హైడ్రా విషయంలో రెండు కీలక నిర్ణయాలు ?

హైడ్రా జోరుకు ఎలాంటి విఘాతాలు తగలకుండా, ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రభుత్వం రెండు నిర్ణయాలను తీసుకోబోతోందని సమాచారం.

Update: 2024-09-25 04:31 GMT
Revanth on Hydra

హైడ్రా విషయంలో ప్రభుత్వం రెండు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోందని సమాచారం. కబ్జాఅయిన ప్రభుత్వ భూములను క్లియర్ చేయటంతో పాటు జలవనరుల ఆక్రమణలను తొలగించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటుచేసిందో హైడ్రా పనితీరు ఆదిశగానే స్పీడుగా వెళుతోంది. గడచిన రెండునెలల్లో సుమార 200 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. చెరువులు, కుంటలు, కాల్వల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), బఫర్ జోన్ లో నిర్మించిన అనేక అపార్టుమెంట్లు, విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూడా కూల్చేసి సదరు భూమిని స్వాదీనం చేసుకున్న హైడ్రా ఆ భూమిని తిరిగి ప్రభుత్వ శాఖలకు అప్పగించేసింది.

మంచి జోరుమీద ఆక్రమణలను కూల్చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా జోరుకు ఎలాంటి విఘాతాలు తగలకుండా, ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రభుత్వం రెండు నిర్ణయాలను తీసుకోబోతోందని సమాచారం. అవేమిటంటే భవిష్యత్తులో చేయబోయే ప్రతి నిర్మాణానికి హైడ్రా క్లియరెన్సు తప్పనిసరిగా చేయబోతోంది. కమర్షియల్ అయినా సొంతానికి కట్టుకుంటున్న నిర్మాణాల సొంతదారులు ముందుగా హైడ్రాకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పరిశీలించిన హైడ్రా సదరు యజమాని చేయబోయే నిర్మాణాలు చెరువులు, కుంటలు, కాల్వల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా అన్నది ముందు నిర్ధారిస్తారు. తర్వాత సదరు భూమి ప్రభుత్వందా లేకపోతే ప్రైవేటుదేనా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు. పై రెండు అంశాలను పరిశీలించిన తర్వాత దరఖాస్తు క్లియర్ గా ఉంటే వెంటనే నిరభ్యంతర పత్రాన్ని హైడ్రా జారీచేస్తుంది. ఒకవేళ ఏదైనా అభ్యంతరాలుంటే అదే విషయాన్ని చెప్పి దరఖాస్తును రెజెక్టు చేస్తుంది.

హైడ్రా క్లియరెన్సు ముందుగానే ఎందుకు తీసుకోవాలంటే నిర్మాణాలు అయిపోయిన తర్వాత ఫిర్యాదులు రావటం, హైడ్రా పరిశీలించటం, నిర్ధారణ చేసుకుని సదరు నిర్మాణాలు అక్రమనిర్మాణాలని కూల్చేయటం ఎందుకని ప్రభుత్వం ఆలోచించింది. నిర్మాణాలు పూర్తియిన తర్వాత పరిశీలించి కూల్చేసేబదులు, అసలు నిర్మాణాలు మొదలు కాకముందే పై అంశాలను పరిశీలించి అభ్యంతరం చెప్పటమో లేకపోతే క్లియరెన్సు ఇవ్వటమో చేస్తే సరిపోతుంది కదాని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రా యాక్షన్ పై ఇప్పటికే కొంతమంది కోర్టుల్లో కేసులు వేశారు. అందుకని హైడ్రాకంటు ప్రత్యేకంగా లీగల్ టీమును ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది.

ఇక రెండో పాయింట్ ఏమిటంటే హైడ్రా బ్యాంకర్లతో సమావేశం అవబోతోంది. అపార్టమెంట్లు, విల్లాలు, గ్రూప్ హౌసింగ్ ఏదైనా సరే బిల్డర్లు, రియల్టర్ల తమ బిజినెస్ కోసం కస్టమర్లకు బ్యాంకర్లు, ఆర్ధిక సంస్ధలతో టైఅప్ చేయిస్తున్నారు. కస్టమర్ల నుండి బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు తీసుకుని పరిశీలించాల్సిన డాక్యుమెంట్లను కూడా బిల్డర్లు, రియల్టర్లే బ్యాంకులు, ఆర్ధికసంస్ధలకు అందచేస్తున్నారు. దాంతో ఏమవుతోందంటే కస్టమర్లకు తొందరగా లోన్లు అందుతున్నాయి, బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు బిజినెస్ టార్గెట్లను రీచవుతున్నాయి. ఇప్పటివరకు ఉభయకుశలోపరిగా సాగిపోతున్న వ్యవహారాలకు హైడ్రా పెద్ద బ్రేకులు వేసింది. ఎలాగంటే ఇప్పటివరకు హైడ్రా కూల్చేసిన చాలా నిర్మాణాల్లో సొంతదారులు బ్యాంకులు, ఆర్ధికసంస్ధల్లో రుణాలు తీసుకుని ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది.

మల్లంపేటలోని కత్వా చెరువు, గుట్టలబేగంపేటలోని సున్నంచెరువు, అమీన్ పూర్ చెరువు, కూకట్ పల్లి నల్లచెరువు ప్రాంతాల్లో కూల్చేసిన అపార్టమెంట్లు, విల్లాల్లో చాలావరకు లోన్లు తీసుకుని కొనుగులో చేసినవే అన్న విషయం బయటపడింది. కూల్చేసిన భవనాలు, విల్లాలకు లోన్లు ఇచ్చిన బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ఏవన్న విషయాలను హైడ్రా పరిశీలిస్తోంది. తొందరలోనే బ్యాంకులు, ఆర్ధికసంస్ధలతో హైడ్రా సమావేశమయ్యే అవకాశముందని సమాచారం. ఇదే విషయమై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అదేమిటంటే ఇక నుండి బిల్డర్లు, రియల్టర్లకు బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు లోన్లు ఇచ్చేముందు హైడ్రాను సంప్రదించేట్లుగా ఆదేశాలు జారీ అవబోతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ తో పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించి చేసిన, చేయబోతున్న నిర్మాణాలకు బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు లోన్లు ఇవ్వకుండా కట్టడిచేయటమే ప్రభుత్వం, హైడ్రా ఉద్దేశ్యం.

Tags:    

Similar News