కేసీఆర్ ఎందుకు నోరిప్పటంలేదు ?

ఎవరెన్ని ఆరోపణలుచేస్తున్నా కేసీఆర్(KCR) మాత్రం నోరిప్పటంలేదు, ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటంలేదు;

Update: 2025-07-06 08:25 GMT
KCR

ప్రధానప్రతిపక్ష నేత కేసీఆర్ తీరు చాలా విచిత్రంగా ఉంటోంది. తెలంగాణతో ముడిపడి ఉన్న అనేక వివాదాలకు కేసీఆరే కారణమని ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులతో సహా చాలామంది సీనియర్ నేతలు, బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఎవరెన్ని ఆరోపణలుచేస్తున్నా కేసీఆర్(KCR) మాత్రం నోరిప్పటంలేదు, ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటంలేదు. కేసీఆర్ కేంద్రంగా రేవంత్, కేంద్రమంత్రులు చాలా ఆరోపణలు చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. టెలిఫోన్ ట్యాపింగ్, జల వివాదాలు, ఉద్యోగాల భర్తీ, కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతి, అవకతవకల్లాంటి అనేక వివాదాలకు కేసీఆరే కారణమని రేవంత్ పదేపదే ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే అన్నీ విషయాలను చర్చిద్దామని, కేసీఆర్ పాత్రపై అన్నీ ఆధారాలను చూపిస్తామని ఎన్నిసార్లు సవాళ్ళు విసురుతున్నా కేసీఆర్ మాత్రం నోరిప్పటంలేదు.

రేవంత్, కేంద్రమంత్రులు కేసీఆర్ ను తప్పుపడుతుంటే కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) స్పందిస్తున్నారు. రేవంత్(Revanth), కేంద్రమంత్రుల ఆరోపణలకు సమాధానాలు ఇవ్వటానికి కేసీఆర్ అవసరంలేదని తాము సరిపోతామని బీఆర్ఎస్ కీలకనేతలు మీడియా ముందుకొచ్చేస్తున్నారు. బీఆర్ఎస్(BRS) హయాంలో జరిగిన అవినీతి, వివాదాలకు సమాధానాలు చెప్పాల్సింది కేసీఆరే కాని కేటీఆర్, హరీష్ ఎంతమాత్రం కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు అత్యంత వివాదాస్పదమైనపుడు సమాధానం చెప్పాల్సింది కూడా కేసీఆర్ మాత్రమే కాని కేటీఆర్, హరీష్ కాదు. ఇంతచిన్న విషయం కేసీఆర్ కు తెలీకకాదు మౌనం వహిస్తున్నది. అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనలేకే మొహంచాటేస్తున్నారంటు రేవంత్, మంత్రులు పదేపదే రెచ్చగొడుతున్నా కేసీఆర్ మాత్రం నోరిప్పటంలేదు.

టెలిఫోన్ ట్యాపింగ్, ఫార్ములా(Formula E car) అవినీతి, అధికారదుర్వినియోగంపై మాట్లాడటానికి రమ్మని మంత్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటిల్లో ఫార్ములా కార్ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ చెబుతున్నారే కాని అధికార దుర్వినియోగం జరగలేదనిమాత్రం అనటంలేదు. ఫార్ములా కార్ రేసులో కేటీఆర్ ఏస్ధాయిలో అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారనే విషయం ఏసీబీ విచారణలో ఇప్పటికే బయటపడింది. ఈకేసులో ఏ 2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణలో అన్నీవిషయాలను అధికారులకు చెప్పేశారని సమాచారం. మళ్ళీ ఇదే కేటీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మాత్రం నోరిప్పటంలేదు. ట్యాపింగ్ పైన ఆరోపణలపై హరీష్ రావు కూడా ఏమి మాట్లాడటంలేదు.

కాళేశ్వరం, మేడిగడ్డనిర్మాణం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే జరిగిందని, క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదు, నిర్ణయమూ జరగలేదని ఇప్పటికే ప్రభుత్వం బయటపెట్టింది. అయినాసరే కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణాలు క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని కేటీఆర్, హరీష్ బుకాయిస్తున్నారు. అలాగే గోదావరి జలాల మళ్ళింపు, ఏపీలో నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలోనే బీజంపడిందని రేవంత్, మంత్రులు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ మాత్రం మౌనవ్రతమే పాటిస్తున్నారు.

ఏప్రిల్ 27వ తేదీన ఎల్కతుర్తి బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతు తొందరలోనే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ఏడాదిన్నర సమయం అయిపోయిందని చాలా సీరియస్ గా చెబితే అందరు నిజమే అనుకున్నారు. ఈ మాటలుచెప్పి రెండున్నర నెలలు అయిపోయినా ఇప్పటివరకు ఫామ్ హౌస్ లో నుండి అడుగు బయటపెట్టిందిలేదు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా తాను మాత్రం ఫామ్ హౌస్ లో నుండి బయటకు వచ్చేదిలేదు..తనపైన వినిపిస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పేదిలేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తొందరలోనే మీడియా సమావేశం పెట్టబోతున్నారంటు చాలారోజులుగా ప్రచారం జరగుతున్నా మీడియా ముందుకు కూడా రావటంలేదు. తనను ఓడించి ఫామ్ హౌస్ కే పరిమితంచేసిన జనాలంటే ఇంకా కేసీఆర్లో కోపం పోలేదేమో.

Tags:    

Similar News