కేటీఆర్ పాత పాటని పట్టభద్రులు నమ్ముతారా?

కేటీఆర్ చెప్పే మాటల్లో నిజమెంత? నిజంగా ఉద్యోగాలిచ్చి చెప్పుకోలేదా? ఆయన పాత పాటని పట్టభద్రులు నమ్ముతారా? ఒకసారి పరిశీలిద్దాం.

Update: 2024-05-26 16:40 GMT

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఒకటే నినాదంతో ముమ్మర ప్రచారం చేశారు. మేము ఉద్యోగాలు కల్పించి చెప్పుకోవడంలో విఫలమయ్యామంటూ గ్రాడ్యుయేట్ల మనసు దోచేందుకు ప్రయత్నించారు. ఉద్యోగాల కల్పనలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను దేశంలోని ఏ రాష్ట్రం అధిగమించలేకపోయిందని పదే పదే చెబుతూ వచ్చారు. మేము నోటిఫికేషన్ ఇచ్చి, కేవలం భర్తీ చేయడం అండర్ ప్రాసెస్ లో ఉన్న ఉద్యోగాలకు నియామకాలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్స్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు. మరి కేటీఆర్ చెప్పే మాటల్లో నిజమెంత? నిజంగా ఉద్యోగాలిచ్చి చెప్పుకోలేదా? ఆయన పాత పాటని పట్టభద్రులు నమ్ముతారా? ఒకసారి పరిశీలిద్దాం.

కేటీఆర్ కి సవాల్...

సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్సీ ఉపఎన్నిక స్థానాన్ని గెలిచి సత్తా చాటాలని కేటీఆర్ ముమ్మర ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్లతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బిట్స్ పిలానీ కావాలా? పల్లి బఠాణి కావాలా..? అంటూ గ్రాడ్యుయేట్లను విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య నేతలంతా ప్రచారంలో పాల్గొన్నప్పటికీ గెలుపు భారమంతా కేటీఆర్ భుజాలపైనే వేసుకున్నారని స్పష్టం అవుతోంది. నిర్విరామంగా మూడు జిల్లాల్లోనూ ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు.

గ్రాడ్యుయేట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్...

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్ కి బలంగా దెబ్బకొట్టారు అనే చెప్పాలి. ఇదే స్థానానికి జరిగిన గత ఎన్నికల సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించండి. 50 వేల ఉద్యోగాలిస్తా అని కేసీఆర్ మాట తప్పారు. మునుగోడు ఎన్నికలప్పుడూ ఇదే చెప్పారు. కానీ జరగలేదు. దీంతో విసుగు చెందిన హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం కోచింగులు తీసుకుంటున్న నిరుద్యోగులు, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కొలువుల కోసం నోటిఫికేషన్లకై ఆశగా ఎదురు చూసి చిన్న చిన్న ప్రయివేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డవారంతా ఎన్నికల ముందు ఊళ్ళకి వెళ్లారు. బీఆర్ఎస్ ని గద్దె దింపేందుకు స్వయంగా ప్రతిజ్ఞ పూనారు. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. రూరల్ నియోజకవర్గాల్లో నిరుద్యోగుల రూపంలో కారు పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఈ క్రమంలో మళ్ళీ వారి విశ్వాసం చూరగొనేందుకు కేటీఆర్ మేము ఉద్యోగాలిచ్చాం, చెప్పుకోలేకపోయాం అని గ్రాడ్యుయేట్లకు వివరించే ప్రయత్నం చేశారు.

కేటీఆర్ ప్రచారం ఇలా...

ఎక్కువశాతం అధికార పార్టీనే లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాల కల్పన వివరాలను పట్టభద్రులకు చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు.. ఉద్యోగాల కల్పనలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను దేశంలోని ఏ రాష్ట్రం అధిగమించలేకపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అందజేసిన నియామకపత్రాలు కేవలం గత ప్రభుత్వం నోటిఫై చేసి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేసిన ఖాళీలకు మాత్రమే అని చెప్పుకొచ్చారు.

"2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగాల కల్పనలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, వాస్తవాలను విజయవంతంగా యువత ముందు ఉంచలేకపోయింది. BRS ప్రభుత్వం తన హయాంలో 2,32,000 లక్షల ఖాళీల భర్తీకి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీటిలో 1,92,600 ఖాళీలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేశారు. అదే సమయంలో మరో 32,517 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించారు. 5204 స్టాఫ్ నర్సుల పోస్టులు, 587 ఎస్‌ఐలు, ఏఎస్‌ఐల పోస్టులు కూడా వాటిలో భాగమే. వివిధ సాంకేతిక కారణాల వల్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆలస్యమైంది."

"2004 నుండి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇవ్వగా, BRS ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో సంవత్సరానికి 19,400 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చింది. గత BRS హయాంలో చేసిన కృషి ప్రైవేట్ రంగ వృద్ధికి ఊతమివ్వడం కోసం రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంలో దోహదపడింది. ప్రైవేటు రంగంలో 24 వేల పరిశ్రమలకు పర్మిషన్ ఇచ్చాం. 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేటులో వచ్చాయి. మా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఉపాధిని సృష్టించింది" అంటూ కేటీఆర్ లెక్కలు చెప్పి మేము ఉద్యోగాలిచ్చాం నమ్మండి, నమ్మి ఓటేయండి అని పట్టభద్రులకు విజ్ఞప్తులు చేసుకున్నారు.

పట్టభద్రులు కేటీఆర్ మాటలు నమ్ముతారా... 

మేము చెప్పుకోలేకపోయాం అంటూ కేటీఆర్ చెప్పే మాటలు గ్రాడ్యుయేట్లు నమ్ముతారా అనేదే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న చిక్కు ప్రశ్న. ఎందుకంటే చెప్పుకోలేకపోయాం అనే మాటే అవాస్తవం కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు పదేపదే మేము ఉద్యోగాలిచ్చాం అని కేసీఆర్, కేటీఆర్ అన్ని మాధ్యమాల్లోను, వేదికలపైనా ప్రచారం చేసుకున్నారు. కేటీఆర్ ట్విట్టర్ లో కూడా ఉద్యోగాలిచ్చాము అని చాలాసార్లు ట్వీట్లు చేశారు. అప్పుడు నమ్మి ఓటేయని పట్టభద్రులు ఇప్పుడు ఓటేస్తారా? అనేది వేచి చూడాలి.

2022 లో జాబ్స్ గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ :

Tags:    

Similar News