Uttam Kumar reddy | ‘బనకచర్లను అంగీకరించేది లేదు’

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్న ఉత్తమ్.;

Update: 2025-08-02 16:38 GMT

ఆంధ్ర, తెలంగాణ మధ్య బనకచర్ల పోరు రోజురోజుకు ముదురుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఇదే అంశంపై మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇటీవల బనకచర్లను నిర్మిస్తే అసలు తెలంగాణను నష్టమే ఉండదని, కావాలనే తెలంగాణ నేతలు రాద్దాంతం చేస్తున్నారంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా వీటిపై స్పందించిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బనకచర్లను ఆపడానికి తాము ఎంత దూరమైనా వెళ్తామన్నారు. బనకచర్లకు తమ ప్రభుత్వం పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. పోలవరం, బనకచర్లకు పర్యావరణ అనుమతి లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జీఆర్ఎంబీ కూడా ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు. బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అందులో ఎటువంటి మార్పు ఉండదని, రాబోదని తేల్చి చెప్పారు.

‘‘బనకచర్లపై నేనే స్వయంగా నా లెటర్ హెడ్‌పై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాను. ఈ ప్రాజెక్ట్‌ను ఆపడానికి మా ప్రభుత్వం అన్ని విధాలు చర్చలు చేపడుతోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నిరాధారమైన ఆరోపణలతో పొలిటికల్ మైలేజీ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఉనికిని కాపాడుకోవడానికి, పబ్లిసిటీ కోసం గులాబీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీఆర్ఎస్ గాలి మాటలు తప్ప వాస్తవాలు చెప్పలేదు. బనకచర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకమని.. ఎంతటి పోరాటానికి అయినా తాము సిద్ధం. కేంద్ర బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని మంత్రి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Tags:    

Similar News