ప్రెస్ క్లబ్ లో రచ్చచేయటం తప్ప కేటీఆర్ ఏమి సాధించారు ?

మంగళవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాజీమంత్రులు, ఎంఎల్ఏలను వెంటేసుకుని దాదాపు గంటసేపు నానా హడావుడిచేశారు;

Update: 2025-07-08 08:15 GMT
KTR at Somajiguda press club

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రాజకీయ రచ్చకు వేదికగా నిలిచింది. రాజకీయపార్టీల మధ్య వివాదానికి ప్రెస్ క్లబ్ వేదికగా నిలవటమే ఆశ్చర్యంగా ఉంది. మంగళవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాజీమంత్రులు, ఎంఎల్ఏలను వెంటేసుకుని దాదాపు గంటసేపు నానా హడావుడిచేశారు. నీళ్ళు, నియామకాలు, నిధులపై 8వ తేదీన ప్రెస్ క్లబ్ లో జరిగే చర్చకు రావాలని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)కి ఈనెల 5వ తేదీన కేటీఆర్ చెప్పారు. మూడురోజుల క్రితం చెప్పినట్లుగానే కేటీఆర్ ఈరోజు ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. అయితే రేవంత్ ఎంతకీ రాలేదు. దాంతో రేవంత్ పై కేటీఆర్ ఎప్పటిలాగే తన కసినంతా తీర్చుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు రేవంత్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయి దాదాపు 40 నిముషాలు మాట్లాడేసి వెళ్ళిపోయారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ ఆమధ్య మాట్లాడుతు అనేక అంశాలపై కేసీఆర్(KCR) లేదా కేటీఆర్ చర్చకు రావాలని సవాలు విసిరారు. అయితే చర్చను అసెంబ్లీలో చేద్దామని అన్నారు. పనిలోపనిగా రేవంత్ తన టార్గెట్ ను కేసీఆర్ మీదే ఉంచారు. అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ ను రేవంత్ సవాలు విసురుతుంటే కేసీఆర్ కు బదులుగా కేటీఆర్ మాత్రమే స్పందిస్తున్నారు. ఇపుడు కూడా రేవంత్ సవాలుకు కేసీఆర్ స్పందించలేదుకాని కేటీఆర్ మాత్రం రెచ్చిపోయారు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ నానా రచ్చచేశారు.

రేవంత్ ప్రెసక్లబ్ కు వచ్చి చర్చలో పాల్గొంటారని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ ప్రెస్ క్లబ్ లో చర్చకు ఎందుకు వస్తారు ? అవసరమైతే సచివాలయంలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు లేదా అసెంబ్లీలో చర్చిస్తారంతే. ఈ విషయం పదేళ్ళు అధికారంలో ఉన్న కేటీఆర్ కు బాగా తెలుసు. తన సవాలుకు రేవంత్ ప్రెస్ క్లబ్ కు ఎలాగూ రాడని బాగా తెలిసే కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వచ్చి నానా రచ్చచేసింది. ఇపుడు కూడా ‘రేవంత్ సవాలుకు కేసీఆర్ సమాధానం చెప్పరని తాను చాల’ని అంటున్నారు. అంటే రేవంత్ స్ధాయిని ఎంత తక్కువగా చూడాలో అంత తక్కువగా చూస్తున్నారు. రేవంత్ సవాలుకు కేసీఆర్ స్పందించనపుడు కేటీఆర్ సవాలుకు రేవంత్ ఎందుకు స్పందిస్తాడు ? ఇంతచిన్న లాజిక్ ను పక్కనపెట్టి తన రాజకీయ రచ్చకు కేటీఆర్ ప్రెస్ క్లబ్ ను వేదికగా చేసుకున్నట్లు అర్ధమవుతోంది.

కేసీఆర్ తో చర్చించేందుకు రేవంత్ స్ధాయి సరిపోదని అంటున్న కేటీఆర్ మరి రేవంత్ తో చర్చించేందుకు తన స్ధాయి సరిపోతుందని కేటీఆర్ ఎలాగ అనుకున్నారో అర్ధంకావటంలేదు. ఈమొత్తంమీద గమనించాల్సిన పాయింట్లు రెండున్నాయి. అవేమిటంటే రేవంత్ సవాలుకు కేసీఆర్ స్పందించరు. అలాగే కేటీఆర్ చాలెంజుకు రేవంత్ స్పందించరు. రేవంత్ బహిరంగసభల్లో, మీడియా సమావేశాల్లో కేసీఆర్ ను పదేపదే చాలెంజులు చేస్తుంటే, సోషల్ మీడియా, మీడియా సమావేశాల్లో రేవంత్ కు కేటీఆర్ సవాళ్ళు విసురుతున్నారు.

ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిందంతా రాజకీయ రచ్చలో భాగంగానే చూడాలి. కేటీఆర్ చాలెంజ్ ప్రకారం రేవంత్ ప్రెస్ క్లబ్ కు రాకపోవటంలో ఒక లాజిక్కుంది. అదేమిటంటే ఏ అంశంలో అయినా అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ ను రేవంత్, మంత్రులు పదేపదే చర్చకు రమ్మంటున్నారు. సీఎంగా ఉన్నాడు కాబట్టి రేవంత్ ప్రెస్ క్లబ్బులో కాకుండా అసెంబ్లీలోనే చర్చించాలని రేవంత్ అనుకోవటంలో తప్పులేదు. మరి కేసీఆర్ ఎందుకు స్పందించటంలేదు ? అసెంబ్లీ సమావేశాలకు హజరై రేవంత్ సవాళ్ళకు సమాధానాలు చెప్పటంలో కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు ? ప్రత్యేక తెలంగాణ కోసం చావునోట్లోనే తలపెట్టాను అని పదేపదే బహిరంగసభల్లో చెప్పుకునే కేసీఆర్ అసెంబ్లీకి హజరై రేవంత్ అండ్ కో ను ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారో అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News