తెలంగాణలో జీఓ వచ్చి నాలుగేళ్లు అయినా విలేజీ కోర్టులు ఏవి?
తెలంగాణలో విలేజ్ కోర్టుల ఏర్పాటుకు జీఓ వచ్చి నాలుగేళ్లు అయినా ఏర్పాటు కాలేదు. దీంతో పేదలకు న్యాయం అందించాలనే లా కమిషన్ లక్ష్యం తెలంగాణలో నెరవేరటం లేదు.
By : Saleem Shaik
Update: 2024-07-15 13:57 GMT
గ్రామీణ పేదల ఇంటి ముంగిటే పైసా ఖర్చు లేకుండా న్యాయం అందించేందుకు లా కమిషన్ గ్రామ న్యాయాలయాలను (విలేజ్ కోర్టులు) ఏర్పాటు చేయాలనే సూచనపై 2008వ సంవత్సరంలో కేంద్రం దీనిపై గ్రామ న్యాయాలయాల చట్టాన్ని తీసుకువచ్చింది.
- 2009 ఆగస్టు 6వతేదీన అప్పటి ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో 2009 అక్టోబరు 2వతేదీ గాంధీ జయంతి పర్వదినాన గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
- దీంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేసినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, కొత్తగా ఏర్పడిన తెలంగాణాలో కానీ ఒక్క విలేజ్ కోర్టు ఏర్పాటు చేయలేదు.
55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు
విలేజ్ కోర్టుల ఏర్పాటు గురించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయశాఖకు లేఖ రాసింది. దీంతో 2019 ఫిబ్రవరి 1వతేదీన తెలంగాణలో 55 గ్రామ కోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబరు 4 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 5 విలేజ్ కోర్టులు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 15, మెదక్ లో 1, మహబూబ్ నగర్ జిల్లాలో 3, నల్గొండలో 15,ఖమ్మంలో 6, రంగారెడ్డిలో 4, వరంగల్ లో 6 విలేజ్ కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.
విలేజ్ కోర్టులు ఏర్పాటు ఏ గ్రామాల్లోనంటే...
ముథోల్ బాసర, నస్పూర్ , శ్రీరాంపూర్, మందమర్రి, ఆర్కేపూర్, చిగురుమామిడి, కోహెడ, బెజ్జంకి, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, సారంగాపూర్, రాయకల్, కేశవపట్నం, సైదాపూర్, ఎల్కతుర్తి, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, వీఎం బంజర, అశ్వరావుపేట, దమ్మపేట, బోనకల్, వైరా, తల్లాడ, పటాన్ చెరు, అమంగల్, కొత్తూరు, కొందుర్గ్,మునగాల, వేములపల్లి, త్రిపురారం, నిడమానూర్, హాలియా,చ పెద్దవూర, దామరచర్ల, చింతపల్లి, చిట్యాల, వలిగొండ,చౌటుప్పల్, మోతుకూరు, బీబీనగర్, యాదగిరిగుట్ట, బొమ్మల రామరాం, శామీర్ పేట, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్, కీసర, భూపాలపల్లి, గీసుకొండ, వర్ధన్నపేట, పర్వత గిరి, సంగెం, కే సముద్రం గ్రామాల్లో విలేజ్ కోర్టులు ఏర్పాటు చేయాలని జీఓ వచ్చి నాలుగేళ్లు గడిచినా కోర్టులు మాత్రం ఏర్పాటు కాలేదు. దీంతో గ్రామీణ పేతలకు సత్వత ఉచిత న్యాయం అందని ద్రాక్షపండుగానే మిగిలింది.
హైకోర్టులోనే పెండింగ్ ప్రతిపాదనలు
తెలంగాణలో 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు 55 మంది గ్రామ న్యాయాధికారులు, 225 మంది ఉద్యోగులను నియమించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. దీనిపై ఆమోద ముద్ర కోసం ఫైలును తెలంగాణ హైకోర్టుకు పంపించగా అది నాలుగేళ్లుగా ప్రతిపాదనల్లోనే పెండింగులో ఉంది. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాయగా విలేజ్ కోర్టుల ప్రతిపాదనలు హైకోర్టు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
సుప్రీంకోర్టులో పిల్ దాఖలు
2008వ సంవత్సరంలో గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలని చట్టం అమలులోకి వచ్చి 16 ఏళ్లు గడిచినా ఇంకా విలేజీ కోర్టులు ఏర్పాటు కానీ వైనంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సుప్రీంకోర్టులో పిల్ వేసింది. ఈ పిల్ పై తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి, తెలంగాణ హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు కావాలి : సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్
దేశంలోని ట్రయల్ కోర్టుల్లో కేసుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న నేపథ్యంలో గ్రామ న్యాయాలయాల ఏర్పాటు చేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. ఖర్చులేని సత్వర న్యాయం గ్రామీణ పేద క్లయింట్లకు అందించాల్సిన అవసరముందని వారు పేర్కొన్నారు.
హైకోర్టు రిజిష్ట్రార్ కు లేఖ
విలేజ్ కోర్టుల ప్రతిపాదనలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలని తాము తెలంగాణ హైకోర్టు రిజిష్ట్రార్ కు లేఖ రాశామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.