రేవంత్ ప్రశ్నకు హరీష్ సమాధానాలు చెప్పగలరా ?

2018-23 మధ్యలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయితే పీఏసీ ఛైర్మన్ గా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ను స్పీకర్ ఎలా ప్రకటించారని హరీష్ ను ప్రశ్నించారు.

Update: 2024-09-13 05:12 GMT
Revanth and Harish

పాలను నీళ్ళని కలిపి ఉంచినపుడు హంసలు పాలను మాత్రమే తీసుకుని నీళ్ళని వదిలేస్తాయని పెద్దలు చెబుతుంటారు. కొంతమంది రాజకీయనేతలు కూడా అచ్చంగా హంసల్లాగే వ్యవహరిస్తున్నారు. తమకు కావాల్సిన విషయాలను మాత్రమే పట్టుకుని ఇబ్బంది కలిగే విషయాలను మరచిపోయినట్లు నటిస్తుంటారు. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి (పీఏసీ) ఛైర్మన్ గా అసెంబ్లీ స్పీకర్ ప్రకటించటంపై బీఆర్ఎస్ నేతలు ఎంతటి గోలచేస్తున్నారో అందరు చూస్తున్నదే. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గాంధీకి స్పీకర్ పీఏసీ ఛైర్మన్ పదవిని ఎలాగిస్తారని హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వరరావు నానా గోలచేస్తున్నారు. పీఏసీ ఛైర్మన్ గా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించిన ఎంఎల్ఏకే ఇవ్వాలంటు రచ్చ రచ్చ చేస్తున్నారు.

స్పీకర్ నిర్ణయం కరెక్టేనని, తాను బీఆర్ఎస్ ఎంఎల్ఏని కాబట్టే తనను ఛైర్మన్ గా ఎంపిక చేశారని గాంధీ చెప్పటంతో గురువారం ఉదయం నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, గాంధీ మధ్య పెద్ద గొడవలవుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పీఏసీ ఛైర్మన్ పదవిని ఏ ఏ పార్టీలకు కేటాయించామనే విషయాన్ని హరీష్ గురువారం బయటపెట్టారు. అయితే రేవంత్ అడిగిన ప్రశ్నలకు మాత్రం హరీష్ సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు. ఇంతకీ రేవంత్ వేసిన ప్రశ్నలు ఏమిటంటే 2018-23 మధ్యలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అయితే పీఏసీ ఛైర్మన్ గా ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ను అప్పటి స్పీకర్ ఎలా ప్రకటించారో చెప్పాలని హరీష్ ను సూటిగా ప్రశ్నించారు. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ ను కాదని ఎంఐఎం సభ్యుడికి పీఏసీ ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారని తాము అడిగినపుడు స్పీకర్ విచాక్షణాధికారం అని కేసీఆర్ సమాధానం చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు.

2014లో టీడీపీకి 15 మంది ఎంఎల్ఏలున్న విషయాన్ని రేవంత్ గుర్తుచేసుకున్నారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ(బీఏసీ) సభ్యులుగా ఎర్రబల్లి దయాకర్ రావు, తన పేర్లను చంద్రబాబునాయుడు సూచించినపుడు తన పేరును మార్చాలని స్పీకర్ ఎందుకు టీడీపీ అధినేతకు లేఖరాశారని నిలదీశారు. తర్వాత ఎర్రబల్లి టీడీపీలో నుండి బీఆర్ఎస్ లోకి ఫిరాయించినపుడు తనను ఫ్లోర్ లీడర్ గా ప్రకటించాలని చంద్రబాబు సూచిస్తే స్సీకర్ నిరాకరించిన విషయాన్ని రేవంత్ ఇపుడు ప్రస్తావించారు. ఏ పార్టీ తరపున ఎవరు ఫ్లోర్ లీడరుగా ఉండాలన్న నిర్ణయం స్పీకర్ కు సంబంధమే లేదన్నారు. అయినా సరే తనను స్పీకర్ ఫ్లోర్ లీడర్ గా గుర్తించటానికి నిరాకరించని విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు 2014, 18లో సాంకేతిక బలం, సంప్రదాయాలను కాదని స్పీకర్ విచక్షణ అన్న పద్దతిని ప్రవేశపెట్టిందే కేసీఆర్ అన్న విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. అప్పట్లో కేసీఆర్, స్పీకర్ మొదలుపెట్టిన విధానాన్నే ఇపుడు స్పీకర్ అనుసరిస్తున్నారని రేవంత్ తేల్చిచెప్పారు. ఇపుడు రేవంత్ అడిగిన ప్రశ్నలు సబబుగానే ఉంది. కాబట్టి 2014, 18లో అసెంబ్లీలో ఏమి జరిగిందనే విషయంలో రేవంత్ ప్రస్తావించిన అంశాలపై హరీష్ క్లారిటి ఇస్తే బాగుంటుంది.

Tags:    

Similar News