తానోటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అన్న సామెతకు సుల్తానాబాద్‌లోని ఘటన అద్దం పడుతోంది. భార్యభర్తల మధ్య గొడవను పరిష్కరిద్దాం అని వెళితే.. అది ఇద్దరి హత్యకు కారణమైంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సుగ్లాంపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్యభర్తల మధ్య భీకర గొడవ జరుగుతుందని తెలియడంతో ఇద్దరి తరపు వాళ్లు అక్కడకు వచ్చారు. ఇంతలో అక్కడకు వచ్చిన భార్య తరపు వారిపై భర్త తరుపు కుటుంబ సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా మరో ఇద్దరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గొడవను సర్దుమణిగించడంతో పాటు విచారణ చేపట్టారు.
పోలీసులు చెప్పినదాని ప్రకారం.. భార్యభర్తల మధ్య గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ ఊరి పెద్దలు పంచాయితీ పెట్టారు. ఆ పంచాయితీకు ఇరు కుటుంబాల వారు హాజరయ్యారు. కాగా అక్కడకు ఆయుధాలతో వచ్చిన భర్త కుటుంబీకులు భార్య కుటుంబీకులపై ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. వెంటనే అలెర్ట్ అయిన భార్య తరపు వారు కూడా ఎదురు దాడులకు దిగారు. ఈ ఘటనలో పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేష్, ఓదెలకు చెందిన మోటం మల్లేష్‌లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.