బీఆర్ఎస్, జాగృతిలో అసహనం ఎందుకు పెరిగిపోతోంది ? (వీడియోలు)

కల్వకుంట్ల కవిత(Kavitha) మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కోపంతో ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడిచేసి విధ్వంసంచేశారు;

Update: 2025-07-13 09:18 GMT
Attack on Teenmar Mallanna office by Jagruthi leaders

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు దాని అనుబంధ సంస్ధ జాగృతిలో అసహనం పెరిగిపోతోంది. మీడియా ఆఫీసు, సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎంఎల్సీ ఆఫీసు మీద జరిగిన దాడితోనే కారుపార్టీ+జాగృతి నేతల్లో అసహనం పెరిగిపోతోంది అనేందుకు ఉదాహరణగా నిలుస్తున్నది. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) మీద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కోపంతో ఎంఎల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడిచేసి విధ్వంసంచేశారు. కవితపై తీన్మార్(Teenmar Mallanna) చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసుంటే బాగుండేది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ను ఆర్డినెన్స్ ద్వారా అమలుచేయాలని ఎనుముల రేవంత్ రెడ్డి క్యాబినెట్ డిసైడ్ చేసింది. క్యాబినెట్ చేసిన నిర్ణయం తమఒత్తిడి ఫలితమే అని కవిత ప్రకటించారు. ప్రకటించుకోవటమే కాకుండా తన ఆఫీసులో సంబరాలు కూడా చేసుకున్నారు.

తమఒత్తిడి మేరకే ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీచేయాలన్న నిర్ణయం తీసుకున్నదని కవిత చేసిన ప్రకటన హాస్యాస్పదమనే చెప్పాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్(BC Reservations) గురించి 2023 ఎన్నికల సమయంలోనే రేవంత్(Revanth) ప్రకటించారు. అప్పటి హామీ ప్రకారమే ఈమధ్యనే అసెంబ్లీలో తీర్మానంచేసి గవర్నర్ సంతకం ద్వారా బిల్లును ఢిల్లీకి కూడా పంపారు. ఢిల్లీలో బిల్లు పెండింగులో ఉందికాబట్టి రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అడ్వాంటేజ్ కోసమని రేవంత్ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలుచేయాలని డిసైడ్ అయ్యారు. దాని ప్రకారమే క్యాబినెట్ లో చర్చించి ఆమోదం తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వం మీద కవిత పెట్టిన ఒత్తిడి ఏమీలేదు.

అయినా సరే కవిత తనకు అనుకూలంగా ప్రకటనలు చేసి సంబరాలు చేసుకున్నారు. దీన్నే తీన్మార్ ప్రశ్నించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో కాని, క్యాబినెట్ ఆర్డినెన్స్ జారీచేయాలన్న నిర్ణయంతో కాని అసలు కవితకు ఏమి సంబంధమని నిలదీశారు. ఈసందర్భంలోనే కవితను ఉద్దేశించి తీన్మార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కవితపై తీన్మార్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని జాగృతి(Jagruthi) నేతలు తట్టుకోలేకపోయారు. కవితను ఉద్దేశించి తీన్మార్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం అయితే పోలీసులకు ఫిర్యాదుచేయాలి కాని భౌతికదాడికి పాల్పడటం ముమ్మాటికీ తప్పే. తెరవెనుక ఏమి జరిగిందో తెలీదుకాని ఆదివారం మధ్యాహ్నం సడెన్ గా తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి నేతలు, కార్యకర్తలు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. పోలీసులు ఘటనపై ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఏమి జరగాలో అది జరుగుతుంది.

ఇదేపద్దతిలో ఈమధ్యనే మహాన్యూస్ ఛానల్ ఆఫీసు మీద బీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన విషయం గుర్తుండే ఉంటుంది. టెలిఫోన్ ట్యాపింగ్ చేయించి కొందరు హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని, లొంగదీసుకున్నారని మహాన్యూస్ ఛానల్లో వరసబెట్టి కథనాలు ప్రసారమయ్యాయి. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా హీరోయిన్లను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని, లొంగదీసుకున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది కాని అందుకు ఆధారాలు మాత్రం ఎక్కడా కనబడలేదు. దాంతో కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తు ఛానల్ కథనాలు ఇస్తోందన్న కోపంతో ఆఫీసు మీద దాడిచేసి కారుపార్టీ నేతలు, కార్యకర్తలు ధ్వసంచేశారు. వీడియో ఆధారాలతో దాడిచేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్, జాగృతి నేతల్లో పెరిగిపోతున్న అసహనం స్పష్టంగా కనబడుతోంది.

Tags:    

Similar News