నెరవేరని ఎన్నికల వాగ్ధానం, తెలంగాణ చెరకు రైతులకు చేదు అనుభవం

తెలంగాణ చెరకు రైతుల ఆశలు అడియాశలయ్యాయి. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించక పోవడంతో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుంది. చెరకు రైతులకు చేదు అనుభవం మిగిలింది.;

Update: 2025-05-22 13:12 GMT
నిజాంషుగర్ ఫ్యాక్టరీ : తెరచుకునేదెన్నడు?

తెలంగాణ రాష్ట్రంలోని నిజాం షుగర్స్ ఆధీనంలో బోధన్, ముత్యంపేట, లక్ష్మీపూర్ ఫ్యాక్టరీలను 2014వ సంవత్సరంలో మూతపడ్డాయి. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీంతో చెరకు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అధిక ఇన్‌పుట్ ఖర్చులు, కార్మికుల కొరత, నష్టాల వల్ల నిజాం షుగర్స్ మిల్లుల మూసివేశారు. దీని కారణంగా చెరకు సాగు విస్తీర్ణం తగ్గుదల ఏర్పడింది.తెలంగాణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (NSF)నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ (NCSF) పునరుద్ధరించే ప్రయత్నాలు ఇప్పటివరకు ముందుకు సాగలేదు.కాంగ్రెస్ నెరవేర్చని హామీతో చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కాలేదు. చెరకు కర్మాగారాల పునరుద్ధరణ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని చెరకు రైతుల సమాఖ్య అధ్యక్షులు చెన్నమనేని శ్రీనివాసరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని చెరకు రైతులు కోరుతుండగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం రంగం ఆధ్వర్యంలోనే ఫ్యాక్టరీలు ప్రారంభిస్తే నిధులు ఇస్తామని చెబుతుందన్నారు. చెరకు సాగు విస్తీర్ణం పెంచాలంటే ప్రభుత్వమే చెరకు ఫ్యాక్టరీలు ప్రారంభించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


తెలంగాణలో తగ్గిన చెరుకు సాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రంలో చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గుతుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు పండించిన చెరకును దూరంగా ఉన్న ప్రైవేటు చెరకు ఫ్యాక్టరీలకు తరలించాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకు రవాణ భారంతోపాటు చెరకు నరికేశాక ఫ్యాక్టరీకి తరలింపులో జరుగుతున్న జాప్యంతో ఎండిపోయి బరువు తగ్గుతుంది. దీనివల్ల చెరకు రైతులు నష్టపోతున్నారు. తెలంగాణలో చెరకు పంటనునిజామాబాద్,జగిత్యాల, వికారాబాద్, కరీంనగర్, ఖమ్మం,మహబూబ్ నగర్, వనపర్తి, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రైతులు సాగుచేస్తున్నారు. గతంలో 5 లక్షల ఎకరాల్లో పండించే చెరకు విస్తీర్ణం ఫ్యాక్టరీలు మూతపడటంతో 82వేల ఎకరాలకు తగ్గింది. చెరకు రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపుతున్నారు.

చెరకు రైతులు కష్టాలు
తెలంగాణలో చెరకు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిస్తే చెరకు సాగు ఎప్పటికైనా తిరిగి పుంజుకుంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుతుండటం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 2019వ సంవత్సరంలో ఐదు లక్షల ఎకరాల్లో సాగు చేసిన చెరకు ఇప్పుడు 82వేల ఎకరాలకు కుచించుకుపోయింది.చెరకు రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. తెలంగాణలోని ఈ ఏడాది మరో రెండు చక్కెర మిల్లులు క్రషింగ్ కార్యకలాపాలను నిలిపివేశాయి.కామారెడ్డిలోని గాయత్రి షుగర్స్, ఇందిరా షుగర్స్,మధుకాన్ షుగర్స్ వంటి కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కీలక మిల్లుల మూసివేత చెరకు రైతులను తీవ్రంగా ప్రభావితం చేసింది.చెరకు పంట కోత సమస్యలు, అధిక ఖర్చులు, కార్మికుల కొరత, ప్రభుత్వ మద్దతు లేకపోవడం వల్ల రైతులు చెరకు సాగును ఎక్కువగా వదిలివేశారు.

నెరవేరని కాంగ్రెస్ హామి
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెరకు సాగును పునరుద్ధరించడానికి ప్రతిష్ఠాత్మక ప్రణాళికను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూతపడిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామి ఇచ్చింది.రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, మైనంపల్లి రోహిత్,మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సభ్యులుగా కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేశారు. బ్యాంకులకు బకాయి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.160 కోట్లను కూడా చెల్లించింది.

తగ్గిన చక్కెర ఉత్పత్తి
తెలంగాణలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గడం, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలు మూతపడటం వల్ల చక్కెర ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. డిమాండుకు అనుగుణంగా చక్కెర ఉత్పత్తి చేయక పోవడంతో దీని ధరలు పెరిగే పరిస్థితి నెలకొంది. తెలంగాణ 2019వ సంవత్సరంలో 22.76 లక్షల టన్నుల చక్కెరను మాత్రమే ఉత్పత్తి చేశారు. 2024-25 సీజన్‌లో చక్కెర ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.

చెరకు పంటకూ బోనస్?
చెరకు సాగును ప్రోత్సహించేందుకు దీనికి బోనస్ ఇవ్వాలని కేన్ కమిషనరేట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. టన్ను చెరకుకు రూ.500చెల్లించాలని కేన్ కమిషనరేట్ ప్రతిపాదించింది. చెరకు రైతులకు బోనస్ మంజూరు పరిశీలనలో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.కానీ ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకునేందుకు బోనస్ ప్రకటిస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు.

ఎన్నికల నాటి హామి ఏమైంది?
ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారాలున్న నిజాం షుగర్స్ నష్టాలతోపాటు చెరకు ఉత్పత్తి తగ్గుదల కారణంగా 2014 వసంవత్సరంలో మూడు ఫ్యాక్టరీలను మూసివేసింది. 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణను చేర్చింది. చక్కెర కర్మాగారాలను తిరిగి తెరుస్తామని, చెరకు సాగును పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.బోధన్, ముత్యంపేట, లక్ష్మీపూర్ చక్కెర కర్మాగారాలను పునర్ ప్రారంభించి, చెరకు రైతులకు బోనస్ ఇవ్వాలని చెరకు రైతుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి మామిడి నారాయణ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ చెరకు రైతుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిపై తాము ఆందోళన చేస్తామని నారాయణ రెడ్డి హెచ్చరించారు.

బోధన్ చక్కెర కర్మాగారం తెరిపించేదెన్నడు? 
నిజాం షుగర్స్ ఆధీనంలోని బోధన్ చక్కెర కర్మాగారం పరిధిలో రెండువేల ఎకరాల భూమి ఉంది. ఈ ఫ్యాక్టరీ 2010వ సంవత్సురంలో మూతపడటంతో చక్కెర కర్మాగారంలోని యంత్రపరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. మరో వైపు ఈ ఫ్యాక్టరీ భూములు బోధన్ పట్టణ పరిధిలోకి వచ్చాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి.చెరకు రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కంటే భూముల రియల్ ఎస్టేట్ విలువపై ప్రజాప్రతినిధులు ఆసక్తి చూపిస్తున్నారు. బోధన్ ఫ్యాక్టరీని ప్రారంభించాలంటే కొత్త యంత్రపరికరాలు కొనాలి. మరో వైపు పట్టణ పరిధిలోకి ఫ్యాక్టరీ రావడంతో కాలుష్యం సమస్య ఏర్పడింది. మరో వైపు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలో కూడా యంత్రపరికరాలు తుప్పుపట్టాయి. ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలంటే కొత్త యంత్రాలు కొనాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చక్కెర కర్మాగారాలను తెరిపించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో చెరకు సాగు విస్తీర్ణం క్రషింగ్ సీజనుకు మరింత తగ్గిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.


Tags:    

Similar News