కాళేశ్వరం చేపలన్నీ రిమాండుకు చేరుతున్నాయా ?

అధికారుల ఆస్తులే రూ.వందల కోట్లు ఉన్నాయంటే.. పాలకుల ఆస్తుల సంగతేంటి..!;

Update: 2025-07-16 09:29 GMT

కాళేశ్వరంలో ఏసీబీ వేస్తున్న వలకు నెలకో తిమింగలం చిక్కుతుంది. ఒకరి తర్వాత ఒకరుగా అవినీతి అధికారులు బయటపడుతున్నారు. కాళేశ్వరంలోని అవినీతి చేపలన్నీ ఒకదాని వెనకే ఒకటిగా రిమాండ్‌కు వెళ్తున్నాయి. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సీ) మురళీధర్ రావును ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. ఆయనకన్నా ముందు.. ఈఎన్‌సీగా ఉన్న భూక్యా హరిరామ్‌ను, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్‌ను కూడా ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించారు. వీరి ముగ్గురిని కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న కేసులోనే అదుపులోకి తీసుకున్నారు. వీరు నిర్వర్తిస్తున్న పదవులను, వీరికి ఉన్న ఆస్తులను చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయారు. వీరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని వివారాలు వెళ్లడిస్తే.. రాష్ట్రమంతా అవాక్కయింది. దానికి తోడు ఏసీబీ కూడా అవినీతి తిమింగిలాలను పట్టుకోవడంలో ఒక పద్దతిని అనుసరిస్తోంది. మే నెలలో హరిరామ్, జూన్ నెలలో శ్రీధర్, జులై నెలలో మురళిధర్‌ను అదుపులోకి తీసుకుంది. దీంతో ఇప్పుడు ఆగస్టులో ఎవరి వంతు? అనేది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

పదవీ విరమణ అయినా 11 ఏళ్లు సర్వీస్‌లోనే..

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రావు ఆస్తుల వివరాలను రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటంతోనే ఏసీబీ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈఎన్సీగా పనిచేసిన ఆయన ఆస్తుల వివరాలు రూ.500 కోట్లకు పైనే ఉందని అధికారులు చెప్పారు. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే.. వాస్తవానికి మురళీధర్ రావు.. 2013లోనే రిటైర్ అయ్యారు. అయినా ఆయన 11 ఏళ్ల నుంచి విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. బిల్లు పాస్ కావాలన్నా, హోల్డ్‌లో పెట్టాలన్నా కూడా ఆయన సంతకం తప్పనిసరి అన్న విధంగా ఆయన విధులు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి 2024లో మురళీధర్‌ను విధుల నుంచి తొలగించింది. తాజాగా ఏకకాలంలో 11 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. భారీ మొత్తంలో ఆస్తులను కనుగొన్నారు.

మురళీధర్‌‌‌‌‌‌‌‌రావుకు బంజారాహిల్స్‌‌‌‌లోని రోడ్‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ 5లో ఫ్లాట్‌‌‌‌ ఉండగా.. అందులోనే ఉంటున్నాడు. యూసుఫ్‌‌‌‌గూడ, బేగంపేట, కోకాపేటలో 3 ఫ్లాట్లు, హైదరాబాద్‌‌‌‌లోని అత్యంత ప్రైమ్ లొకేషన్‌‌‌‌లో కమర్షియల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌, నాలుగు ఖరీదైన ఓపెన్‌‌‌‌ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, బెంజ్‌‌‌‌ సహా మూడు కార్లు, బంగారు ఆభరణాలు, ఇతర బ్యాంకు డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.

బంగారం, బ్యాంకు డిపాజిట్ల వివరాలు సేకరించారు. మోకిలలో 6,500 చదరపు గజాల స్థలం, కరీంనగర్‌‌‌‌లో కమర్షియల్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌, కోదాడలో అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌, జహీరాబాద్‌‌‌‌లో 2 కేడబ్ల్యూ సోలార్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్రాజెక్టుతో పాటు వరంగల్‌‌‌‌లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌, 11 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌‌‌‌ ప్రకారం రూ.500 కోట్లుకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సంపాదన వందల కోట్లు

ఎన్డీఎస్ఏ రిపోర్టులో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం నాసిరకంగా జరిగిందని పేర్కొందని మంత్రి ప్రకటించిన రెండు రోజుల్లోనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు అప్పటి కాళేశ్వరం ఇంజనీర్-ఇన్-చీఫ్ అయిన భూక్యా హరి రామ్ పై దాడులు చేశారు. ఈ సోదాల్లో ఆయన ఆదాయాన్ని మించిన ఆస్తులను కలిగి ఉన్నారని నిర్ధారించింది. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైనే అని అంచనా వేశారు ఏసీబీ అధికారు. ఇదంతా కూడా ఏప్రిల్‌లో చివరిలో జరిగింది. మే నెల ప్రారంభంలోనే హరిరామ్‌ను రిమాండ్‌కు తరలించారు.

ఆ తర్వాత నెల జూన్‌లోనే కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజినీ నూనె శ్రీధర్‌పై ఫోకస్ పెట్టారు. ఆయన సహా ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. అందులో కూడా భారీ మొత్తంలో ఆస్తులను కనుగొన్నారు. ఆయన ఆస్తుల విలువ కూడా రూ.300 కోట్లకు పైనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూన్‌లోనే ఆయనను రిమాండ్‌కు కూడా తరలించారు. ఇప్పుడు తాజాగా జులై నెలలో కాళేశ్వరంలో పనిచేసిన మరో ఇంజినీరింగ్ విభాగం అధికారి మురళీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆగస్టులో ఎవరు..?

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లే అధికారుల అవినీతిపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒకరి తర్వాత ఒకరిగా అధికారులు అవినీతి బండాగారాన్ని బహిర్గతం చేస్తోంది. మేలో హరిరామ్, జూన్‌లో నూనె శ్రీధర్, జులైలో మురళీధర్‌ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ అధికారులు నెలకు ఒకరిని బండారం బయటపెడుతున్న క్రమంలో.. ప్రజలందరి దృష్టి ఇప్పుడు ఆగస్టు నెలపైనే ఉంది. ఆగస్లు నెలలో ఏసీబీ వలలో చిక్కే అమినీతి తిమింగలం ఎవరు? వాళ్ల ఆస్తులు ఏరేంజ్‌లో ఉంటాయో? అని చర్చించుకుంటున్నారు.

అధికారులే ఇలా ఉంటే పాలకుల పరిస్థితి ఏంటో..?

ఈ క్రమంలోనే మరో చర్చ కూడా తీవ్రంగా జరుగుతోంది. కాళేశ్వరంలో పనిచేసిన అధికారులే వందల కోట్ల ఆస్తులను పోగేసుకుంటే పాలకులు ఎంతటి స్థాయిలో ఉండొచ్చు? అధికారుల ఆస్తులను లెక్కవేయడానికే అధికారులకు రోజులు పడుతుంటే.. ఇక పాలకులపై ఫోకస్ పెడితే.. వారాల తరబడి లెక్కలు కట్టాల్సి వస్తుందేమో? అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారుల ఆస్తులు వంద కోట్లు ఉంటే.. పాలకులవి వేల కోట్లలో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News