ఢిల్లీలో ఏదో జరుగుతోంది ? రేవంత్, కేటీఆర్ ఎందుకెళ్ళారు ?

రేవంత్, గవర్నర్, కేటీఆర్ ఢిల్లీ పర్యటన మాత్రం అందరిలోను ఆసక్తిని రేపుతోందన్నది వాస్తవం.

Update: 2024-11-12 11:01 GMT
Revanth Jishnudev and KTR

ఢిల్లీలో ఏదో జరుగుతోంది ? అయితే ఏమి జరుగుతోందో మాత్రం తెలీటంలేదు. ఇపుడిదే విషయమై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi) విషయమై ఇంతటి చర్చలు జరుగుతుండటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే రేవంత్ రెడ్డి(RevnthReddy) ఢిల్లీకి వెళ్ళారు. అధిష్టానంతో చర్చించేందుకు రెండు రోజులు ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరారు. కేటీఆర్(KTR) ఢిల్లీకి ఎందుకు వెళ్ళారన్నదే అర్ధంకావటంలేదు. వీళ్ళిద్దరు ఢిల్లీకి వెళ్ళారంటే ఏదో కారణాలు ఉంటాయని అనుకోవచ్చు. అయితే సడెన్ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma) కూడా ఢిల్లీ బాటపట్టారు. గవర్నర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్లు ? ఈ విషయమే ఎవరికీ అర్ధంకావటంలేదు.

పాలనా సంబందిత వ్యవహారాలు, పార్టీకి సంబందించిన అంశాలు, పదవుల పంపిణీకి సంబందించి అధిష్టానంతో చర్చించేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్ళినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందులో అనుమానించాల్సిన విషయాలు ఏమీలేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సర్వం అధిష్టానమే కదా. రాష్ట్రాల్లో పూచికపుల్లను అటు తీసి ఇటు పెట్టాలన్నా అధిష్ఠానం అనుమతి ఉండాల్సిందే అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేకసార్లు రేవంత్ ఢిల్లీకి వెళ్ళారు ఇంకా చాలాసార్లు వెళతారు కాబట్టి ఢిల్లీ పర్యటనలో అనుమానించాల్సిన విషయం ఏమీలేదు. ఢిల్లీ నుండి మహారాష్ట్ర ఎన్నికల(Maharashtra Elections) ప్రచారంలో పాల్గొనేందుకు ముంబాయ్(Mumbai) చేరుకుంటారని పార్టీనేతలు చెబుతున్నారు. అవసరం కాబట్టి ఇప్పటికే ఒకసారి ముంబయ్ వెళ్ళొచ్చారు కాబట్టి పర్యటన గురించి అనుమానించాల్సిన అవసరంలేదు.

రేవంత్ విషయాన్ని వదిలేస్తే కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళినట్లు ? ఢిల్లీలో కేటీఆర్ ఎవరిని కలవబోతున్నారు ? ఎవరిని కలిసినా ఏమిటి ఉపయోగం ? అన్న ప్రశ్నలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే కేటీఆర్ ను పట్టించుకునే వాళ్ళు ఢిల్లీలో ఎవరూ లేరు. బీఆర్ఎస్ ను అటు ఇన్డీయే ఇటు ఇండియా కూటమి రెండూ దూరంగా పెట్టేశాయి. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కు ఇప్పటికిప్పుడు పెద్దగా స్పేస్ ఏమీలేదు. ఆ విషయం తెలిసే కేసీఆర్ ఫాహౌస్ వదిలి రావటంలేదు. మరీ నేపధ్యంలో కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ? చెల్లెలు కవిత(Kavitha) కూడా బెయిల్ పై హైదరాబాదులోనే ఉన్నారు. రాష్ట్రంలో అమృత్ పథకం టెండర్లలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫిర్యాదులు చేయటానికి ఢీల్లికి వెళ్ళినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే కేటీఆర్ ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వాళ్ళు ఎవరు ? రాష్ట్రంలో ఫిర్యాదుచేసినా ఒకటే కేంద్రంలో ఫిర్యాదుచేసినా ఒకటే. ఇప్పటికే కేటీఆర్ అమృత్ పథకంలో అవినీతి ఆరోపణలు తప్పని స్వయంగా బీఆర్ఎస్ నేత కందాళం ఉపేందర్ రెడ్డే ఖండించారు. తన బావమరిది సృజన్ రెడ్డికి అమృత్ పథకంలో టెండర్లు దక్కేట్లుగా రేవంత్ చక్రంతిప్పారని కేటీఆర్ చేసిన ఆరోపణలను అదేపార్టీకి చెందిన మాజీ ఎంఎల్ఏ కందాళం ఖండించారు. రేవంత్ కు సృజన్ బావమరిది కాదని తనకు చిన్నల్లుడని కందాళం స్పష్టంగా ప్రకటించారు. మిగిలిన వాళ్ళతో పోటీపడి తన చిన్నల్లుడి కంపెనీ టెండర్లు దక్కించుకుందని చెప్పటంతో కేటీఆర్ ఆరోపణలు తేలిపోయాయి. మరిక ఎవరికి అమృత్ టెండర్లపై ఫిర్యాదులు చేద్దామని ఢిల్లీకి చేరుకున్నారో అర్ధంకావటంలేదు.

ఇదే సమయంలో గవర్నర్ కూడా ఢిల్లీ బాటపట్టారు. సడెన్ గా గవర్నర్ ఢిల్లీకి ఎందుకు చేరుకున్నారో అర్ధంకావటంలేదు. అయితే జరుగుతున్న ప్రచారం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) ఆరోపణల్లో కేటీఆర్ మీద కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం గవర్నర్ ను అనుమతికోరింది. లీగల్ సమస్యలు తలెత్తకుండా గవర్నర్ ప్రభుత్వం రాసిన లేఖపై అడ్వకేట్ జనరల్ సలహా కోరారు. అడ్వకేట్ జనరల్ గవర్నర్ కు సలహా ఇచ్చారా ? ఆ సలహాపై చర్చించేందుకే గవర్నర్ ఢిల్లీకి చేరుకున్నారా అనే ప్రచారం జరుగుతోంది. పనిలోపనిగా తనమీద కేసు నమోదు చేయాలన్న ప్రభుత్వ చర్యలను అడ్డుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. ఒకవైపు తాను విచారణకు సిద్ధం, అరెస్టుకు కూడా సిద్ధమే అని హైదరాబాదులో ప్రకటిస్తునే కేసు నమోదును అడ్డుకునేందుకే కేంద్రప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకే ఢిల్లీకి చేరుకున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా రేవంత్, గవర్నర్, కేటీఆర్ ఢిల్లీ పర్యటన మాత్రం అందరిలోను ఆసక్తిని రేపుతోందన్నది వాస్తవం.

Tags:    

Similar News