యూరియా మంటలు..ఎవరు చెబుతున్నది నిజం ?

అవసరానికి తగ్గట్లుగా యూరియాను సరఫరాచేయకపోవటం వల్లే రాష్ట్రంలో 2.25 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందన్నారు;

Update: 2025-07-30 09:25 GMT
Farmers demanding for Urea

తెలంగాణలో ప్రతి చిన్న విషయానికి పార్టీల మధ్య మంటలు మండాల్సిందే. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ కి మధ్య లేకపోతే ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య కీచులాటలు జరగని రోజంటు లేదు. చిన్నవిషయం కూడా చిలికి చిలికి గాలివానలాగ తయారై చివరకు సంచలనమైపోతున్నది. ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణలో హాట్ టాపిక్ ఏమిటంటే యూరియా సరఫరా. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చేయటంలేదని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth), వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు నానా గోలచేస్తున్నారు. దీనికి కౌంటర్ గా తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు మండిపోతున్నారు. డిమాండుకు మించిన యూరియాను కేంద్రం సరఫరా చేసిందని చెబుతున్నారు. కేంద్రం సరఫరా చేసిన యూరియా(Urea) అంతా ఎటు వెళ్ళిందని నిలదీస్తున్నారు. మధ్యలో బీఆర్ఎస్(BRS)నేతలు చలికాచుకుంటున్నారు.

రాష్ట్రవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రేవంత్, తుమ్మల గతంలోనే కేంద్రప్రభుత్వానికి లేఖలు రాశారు. అయితే డిమండుకుతగ్గ యూరియా సరఫరా కాకపోవటం వల్లే రైతుల్లో అలజడి పెరిగిపోతోందని ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ఏప్రిల్-జూలై మధ్య 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అయితే కేంద్రం నుండి 4.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) చెప్పారు. కేంద్రం అవసరానికి తగ్గట్లుగా యూరియాను సరఫరాచేయకపోవటం వల్లే రాష్ట్రంలో 2.25 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో రోజువారి సగటున 13 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గతంలోనే తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి రాసిన లేఖలో స్పష్టంచేశారు.


తెలంగాణకు వచ్చిందే 4.35 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అయితే బీజేపీ అధ్యక్షుడు మాత్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఎలాగ చెబుతారంటు పొన్నం మండిపడ్డారు. రైతులవిషయంలో తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రప్రభుత్వం రాజకీయాలు మానేసి అవసరానికి తగ్గట్లుగా ఎరువులు పంపించాలని పొన్నం విజ్ఞప్తిచేశారు.

ఇదే విషయమై నారపరాజు రామచంద్రరావు మాట్లాడుతు తెలంగాణకు కేంద్రం పంపించిన యూరియా నల్లబజారుకు వెళుతోందని ఆరోపించారు. కేంద్రంలోని ఎరువులశాఖ లెక్కల ప్రకారం 2024-25 ఏడాదిలో రాష్ట్రప్రభుత్వం అడిగినట్లుగా 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందన్నారు. అప్పటికే 2.67 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు నారపరాజు చెప్పారు. ఈ లెక్క ప్రకారం కేంద్రం నుండి తెలంగాణకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు అధ్యక్షుడు తెలిపారు. అవసరానికి మించే కేంద్రం యూరియా పంపినా రేవంత్, మంత్రులు మాత్రం కేంద్రంపై ఆరోపణలు చేయటం తగదన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపిస్తే అధ్యక్షపదవికి రాజీనామా చేస్తానని చాలెంజ్ కూడా చేశారు. లేకపోతే మంత్రిపదవికి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు.


వీళ్ళ సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా క్షేత్రస్ధాయిలో రైతులు మాత్రం అవసరమైన యూరియా దొరకక నానా ఇబ్బందులు పడుతున్నది వాస్తవం. ఎరువులు అమ్మే డీలర్లు, షాపుల దగ్గర యూరియా కోసం రైతులు పెద్దఎత్తున గుంపులుగా చేరుతున్నారు. యూరియా కోసం రైతులు ఎన్నిపాట్లు పడుతున్నా సరిపడా దొరకటంలేదు. దీంతో యూరియా సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది నిజమా లేకపోతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెబుతున్నది వాస్తవమా అర్ధంకావటంలేదు.


కొరత చాలా ఉంది: చల్లగొండ్ల

యూరియా కొరత ఉందని రైతు చల్లగొండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఎంత యూరియా కావాలని ఇండింట్ పెట్టింది, కేంద్రం ఎంత సరఫరా చేస్తోందన్న విషయం తెలియకపోయినా యూరియాకు కొరతైతే చాలా ఎక్కువగా ఉందన్నారు. యూరియాను మొక్కజొన్న పంటకు ఎక్కువగాను, వరి, పత్తి పంటల్లో కూడా వాడుతారని తెలిపారు. ఎరువులు కొట్లలో యూరియా దొరకటం కష్టంగా ఉందన్నారు. 45 కేజీల బ్యాగు(కట్ట) సొసైటిలో 280 రూపాయలు, బయట షాపులో అయితే రు. 300 అమ్ముతున్నట్లు మండిపడ్డారు. షాపుల్లో 2 యూరియా బ్యాగులు కావాలంటే ఒక అగ్రిగోల్డ్ ఎరువుల బ్యాగు కొనాలని రైతులకు బలవంతంగా అంటకడుతున్నట్లు ఆరోపించారు. సొసైటీల్లో యూరియా దొరుకుతున్నా అవసరం మేరకు ఇవ్వటంలేదని అదికూడా ఆధార్ కార్డు చూపిస్తేనే ఇస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News