభిస్తే ఈ కేసులో తెలంగాణకు చెందిన సీతయ్య అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతను హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారమందడంతో మహరాష్ట్ర పోలీసులు సీతయ్య నివాసమున్న ఇంటికి వచ్చి అరెస్టు చేశారు. సీతయ్య ఎలక్ట్రానిక్ అండ్ టెలి కమ్యూనికేషన్ లో ఇంజినీర్ చదివాడు అని పోలీసులు తెలిపారు. యుకెకు చెందిన యూనివర్శిటీ నుంచి పిహెచ్ డి పట్టా తీసుకున్నట్లు సీతయ్యపోలీసులకు వెల్లడించాడు.
2019 20 మధ్య యూపీఎస్సీ ప్రిలిమ్స్ , మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైనట్లు కూడా సీతయ్య పోలీసులకు వెల్లడించాడు. సీతయ్య నుంచి మరింత సమాచారం కొరకు పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు.
కిలారు సీతయ్యకు నేరచరిత్ర
పోలీసుల దర్యాప్తులో కిలారు సీతయ్యకు నేర చరిత్ర ఉంది. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ లలో కోట్లాదిరూపాయల పెట్టుబడి పెట్టి నష్ట పోయాడు. ఆన్ లైన్ గేమ్స్, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఇలా అనేక చోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు.జల్సాలు చేశాడు. లింక్డ్ ఇన్, నౌకరీ డాట్ కామ్ ద్వారా ఉద్యోగాలిప్పాస్తనని నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టాడు. ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. గతంలో కిలారు సీతయ్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా పేరుతో సీతయ్య మోసాలకు పాల్పడేవాడని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మొత్తం అతనిపై 8 కేసులున్నాయి. ఇటీవల జైలు నుంచి విడుదలైన సీతయ్య పూణె యూనివర్శిటీ కుంభకోణం కేసులో అరెస్టయ్యాడు.