రేవంత్ కు కేంద్రమంత్రులు ఎందుకు అపాయిట్మెంట్లు రద్దుచేసుకున్నారు ?
రేవంత్ కు ఇచ్చిన అపాయిట్మెంట్లను కేంద్రమంత్రులు చివరినిముషంలో రద్దు చేశారని.;
ఢిల్లీలో జరిగిన పరిణామం చాలా ఆశ్చర్యంగా ఉంది. గురువారం ఢిల్లీకి వెళ్ళిన ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం పార్టీ మీటింగులో పాల్గొన్నారు. సాయంత్రం కొందరు కేంద్రమంత్రులను కలవాలని అనుకున్నారు. ముందుగానే అనుకున్న ప్రోగ్రామ్ కాబట్టి గ్రామీణపట్టణాభివృద్ధిశాఖ, ఆర్ధికశాఖ, జలవనరుల శాఖల మంత్రుల అపాయిట్మెంట్లు కూడా ఖరారయ్యాయి. కాబట్టి ముందు పార్టీ మీటింగు చూసుకుని తర్వాత కేంద్రమంత్రులను కలుద్దామని రేవంత్ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నారు. అయితే శుక్రవారం కేంద్రమంత్రులతో భేటీకి రేవంత్(Revanth) ప్రయత్నించినపుడు అటువైపు నుండి ఎలాంటి సమాచారం అప్ డేట్ కాలేదు. అందుకనే శనివారం కూడా రేవంత్ ఢిల్లీలోనే ఉండిపోయారు. అయితే శనివారం సీఎం ఎన్నిసార్లు ప్రయత్నించినా కేంద్రమంత్రుల కార్యాలయాలు స్పందించలేదని సమాచారం. దాంతో ఏమి జరుగుతోందో ముందు రేవంత్ కు అర్ధంకాలేదు. అయితే గట్టిగా ప్రయత్నించిన మీదట తెలిసిన సమాచారం ఏమిటంటే ముందుగా రేవంత్ కు ఇచ్చిన అపాయిట్మెంట్లను కేంద్రమంత్రులు చివరినిముషంలో రద్దు చేశారని.
ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర క్యాబినెట్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రుల ర్యాంక్ ఒకటే. కాబట్టి సమానస్ధాయి నేతలు అడిగినపుడు అపాయిట్మెంట్లు ఇవ్వటం కుదరదని చెప్పటం చాలా అరుదు. అలాగే ఇచ్చిన అపాయిట్మెంట్ల రద్దు కూడా అరుదనే చెప్పాలి. అలాంటిది ఇపుడు కేంద్రమంత్రులు రేవంత్ కు ఇచ్చిన అపాయిట్మెంట్లను ఎందుకు రద్దుచేసుకున్నారన్నది ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నేతల సమాచారం ఏమిటంటే రేవంత్ ను కలవటానికి కేంద్రమంత్రులు భయపడుతున్నారట. ఎందుకంటే జనగణన, కులగణన(Census) చేయించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయమని రేవంత్ పదేపదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన మోడల్ నే కేంద్రప్రభుత్వం ఫాలో అవ్వాలని నరేంద్రమోదీ(Narendra Modi)కి రేవంత్ చాలాసార్లు సూచించారు.
ఢిల్లీలో మీడియాతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి(Rahul Gandhi) మాట్లాడినపుడు కూడా కేంద్రప్రభుత్వం జనగణన, కులగణన చేయించాలన్న నిర్ణయం వెనుక తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఒత్తిడే ఉందని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనగణన, కులగణన చేయించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయం విషయంలో బీజేపీ నేతలకన్నా కాంగ్రెస్ నేతలే ఎక్కువ హ్యాపీగా ఫీలవుతున్నారు. కేంద్రం జనగణన, కులగణన చేయించాలని అనుకోవటం కాంగ్రెస్ విజయంగానే ప్రచారం చేసుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ ప్రకటనలను ఎలా తిప్పికొట్టాలో బీజేపీ నేతలకు అర్ధంకావటంలేదు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ కులగణనలో కీలకమైన రేవంత్ తో భేటీ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో అన్న ఆందోళనతోనే అపాయిట్మెంట్లు ఇచ్చిన కేంద్రమంత్రులు ముందుజాగ్రత్తగా తమ అపాయిట్మెంట్లను రద్దుచేసుకున్నారని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి నిజం ఏమిటో కేంద్రమంత్రులు లేదా రేవంతే చెప్పాలి.