Konda Murali | కుండబద్దలు కొట్టిన కొండామురళి
రెండుపార్టీలు తిరిగిన తర్వాత అర్ధమయ్యుంటుంది తాము కాంగ్రెస్ లో తప్ప ఇంకెక్కడా ఇమడలేమని;
ఇంతకాలానికి వరంగల్ జిల్లా నేత, మంత్రి కొండాసురేఖ(Konda Surekha) భర్త కొండా మురళి ఒక విషయాన్ని ఉన్నదున్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుచెప్పారు. అదేమిటంటే ‘‘తాము కాంగ్రెస్(Congress Party) పార్టీలో తప్ప ఇంకేపార్టీలోను ఇమడలేము’’ అన్నారు. ఎందుకంటే వీళ్ళ వైఖరిని ఏ పార్టీ కూడా ఎక్కువకాలం సహించలేందు. ఆదివారం గాంధీభవన్లో జరిగిన క్రమశిక్షణ కమిటి విచారణకు మురళి(Konda Murali) హాజరయ్యారు. వరంగల్(Warangal) జిల్లాలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీ, సీనియర్ నేతలతో కొండా దంపతులకు ఏమాత్రం పడటంలేదన్న విషయం తెలిసిందే. దంపతులకు వ్యతిరేకంగా ఎంఎల్ఏలు నాయిని రాజేందరరెడ్డి, కడియంశ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎంఎల్సీ బస్వరాజ్ సారయ్యతో పాటు కొందరు సీనియర్ నేతలు ఫిర్యాదులు చేశారు. దాంతో తమ వ్యతిరేకవర్గంపై మంత్రి దంపతులు కూడా ఫిర్యాదులు చేయటంతో ఆ పంచాయితి చాలాకాలంగా నడుస్తోంది.
కమిటి ముందు హాజరైన తర్వాత మురళి మీడియాతో మాట్లాడుతు తమరక్తంలోనే కాంగ్రెస్ ఉందన్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ కు రాజీనామా చేసి ముందు వైసీపీలోకి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన దంపతులు తర్వాత బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో చెప్పాలి. బహుశా రెండుపార్టీలు తిరిగిన తర్వాత అర్ధమయ్యుంటుంది తాము కాంగ్రెస్ లో తప్ప ఇంకెక్కడా ఇమడలేమని. కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి ఆదేశాలను ఇచ్చినా పాటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీని ప్రధానమంత్రిని చేయటమే తన లక్ష్యమన్నారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో అందరితో కలిసి పనిచేయాలని క్రమశిక్షణ కమిటి ఆదేశించిందన్నారు. కమిటి ఆదేశించినట్లే అందరితో కలిసి పనిచేయటానికి తమకు అభ్యంతరంలేదన్నారు.
ఇదేసమయంలో కమిటి ఛైర్మన్ మల్లురవి మాట్లాడుతు సమావేశం రెండుగంటలు జరిగిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య జరుగుతున్న పంచాయితీపైనే చర్చించినట్లు చెప్పారు. అలాగే జడ్చర్ల ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డి అంశంపైన కూడా చర్చించినట్లు తెలిపారు. మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అంశం చర్చకు రాలేదన్నారు. ఎందుకంటే రాజగోపాలరెడ్డిపై ఎవరూ ఫిర్యాదుచేయలేదని చెప్పారు.