తెలంగాణ మెుక్కజొన్న రైతుకు అమెరికా దెబ్బ

జులై 9 తారీఖున దేశవ్యాప్త సమ్మెకు రైతు సంఘాల మద్దతు;

Update: 2025-07-04 03:52 GMT
ప్రెస్ మీట్ లో SKM నాయకులు కిరణ్ విస్సా, వడ్డే శోభనాద్రీశ్వర రావు, టీ. సాగర్, పశ్య పద్మ

భారత్-అమెరికా మధ్యన జరుగుతున్న వాణిజ్య చర్చలు రైతాంగానికి నష్టదాయకమా అంటే అవును అనే అంటున్నాయి రైతాంగ కార్మిక సంఘాలు. ఈ చర్చలుసాగుతున్న రీతిలోనే అనంతరం ఒప్పందం కుదిరితే తెలంగాణ లో ని మొక్కజొన్న, పాడి రైతులకు తీవ్రంగా నష్టపోతారు అని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అమెరికాను మచ్చిక చేసుకునేందుకు భారత  ప్రభుత్వం అమెరికా వ్యవసాయ దిగుమతుల మీద సుంకాలను ఎత్తివేసే ఆలోచినలో ఉన్నట్లు నీతి ఆయోగ్ నుంచి సూచనలు వస్తున్నాయి. అదే జరిగితే, మన దేశంలో మొక్కజొన్న, సోయా, గోధుమ, వరి పంటలు పండించే రైతులకు, పాడి మీద ఆధారపడే కోట్లాది చిన్న సన్నకారు రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాపితంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. 

తెలంగాణ లో విస్తారంగా పండే పంటల్లో ధాన్యం, పత్తి తో పాటు మొక్కజొన్న కూడా ప్రధాన పంట. రాష్ట్రం లో మొక్క జొన్న సాధారణ విస్తీర్ణం 5,21,206 ఎకరాలు కాగా ఈ ఏడు యిప్పటికే 2,47,934 ఎకరాల లో పంట సాగు అయ్యింది. మునుపటి ఏడు యిదే సమయానికి ఈ పంట 1,81,224 ఎకరాల లో వేశారు. మొత్తంగా పంట సాధరణ విస్తీర్ణంలో 47.57 శాతం యిప్పటికే వేశారు.అందువల్ల భారత్ అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే తెలంగాణ రైతులు ముఖ్యంగా మొక్కజొన్న , పాడి పరిశ్రమ రైతులు తీవ్రంగా నష్టపోతారు.

ఈ మేరకు దేనిపై తమ నిరసన తెలియపర్చటానికి  సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యం లో జులై 9 తారీఖున దేశవ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చాయి.

ఈ విషయం పైన హైదరాబాద్ లో జూలై త్రీన నిర్వహించిన సమావేశం లో SKM నాయకులు వడ్డే శోభనాదరీశ్వరరావు మాట్లాడుతూ, “రైతులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నట్లు కనీస మద్దతు ధర (MSP) కి చట్టబద్ధత కల్పించకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించకుండా, ఇప్పుడు NPFAM (జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం) లో మద్దతు ధర ఊసే లేకుండా చేసి, ధరల స్థిరీకరణ నిధిని అటక ఎక్కించి మోడి ప్రభుత్వం రైతుల పంటలకు న్యాయమైన ధరలు కల్పించకపోగా ఆదానీ వంటి కార్పొరేట్ల చేతిలో భారత వ్యవసాయాన్ని కట్టబెట్టుతున్నది. అంతే గాక భారత రైతుల పంట రుణాల బకాయిలను ఒక్క పర్యాయం రద్దు చేసి రైతులు అప్పుల ఊబిలో పడకుండా నివారించే “రైతు ఋణ విమోచన చట్టం” చేయాలని దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నా వినిపించుకోక పోగా, కార్పొరేట్లకు 10 ఏండ్లలో రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసి, గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులకు విఘాతం కలిగిస్తూ చట్ట సవరణలు చేయటమే కాక, ‘ఆపరేషన్ కగార్’ పేరుతో వందలాది ఆదివాసీలను చంపివేస్తూ అటవీ సంపదను ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెడుతూ, సుదీర్ఘకాలంగా ఐక్య పోరాటాలతో కార్మిక వర్గం సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తెచ్చి కార్మిక హక్కులను, ప్రయోజనాలను పారిశ్రామిక వేత్తలకు పణంగా పెట్టింది,” అని ఆరోపించారు.

అమెరికా తొమ్మిది సంవత్సరాల మునుపే WTO లో భారత్ ఎక్కువ సబ్సిడీ లు యిస్తోంది అంటూ ఫిర్యాదు చేసింది. ఎనిమిది కోట్ల మంది పాడి రైతులు ఆ రంగం పైన ఆధారపది కరువు కాటకాలను తట్టుకుని జీవిస్తున్నారు. మన దేశంలో వున్నడది 86 శాతం చిన్న రైతులే అందులో 40 శాతం మందికి ఎటువంటి బ్యాంకు రుణాలు అందటం లేదు. కౌలు రైతులకు అయితే 90 శాతం మంది వరకు కూడా యే బ్యాంకు నుండి సహాయం అందటం లేదు. చివరికి నాలుగు లేబర్ కోడ్ ల పేరుతో కార్మికులకు వున్న సమిష్టి హక్కులకు భంగం కలిగిస్తున్నారు. పర్యావరణ మార్పుల మూలంగా ధాన్యం మొక్కజొన్న రైతులు ఎక్కువగా నష్టపోతారు తద్వారా ఆహార లేమి కి దారితీసే అవకాశం లేకపోలేదు అని వడ్డే గారు వాపోయారు. కేవలం ఆహార భద్రత కాదు పోషణ భద్రత అవసరం అని ఆయన గుర్తు చేశారు.

సిపియం మరియు SKM నాయకులు సాగర్ గారు మాట్లాడుతూ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ యిటీవల సుంకాలను 27 శాతం నుండి 17 శాతానికి తగ్గించినందున పామ్ ఆయిల్, కొబ్బరి యితర నూనెల దిగుమతులు చౌక అయ్యాయి. దీని ప్రభావం రైతుల పైన వారి ఉత్పత్తులకు అందే ధరల పైన తీవ్రంగా పడుతోంది. కానీ సగటు వినియోగ దారుడికి మాత్రం ఈ ధరల తగ్గుదల ప్రయోజనం దక్కటం లేదు. యిది మన వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కు తీసుకుంటూ మోడి యిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదు. స్వామినాథన్ కమిటీ చెప్పినట్టు రైతుల ఋణవిమోచన చట్టాన్ని కేరళ తరహాలో చేయలేదు. పంట నష్టాలతో వున్న రైతాంగానికి ప్రధాని ఫసల్( fasal  ) భీమా పథకం ఉపయోగ పడటం లేదు. మోడి గుజరాత్ రాష్ట్రం తో సహ చాలా రాష్ట్రాలు ఆ పథకం నుండి వెలుపలికి వచ్చాయి. స్మార్ట్ మీటర్లు బిగించి విద్యుత్ పంపిణీ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ అమెరికాతో హడావిడిగా చేయబోతున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందం వలన భారత రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరిస్తూ, రైతులకు అన్యాయం చేసే ఒప్పందాన్ని భారత ప్రభుత్వం చేయకూడదని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.

“అమెరికాలో పండించే మొక్కజొన్న, సోయా, గోధుమ పంటలతో బాటు పాల ఉత్పత్తులకు భారతదేశంలో ఫ్రీగా మార్కెట్ లభించాలని అమెరికా కోరుతున్నది. ఆ ప్రకారం ఆయా ఉత్పత్తుల పై దిగుమతి సుంకాలను పూర్తిగా ఎత్తివేయడం ద్వారా ట్రంప్ ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇటీవల ఒక విధాన పత్రం తయారు చేసింది. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని వలన మన దేశంలో మొక్కజొన్న, సోయా, గోధుమ, వరి పంటలు పండించే రైతులకు, పాడి మీద ఆధారపడే కోట్లాది చిన్న సన్నకారు రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది. అమెరికాలో పెద్ద ఎత్తున సబ్సిడీ పొందే కార్పొరేట్ వ్యవసాయ కంపెనీలు తక్కువ ధరలకి మన దేశంలో తమ ఉత్పత్తులను డంప్ చేయడం ద్వారా కోట్లాది రైతుల జీవనోపాధిని దెబ్బ తీస్తాయి. ఎట్టి పరిస్థితులలోనూ స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులు ఉండరాదని సంయుక్త కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము,” అని కిసాన్ మోర్చా నాయకులు విస్సా కిరణ్ కుమార్ అన్నారు.

సిపిఐ నాయకురాలు పశ్య పద్మ గారు పని గంటలు పెంచటం పైన తన వ్యతిరేకత తెలుపుతూ ఎనిమిది గంటలు పని విధానం ఒక హక్కు అని దానికి తూట్లు పొడవటం అన్యాయం అని అన్నారు. దేశానికి రైతులు సంపద సృష్టి కర్తలయితే వారు ఎందుకు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. నారెగా కింద 100 రోజుల పనికూడ కల్పించటం లేదు కేవలం 42 రోజులు మాత్రమే పని యిస్తున్నారు. నిజానికి దానిని 200 రోజులకు పెంచాలి. దేశం త్వరలో జర్మనీ ని అధిగమించి నాలుగవ స్థానానికి చేరుతుంది అని యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు, అని అన్నారు.

రైతులకు న్యాయమైన ధర, చట్టబద్ధ MSP వంటి డిమాండ్లను ఖాతరు చేయని మోడి ప్రభుత్వం మరో వైపు “జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం” (NPFAM)ను తీసుకు వచ్చి వ్యవసాయ మార్కెట్లను కార్పొరేట్ల చేతిలో పెట్టే ప్రయత్నంలో ఉంది. NPFAM ను వెంటనే ఉపసంహరించాలన్నది సంయుక్త కిసాన్ మోర్చా దేశమంతటా డిమాండ్ చేస్తున్నట్లు నాయకులు తెలిపారు.

భిక్షపతి, వి. ప్రభాకర్, జక్కుల వెంకటయ్య తదితరులు కూడా మీడియా ను ఉద్దేశించి మాట్లాడారు.




Tags:    

Similar News