కేటీఆర్ ను కాపాడుతున్న శక్తి ఎవరు ?

కేటీఆర్(KTR) అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ(Telangana ACB) అన్నీ అధారాలను గవర్నర్ కు సమర్పించి మూడువారాలు దాటిపోయింది

Update: 2025-10-04 10:41 GMT
KTR and Formula E car race

ఏదో అదృశ్యశక్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాపాడుతోందా ? అందుకనే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని మూడువారాల క్రితం చీఫ్ సెక్రటరీ నుండి రిక్వెస్టు వెళ్ళినా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారా ? అనే ప్రశ్నలకు అవుననే కాంగ్రెస్(Telangana Congress) నేతలంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు(Formula e Car Race)కేసులో కేటీఆర్(KTR) అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ(Telangana ACB) అన్నీ అధారాలను గవర్నర్ కు సమర్పించి మూడువారాలు దాటిపోయింది. అనుమతిచ్చే విషయమై గవర్నర్ న్యాయనిపుణులతో చర్చించారు. అయినా కేటీఆర్ ప్రాసిక్యూట్ చేయటానికి గవర్నర్ ఏసీబీకి ఎందుకు అనుమతి ఇవ్వటంలేదు ? అన్న ప్రశ్నకు రాజ్ భవన్ నుండి సమాధానం రావటంలేదు.

ఫార్ములా కార్ రేసు నిర్వహణ ముసుగులో బీఆర్ఎస్ నుండి రు. 45 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీ కొనుగోలుచేసింది. అంతకుముందు ఫార్ములా కార్ నిర్వహణ బాధ్యతలను పై కంపెనీకి కేటీఆర్ కట్టబెట్టారు. అయితే తెరవెనుక ఏమిజరిగిందో తెలీదుకాని రేసు నిర్వహణ నుండి అర్ధాంతరంగా ఏస్ కంపెనీ పక్కకు వెళ్ళిపోయింది. దానిస్ధానంలో బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈఆపరేషన్స్ అనే కంపెనీ చేరింది. రేసు మొదలుకాకుండానే బ్రిటన్ కంపెనీకి కేటీఆర్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ రు. 45 కోట్లు చెల్లించేశారు. హెచ్ఎండీఏ ఖాతానుండి ఈ మొత్తాన్ని బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి మళ్ళించారు. ఇంతాచేసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన కారణంగా అసలు రేసు జరగనేలేదు. చెల్లించిన డబ్బులను కేటీఆర్ వెనక్కూ తీసుకోలేదు.

క్యాబినెట్, ఆర్ధికశాఖ, ఆర్బీఐ, ఎన్నికల కమీషన్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే కోట్లరూపాయలను హెచ్ఎండీఏ బ్రిటన్ కంపెనీకి బదిలీచేసింది. అనుమతులు తీసుకోకుండా కోట్లాది రూపాయలు బదిలీచేయటం అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని ఏసీబీ తేల్చింది. అలాగే బీఆర్ఎస్ కు ఎస్ కంపెనీ 45 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వటం క్విడ్ ప్రోకో కిందకే వస్తుందని ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఇలాంటి అనేక ఆధారాలతో కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలి పర్మీషన్ ఇవ్వమంటు ప్రభుత్వం నుండి గవర్నర్ కు సెప్టెంబర్ మొదటివారంలో ఫైల్ వెళితే ఇప్పటివరకు అతీగతిలేదు. ఆ ఫైల్ విషయంలో గవర్నర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా తెలీటంలేదు.

కేటీఆర్ మీద కేసునమోదు చేసి విచారణ జరపటానికి గతంలో ఏసీబీకి గవర్నరే అనుమతి ఇచ్చారు. విచారణలో కేటీఆర్ అవినీతి, అధికారదుర్వినియోగానాకి పాల్పడ్డారని తేల్చింది. అందుకనే ప్రాసిక్యూట్ చేయాటానికి మళ్ళీ గవర్నర్ ను ఏసీబీ అనుమతికోరింది. ఈవిషయంలో అనుమతి ఇవ్వటానికి గవర్నర్ ఎందుకని తాత్సారం చేస్తున్నారనే అనుమానాలు సర్వత్రా పెరిగిపోతోంది. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి కోరుతు రాష్ట్రప్రభుత్వం కేంద్రంలోని డీవోపీటీకి రాసిన లేఖకు కూడా ఇప్పటివరకు అనుమతిరాలేదు.

ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి ఇవ్వకుండా గవర్నర్ కు కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ ను కేంద్రమంత్రే కాపాడుతున్నట్లు మండిపడ్డారు. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయటానికి అవసరమైన అన్నీ ఆధారాలను సమర్పించిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని బొమ్మ అనుమానాలు లేవనెత్తారు. బొమ్మ ఆరోపించినట్లు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు కిషన్ అడ్డుపడుతున్నారో లేదో తెలీదుకాని ఏదో అదృశ్యశక్తి అడ్డుపడుతోందని మాత్రం అర్ధమవుతోంది.

Similar News