KTR Jail|కేటీఆర్ జైల్ సెంటిమెంట్ వర్కవుటవుతుందా ?
జైలుకు పోవటానికి సిద్ధంగా ఉన్నానని, ఏ కేసైనా సరే పెట్టుకోమని పదేపదే రేవంత్ ను కవ్విస్తున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈమధ్య పదేపదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక చాలెంజ్ చేస్తున్నారు. అదేమిటంటే దమ్ముంటే తనను అరెస్టుచేయమని. జైలుకు పోవటానికి సిద్ధంగా ఉన్నానని, ఏ కేసైనా సరే పెట్టుకోమని పదేపదే రేవంత్ ను కవ్విస్తున్నారు. తనను జైలుకు పంపిస్తే కసరత్తులు చేసి స్లిమ్ముగా తయారైవస్తానని ప్రభుత్వానికి చెబుతున్నారు. కేటీఆర్(KTR) మీద చాలా ఆరోపణలు వినబడుతున్నాయి. వినబడుతున్న ఆరోపణల్లో ప్రధానమైనవి ఏమిటంటే పదేళ్ళ అధికారంలో ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాపింగ్(Phone Tapping) చేయించారని, లగచర్ల గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద జరిగిన దాడికి సూత్రదారని, ఫార్ములా ఈ కార్ రేసు ఏర్పాట్లలో భారీ అవినీతికి పాల్పడ్డారని. వీటిల్లో ఫార్ముల కార్ రేసు(Formula Car race)లో రు. 55 కోట్ల కేటీఆర్ అవినీతిలో ఆధారాలు కూడా ఉన్నాయని ప్రభుత్వం నమ్ముతోంది. అందుకనే కేటీఆర్ మీద కేసు నమోదుచేసి విచారణచేయమని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఏసీబీ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాశారు.
కేటీఆర్ మీద ఆరోపణలు లేదా నమోదవ్వబోయే కేసు ఎంతవరకు నిర్ధారణ అవుతుందో ఇపుడే చెప్పటం కష్టం. ఎందుకంటే కేటీఆర్ అవినీతికి ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఫార్ముల కార్ రేసు ఏర్పాట్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, అదసలు కేసే కాదని కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం, కేటీఆర్ వాద, ప్రతివాదాలు ఎలాగున్నా కేసునమోదు చేసి కేటీఆర్ ను విచారించటమే కాకుండా కేసులో ఏసీబీ లోతైన దర్యాప్తు చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది. ఇక టెలిఫోన్ ట్యాపింగ్ సూత్రదారులు ఎవరు ? అన్న విషయం ఇపుడిప్పుడే బయటపడుతుందనే నమ్మకం ఎవరిలోను లేదు. ఎందుకంటే కీలక పాత్రదారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ. ప్రభాకరరావు అమెరికాకు పారిపోయారు. మాజీ చీఫును అమెరికా నుండి రప్పించటం తెలంగాణా ప్రభుత్వం వల్ల కావటంలేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనుకున్నంతగా ముందుకు సాగటంలేదు. కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ పాత్ర నిరూపణపై ఎవరిలోను నమ్మకంలేదు.
ఇక చివరగా లగచర్ల గ్రామసభ దాడి ఘటనలో కూడా కేటీఆర్ పాత్రను పోలీసులు నిరూపించటం కష్టమే. దాడికి కీలక పాత్రదారుడిగా అరెస్టయి, జైలులో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చిన పట్నంనరేంద్రరెడ్డి పాత్రనే పోలీసులు ఇప్పటివరకు సమర్ధవంతంగా నిరూపించటంలో నానా అవస్తలు పడుతున్నారు. కాబట్టి ఈ కేసులో కేటీఆర్ పాత్రుందని నిరూపించటం పోలీసులకు అంత తేలికకాదు.
అయితే కేటీఆర్ మాత్రం పదేపదే ఎందుకు తనను జైలుకు పంపమని ప్రభుత్వాన్ని కవ్విస్తున్నట్లు ? ఎందుకంటే కేటీఆర్లో జైలు సెంటిమెంటు(Jail Sentiment) బాగా పెరిగిపోతోందట. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్పి ఎద్దేవా చేస్తున్నారు. జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళల్లో కొందరు తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారనే సెంటిమెంట్ ఒకటి ప్రచారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి(JaganMohan Reddy), చంద్రబాబునాయుడు(Chandrababu Naidu), హేమంత్ సోరేన్(Hemanth Soren) ఉదంతాలు ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి తాను కూడా అరెస్టయి కొద్దిరోజులు జైలులో ఉంటే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవుదామని కేటీఆర్ కలలు కంటున్నట్లు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవుదామని కేటీఆర్ అనుకుంటే మరి కేసీఆర్ పరిస్ధితి ఏమిటని ఎంపీ సందేహం లేవనెత్తారు.
ముఖ్యమంత్రి అవుదామని కేటీఆర్ అనుకుంటుంటే ఇక కేసీఆర్ రాజకీయజీవితం ముగిసినట్లేనా ? అని ఎంపీ సూటిగా ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కన్న కేసీఆర్(KCR) చివరకు ఫామ్ హౌసుకు మాత్రమే పరిమితమైన విషయాన్ని ఎంపీ గుర్తుచేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పేంత సీన్ కేసీఆర్ కు లేదన్న విషయమై కేటీఆర్లో అనుమానాలు మొదలైందా ? అని ఎంపీ అనుమానం వ్యక్తంచేశారు. చేసిన అవినీతికి కేటీఆర్ జైలుకు వెళతారే కాని భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారనే సెంటిమెంటు నిజంచేసేందుకు కాదని చామల చమత్కరించారు. మరి కేటీఆర్ కోరికను రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం ఎప్పుడు తీరుస్తుందో చూడాల్సిందే.