సిగాచి ప్రమాదంలో ఎనిమిది మంది ఆచూకీ ఎందుకు దొరకలేదు ?

శిధిలాల కింద నలిగిపోయిన ఎనిమిదిమంది ఆచూకీ లభించటం అసాధ్యమని నిపుణులు తేల్చినట్లు ప్రకటనలో చెప్పారు;

Update: 2025-07-09 10:31 GMT
Sigachi Chemical Factory blast

పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరిలో జరిగిన ప్రమాదంలో 8 మంది ఆచూకీని కనిపెట్టడంలో అధికారయంత్రాంగం విఫలమైంది. అందుకనే ఆ ఎనిమిదిమంది మరణించినట్లే అని బుధవారం ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా అడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఈమేరకు ప్రకటన జారీచేశారు. శిధిలాల కింద నలిగిపోయిన ఎనిమిదిమంది ఆచూకీ లభించటం అసాధ్యమని నిపుణులు తేల్చినట్లు ప్రకటనలో చెప్పారు. అందుకనే వారంతా చనిపోయినట్లు ప్రకటించామని చంద్రశేఖర్ తెలిపారు. రాహుల్, శివాజి, వెంకటేష్, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్ ప్రమాదంలో కాలి బూడిదైపయుంటారని నిపుణులు, ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. అందుకనే వీళ్ళ ఆచూకి కనిపెట్టడం కష్టమని తేల్చేశారు.

ప్రమాదం జరిగిన దగ్గర నుండి ఇప్పటికి చనిపోయిన వారిసంఖ్య అధికారికంగా 48గా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. చనిపోయిన 48 మంది మృతుల కుటుంబాలతో డీఎన్ఏ పరీక్షలు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మృతుల సంఖ్య తేలింది. అప్పటికే మరో 20 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. కాబట్టి మృతులు, వైద్యం చేయించుకుంటున్న వారి లెక్క తేలింది. అయితే అప్పటి నుండి శిధిలాల కిందే మరో ఎనిమిదిమంది ఉండిపోయారని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారిలో కాని లేదా వైద్యం కోసం ఆసుపత్రుల్లో కూడా తమ వాళ్ళు లేరని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మొత్తం శిధిలాలను తొలగించినా ఎనిమిదిమంది జాడ బయటపడలేదు. అందుకని అధికారులు ఆఎనిమిదిమంది కుటుంబసభ్యులను వారి ఊర్లకు వెళ్ళిపొమ్మని చెప్పేశారు. మూడునెలల తర్వాత మళ్ళీ తిరిగి రావాలని కుటుంబసభ్యుకు చెప్పారు.

ఆ మృతదేహాలు ఏమయ్యాయి ?

అధికారయంత్రాంగం ప్రకారం మృతదేహాలు కనబడకపోవటానికి రెండుకారణాలు ఉంటాయి. మొదటిది పేలుడు జరిగినపుడు ఆ సమయంలో వచ్చిన మంటల్లో కాలిబూడిదగా మారిపోయుంటారు. మంటల్లో కాలిపోయిన ఇతర మృతదేహాలతోనే ఈ ఎనిమిదిమంది బూడిద లేదా కాలిపోయిన శరీరభాగాలు కూడా కలిసిపోయుండచ్చు. రెండో కారణం ప్రమాదం జరిగిన దగ్గర నుండి కురుస్తున్న భారీవర్షాలు, శిధిలాల కారణంగా రేగిన దుమ్ముతో బూడిద వర్షపు నీళ్ళల్లో కొట్టుకుపోవటమో లేదా గాలికి కొట్టుకుని పోయుండచ్చు. అందుకనే ఎనిమిదిమంది మృతదేహాల తాలూకు ఆనవాళ్ళు ఏమీ మిగలలేదు. ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు కాబట్టే డీఎన్ఏ టెస్టు కూడా జరగలేదు.

ఈ విషయాలన్నీ ప్రభుత్వ అధికారులు, ప్రమాదంపై విచారణ చేస్తున్న నిపుణులు ఇదే విషయాన్ని రాష్ట్రప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించబోతున్నారు. నిపుణులు, అధికారుల నివేదికలో ఈ విషయం చెప్పకపోతే ఎనిమిదిమంది కుటుంబసభ్యులకు నష్టపరిహారం అందదు. అందుకనే అధికారులు, నిపుణుల నివేదిక ఈ విషయంలో కీలకపాత్ర పోషించబోతోంది.

Tags:    

Similar News