అంత మంది ఆయారాం గయారాంలతో కాంగ్రెస్ కు లాభమా నష్టమా ?

ఈ వలసలు, ఫిరాయింపులను చూస్తుంటే మూడు ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ నష్టపోతుంది ? ఏ పార్టీ లాలభపడుతుందనే విషయాన్ని ఎన్నికల విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు.

Update: 2024-04-19 09:40 GMT
Telangana CM Revanth

పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్ది పార్టీల మధ్య వలసలు, ఫిరాయింపులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వలసలు, ఫిరాయింపులను చూస్తుంటే మూడు ప్రధాన పార్టీల్లో ఏ పార్టీ నష్టపోతుంది ? ఏ పార్టీ లాలభపడుతుందనే విషయాన్ని ఎన్నికల విశ్లేషకులు కూడా చెప్పలేకపోతున్నారు. నామినేషన్లు వేయటం మొదలైన తర్వాతకూడా కంటిన్యుఅవుతున్న వలసలు, ఫిరాయింపులు పోలింగ్ తేదీ ముందు ఆగేట్లుంది. నదులన్నీ సముద్రంలోనే కలిసినట్లు ప్రస్తుం బీఆర్ఎస్, బీజేపీ నుండి వలసలన్నీ కాంగ్రెస్ వైపే జరుగుతున్నాయి. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో వలసలు, ఫిరాయింపులు మొదలయ్యాయి. పై రెండు పద్దతుల్లో ఇప్పటికి బాగా నష్టపోయిన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ అనే చెప్పాలి. పదేళ్ళ కేసీయార్ పాలనలో టీడీపీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఎలాగైతే వెళ్ళారో అలాగే ఇపుడు వెనక్కు వచ్చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు.

తమ పార్టీలో నుండి ఎంఎల్ఏలు, సీనియర్ నేతలు ఇంతవేగంగా కాంగ్రెస్ లో చేరిపోతారని కేసీయార్ కూడా ఊహించుండరు. అందుకనే పార్టీని వదిలేస్తున్న వాళ్ళని కుక్కలు, నక్కలు, పనికిమాలిన వాళ్ళంటు శాపనార్ధాలు పెడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లోగానే ఎంతవీలైతే అంతమందిని బీఆర్ఎస్ లో నుండి లాగేసుకుని కేసీయార్ ను లేవకుండా దెబ్బకొట్టాలని రేవంత్ రెడ్డి గట్టి టార్గెట్టే పెట్టుకున్నట్లున్నారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలను ఒక ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో 15 పార్లమెంటు సీట్లలో గెలవటమే రేవంత్ టార్గెట్ గా పెట్టుకున్నారు. తన టార్గెట్టుకు తగ్గట్లుగానే కారుపార్టీ నుండి నేతలను లాగేసుకుంటున్నారు.

ఇప్పటికి ముగ్గురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరిపోయారు. రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్ శనివారం చేరబోతున్నారు. తొందరలోనే మరో 20 మంది ఎంఎల్ఏలు కారుదిగేసి హస్తాన్ని పట్టుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ ప్రచారం పెరిగేకొద్దీ కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పార్లమెంటు ఎన్నికలైపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీయార్ శాపనార్ధాలు పెడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, చేవెళ్ళ ఎంపీ అభ్యర్ధి రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్ధి పట్నం సునీతారెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య బీఆర్ఎస్ నుండే కాంగ్రెస్ లోకి వచ్చి పోటీచేస్తున్నారు. మాజీ ఎంఎల్ఏలు కోనేరుకోనప్ప, విఠల్ రెడ్డి, మదనరెడ్డి, మాజీ ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంఎల్సీ పురాణం సతీష్, రాజేశ్వర్, కేంద్రమాజీమంత్రి వేణుగోపాలాచారి కాంగ్రెస్ లో చేరారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కారుపార్టీలో నుండి వచ్చేసి కాంగ్రెస్ లో చేరిన నేతలే.

అలాగే బీజేపీలో నుండి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కొడుకు మిథున్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మక్తల్ నుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన జలంధర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ లో పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్, సంగారెడ్డిలో పోటీచేసిన పులిమామిడి రాజు, మానకొండూరులో పోటీచేసిన మోహన్ తదితరులంతా బీజేపీకి రాజీనామా చేసి హస్తంపార్టీలో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసి రెండోస్ధానంలో నిలిచిన శ్రీ గణేష్ కూడా రాజీనామా చేశారు. గణేష్ ఇపుడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపును టార్గెట్టుగా పెట్టుకుని వలసలు, ఫిరాయింపులను రేవంత్ బాగా ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలుచుకుంటుందనే నమ్మకంతో రేవంత్ ఉన్నారు.

బీఆర్ఎస్ నేతల్లో అత్యధికులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే బీజేపీలో చేరుతున్నారు. అలాగే కాంగ్రెస్ లో ఉన్న ఆదిలాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత తొందరలోనే బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వెంకటేష్ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. మొత్తంమీద ఇతర పార్టీల నుండి వస్తున్న వలసలు, ఫిరాయింపులతో కాంగ్రెస్ ఏ మేరకు లాభపడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. చివరకు మందెక్కువైతే మజ్జిగ పలుచనవుతుందనే సామెతలాగ కాంగ్రెస్ పరిస్ధితి తయారవుతుందేమో అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.

రేవంత్ సంజాయిషీ ఇవ్వాలి

ఇదే విషయమై రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు కూరపాటి వెంకటనారాయణ ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ లో చేర్చుకుంటే ఏమిలాభమని ప్రశ్నించారు. ‘పదేళ్ళు బీఆర్ఎస్ లో ఉండి దోపిడిచేశారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్ళని కాంగ్రెస్ లో చేర్చుకోవటం వల్ల ఏమిటి ఉపయోగమ’ని ప్రశ్నించారు. ‘బీఆర్ఎస్ లో నుండి ప్రజాప్రతినిధులను, సీనియర్ నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటన్నారనే విషయమై రేవంత్ రెడ్డి ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల’న్నారు. వలసలు, ఫిరాయింపులపై ప్రజలను కన్వీన్స్ చేయకపోతే కాంగ్రెస్ కు నష్టం తప్పదని కూరపాటి అభిప్రాయపడ్డారు. 

అవసరం కాదు అనివార్యం

ఇదే విషయమై సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతు నేతలను చేర్చుకోవటం అవసరం కాదు అనివార్యమన్నారు. ‘బీఆర్ఎస్ నుండి ప్రజాప్రతినిధులు, నేతలను చేర్చుకోవటం కాంగ్రెస్ కు చాలా అవసరమ’ని అభిప్రాయపడ్డారు. ‘పార్టీల వ్యవహారం చూస్తుంటే అన్నీపార్టీల్లోను గట్టి అభ్యర్ధులకొరత ఉన్నట్లు స్పష్టమవుతోంద’న్నారు. కాంగ్రెస్, బీజేపీకి అభ్యర్ధులను తామే సరఫరా చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అనుకోవటం హాస్యాస్పదమన్నారు. వలసల వల్ల కాంగ్రెస్ కు లాభ జరుగుతుందన్నారు. ‘కాకపోతే వచ్చి చేరేవాళ్ళతో కాంగ్రెస్ లో మరికొన్ని ముఠా గొడవలు పెరుగుతాయంతే’ అని తెలకపల్లి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News